బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విద్యుత్ వివాదం
x
Source: Facebook

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విద్యుత్ వివాదం

తెలంగాణలో నెలకొంటున్న కరెంటు కోతలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. రానున్న వేసవిలో ఈ వివాదం మరింత ముదురుతుందా..



తెలంగాణ రాజకీయాల్లో విద్యుత్ సరఫరా అంశం కీలకంగా మారింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విద్యుత్ వినియోగంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. వేసవి ఆరంభంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య విద్యుత్ వివాదం ముదురుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్ర ప్రజలు ఏనాడూ కరెంట్ కోతలతో ఇబ్బంది పడలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఊరు చూసినా కరెంటు కోతలే కనిపిస్తున్నాయని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు చేశారు.

24 గంటలు కరెంటు కోతలైనా ఉండొచ్చు

కేసీఆర్ సీఎంగా ఉన్న రోజుల్లో ప్రజలకు ఎటువంటి సమస్యలు లేవని చెప్పారు హరీశ్ రావు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు సమస్యలే సమస్యలు వస్తున్నాయన్నారు. ‘‘రాష్ట్రంలో ఉచిత కరెంట్ రేషన్ కార్డులు 90 లక్షలు ఉంటే కాంగ్రెస్ సర్కార్ వాటిని కేవలం 30 లక్షల మందికే ఇస్తోంది. 60 లక్షల మందికి ఎగ్గొట్టింది. లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాక రాష్ట్రంలో 24 గంటలూ కరెంటు కోతలు వచ్చినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. అలా జరగకూడదంటే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలంతా కలిసి కాంగ్రెస్‌ను ఓడించాలి. అప్పుడే 24 గంటల విద్యుత్, రైతుబంధు, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలు వస్తాయి. అలా కాకుంటే రాష్ట్ర పరిస్థితి అధోగతే అవుతుంది’’అని హెచ్చరించారు.



డిమాండ్ కన్నా ఎక్కువ విద్యుత్ సరఫరా: భట్టి

మాజీ మంత్రి హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘాటుగా బదులిచ్చారు. ఈ నాలుగు నెలల్లో కాంగ్రెస్ సర్కార్ గత ప్రభుత్వం కన్నా అధికంగా విద్యుత్‌ను సరఫరా చేసిందని వెల్లడించారు. ‘‘మార్చి 8న 15,623 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేశాం. ఇది రాష్ట్ర చరిత్రలో అత్యధికం. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ కావాలా? కరెంట్ కావాలా? కాంగ్రెస్ గెలిస్తే కరెంట్ ఉండదని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా కాంగ్రెస్ ప్రభుత్వమే అత్యధిక విద్యుత్‌ను సరఫరా చేస్తుంది. విద్యుత్ వినియోగం అత్యధికంగా ఉన్న సమయాల్లో కూడా కరెంటు కోతలు లేకుండా చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే’’ అని భరోసా కల్పించారు.

విద్యుత్ సరఫరా గణాంకాలు ఇలా

2022 డిసెంబర్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం 200 మిలియన్ యూనిట్లను సరఫరా చేస్తే 2023 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ తొలి నెలలోనే 207.07 మిలియన్ యూనిట్ల కరెంటును సరఫరా చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. ‘‘ 2023 జనవరిలో బీఆర్ఎస్ ప్రభుత్వం 230.54 మిలియన్ యూనిట్లు సరఫరా చేయగా 2024 జనవరిలో కాంగ్రెస్ సర్కార్ 243.14 మిలియన్ యూనిట్లు సరఫరా చేసింది. 2023 ఫిబ్రవరిలో బీఆర్ఎస్ 263.38 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను అందిస్తే 2024 ఫిబ్రవరిలో కాంగ్రెస్ 272.85 మిలియన్ యూనిట్ల కరెంటు‌ను అందించింది’’అని గణాంకాలను ప్రకటించారు.




డిమాండ్‌కు తగ్గట్టుగానే సరఫరా

ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరగనుందని, దానికి అనుగుణంగానే తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు భట్టి. అందులో భాగంగా వేసవిలో విద్యుత్ డిమాండ్ గరిష్టంగా 16,500 మెగావాట్లకు చేరినా దానిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేరుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పీక్ అవర్స్‌లో కూడా విద్యుత్ కట్ కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, దీనిపై ఇప్పటికే విద్యుత్ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో చర్చలు చేస్తున్నామని వెల్లడించారు.

మరింత మండనున్న కరెంటు మంటలు

తెలంగాణ ప్రజల డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్‌ను సరఫరా చేయడంలో కాంగ్రెస్ విఫలమవుతోందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తుంటే అందులో వాస్తవాలు లేవని, బీఆర్ఎస్ హయాంలో కన్నా కాంగ్రెస్ పాలనలోనే ప్రజల విద్యుత్ అవసరాలు తీరుతున్నాయని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. విద్యుత్ సరఫరాను కూడా బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్‌ పార్టీనే ఎక్కువగా చేస్తుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కొనసాగుతున్న విద్యుత్ వివాదం వేసవి ఎండలు ముదిరే కొద్ది అంతకంతా పెరగొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Read More
Next Story