
‘హైడ్రా.. పేదల ఇళ్లు కూల్చట్లేదు’
ప్రారంభంలో మేము చూపిన దూకుడుతో చెరువుల ఆక్రమణలు తగ్గాయి.
గ్రేటర్ పరిధిలో చెరువులు, కుంటల ఆక్రమణలకు స్వస్థి పలకడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థే హైడ్రా. రంగనాథ్ కమిషనర్‌గా ఏర్పటయిన హైడ్రా.. తొలి రోజు నుంచి దూకుడుగా వ్యవహరిస్తోంది. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ఆక్రమణలను పెకలించింది. ఈ క్రమంలో అనేక ప్రాంతాల్లో అధికంగా పేదల ఇళ్లే నేలమట్టం అయ్యాయి. దీంతో హైడ్రా తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అయితే శుక్రవారం హైడ్రా ఏర్పటై ఏడాది అయింది. ఈ సందర్భంగానే హైడ్రా కమిషనర్ రంగనాథ్.. ఘనంగా వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రారంభంలో తాము చూసిన దూకుడు కారణంగానే చెరువులు, కుంటల ఆక్రమణలు తగ్గాయని చెప్పారు. అదే విధంగా తాము పేదల ఇళ్లు కూల్చడం లేదని అన్నారు.
భావితరాలకు మంచి భవిష్యత్‌ను అందించడం కోసమే హైడ్రా ఏర్పటయిందని గుర్తు చేశారు. ‘‘సీఎం రేవంత్ ఆదేశాలతో సామాజిక కోణంలో ఆలోచించి పేదల ఇళ్ల జోలికి వెళ్లడం లేదు. కబ్జాలు చేసిన వాళ్లే హైడ్రాపై విమర్శలు చేస్తున్నారు. సెప్టెంబర్ 21న సీఎం రేవంత్.. బతుకమ్మ కుంటలను ప్రారంభిస్తారు. హైడ్రా అంటే డిమాలీషన్, డెవలప్‌మెంట్. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన బతుకమ్మకుంట శాంపిల్ మాత్రమే.. త్వరలో ఎన్నో బతుకమ్మ కుంటలు వెలుగులోకి వస్తాయి’’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.