
ప్రభాకర్ రావు హ్యాపీ..మరో నెలరోజులు రక్షణ
అరెస్టు నుండి మరో నెలరోజులు సుప్రింకోర్టు(Supreme Court) రక్షణ కల్పించింది
టెలిఫోన్ ట్యాపింగులో కీలకపాత్ర పోషించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్ఐబీ)మాజీ చీఫ్ టీ ప్రభాకరరావు హ్యాపీగా ఉండచ్చు. అరెస్టు నుండి మరో నెలరోజులు సుప్రింకోర్టు(Supreme Court) రక్షణ కల్పించింది. టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) కేసుపై సుప్రింకోర్టులో మంగళవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాధి సిద్ధార్ధలూథ్రా వాదనలు వినిపించారు. ప్రభాకరరావు తరపున దామా శేషాద్రినాయుడు వాదించారు. మొదట లూథ్రా వాదనలు వినిపిస్తు నిందితుడు ప్రభాకరరావు సిట్ విచారణకు ఏమాత్రం సహకరించటంలేదన్నారు. అరెస్టు రక్షణ కారణంగా ప్రభాకరరావు సహకరించటంలేదని కాబట్టి నిందితుడిని కస్టోడియల్ విచారణకు అప్పగించాలని కోరారు.
కస్టోడియల్ విచారణ ద్వారానే అన్నీ విషయాలు, నిజాలు బయటకు వస్తాయన్నారు. సిట్ అధికారులు అడిగినట్లుగా ప్రభాకరరావు ఐఫోన్, క్లౌడ్ పాస్ వర్డ్ ఇవ్వటంలేదని ఆరోపించారు. రాజకీయనేతలు, జర్నలిస్టులు, జడ్జీలు, ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు, బిల్డర్లు, వ్యాపారుల వేలాది ఫోన్లను ప్రభాకరరావు అక్రమంగా ట్యాప్ చేయించారని చెప్పారు. ఈ ఫోన్లన్నింటినీ మావోయిస్టులు లేదా మావోయిస్టుల సానుభూతిపరులు అన్న ముసుగులో అక్రమంగా ట్యాప్ చేయించినట్లు ఆరోపించారు. 2023లో ప్రభుత్వం మారగానే తాము చేయించిన ట్యాపింగ్ కు సంబంధించిన డేటా మొత్తాన్ని డిలిట్ చేశారని, కంప్యూటర్లలోని హార్డ్ డిస్కులను మాయంచేసి 50 కొత్త హార్డు డిస్కులను ఏర్పాటు చేసినట్లు తేలిందన్నారు.
తర్వాత నిందితుడి లాయర్ శేషాద్రినాయుడు మాట్లాడుతు డివైజ్ రీసెట్ చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రభాకరరావు సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు చెప్పారు. కంప్యూటర్లలో డేటాను డిలిట్ చేసింది ప్రభాకరరావు కాదని డిపార్ట్ మెంటని గుర్తుచేశారు. 11 సార్లు పిలిపించి 80 గంటలు సిట్ తన క్లైంటును విచారించిన విషయాన్ని దామా ధర్మాసనానికి వివరించారు. విచారణకు సహకరిస్తున్నపుడు ప్రత్యేకించి అరెస్టు రక్షణను తొలగించాల్సిన అవసరం ఏముందని వాదించారు. రెండువైపుల వాదనలు విన్న ధర్మాసనం ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ప్రభాకరరావు క్లౌడ్ పాసవర్డ్ సెట్ చేయటానికి సహకరించాలని ఆదేశించింది. తర్వాత విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది. అంతవరకు నిందితుడికి అరెస్టు నుండి రక్షణ కొనసాగుతుందని స్పష్టంచేసింది.
ప్రభుత్వం మారిన తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ అంశం వెలుగులోకి వచ్చింది. ట్యాపింగులో మొదటి అరెస్టు 2024, మార్చి 10వ తేదీన జరగ్గానే మరుసటి రోజే మరో నిందితుడు శ్రవణ్ రావుతో కలిసి ప్రభాకరరావు అమెరికాకు పారిపోయాడు. అప్పటినుండి ఇప్పటికీ ప్రభాకరరావు సిట్ విచారణకు సహకరించటంలేదని సిట్ వాదిస్తునే ఉంది. దాదాపు ఏడాదికి పైగా అమెరికాలోనే గడిపిన నిందితుడు సుప్రింకోర్టు హెచ్చరికలతో మాత్రమే ఇండియాకు తిరిగొచ్చాడు. అయితే విచారణను ఎదుర్కొనే ముందే నిందితుడికి సుప్రింకోర్టు అరెస్టు రక్షణ కల్పించింది. ఈ రక్షణను అడ్డుపెట్టుకుని ప్రభాకరరావు గడచిన ఆరుమాసాలుగా సిట్ ను బాగా ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం. 2023 ఎన్నికలసమయంవరకు వాడిన ఫోన్లన్నింటినీ ఇవ్వమని అడుగుతున్నా ఇవ్వలేదు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పటంలేదు. ఇచ్చిన ఐఫోన్ పాస్ వర్డ్ చెప్పమంటే చెప్పటంలేదు.
అందుకనే సిట్ ఎప్పటికప్పుడు ప్రభాకరరావు అరెస్టు రక్షణను తొలగించి కస్టోడియల్ విచారణకు అడుగుతోంది. అందుకు సుప్రింకోర్టు నిరాకరిస్తోంది. ప్రతివిచారణను సుప్రింకోర్టు నెలా లేదా రెండునెలలు వాయిదా వేస్తు ఎప్పటికప్పుడు ప్రభాకరరావుకు అరెస్టు నుండి రక్షణను పొడిగిస్తోంది. అందుకనే ప్రభాకరరావు హ్యాపీ అన్నది.