
ప్రభాకర్ రావు వెరీ లక్కీ
మొదటి అరెస్టు జరిగిన మరుసటిరోజే ప్రభాకరరావు అమెరికాకు పారిపోయారు
టెలిఫోన్ ట్యాపింగులో కీలకపాత్రదారి టీ ప్రభాకరరావు వెరీ వెరీ లక్కీ అనే చెప్పాలి. బీఆర్ఎస్(BRS) హయాంలో అధినేత ప్రత్యర్ధులకు చెందిన వేలాది మొబైల్ ఫోన్లను ప్రభాకరరావు ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ఏళ్ళతరబడి ట్యాపింగ్(Telephone Tapping) చేసింది. అనధికారికంగా అదికూడా మావోయిస్టు(Maoists)ల మద్దతుదారులు, మావోయిస్టుల సింపధైజర్లనే ముసుగులు వేసి మరీ వేలాది ఫోన్లను ట్యాప్ చేశారు. ఈ ట్యాపింగ్ అరాచకానికి నాయకత్వం వహించింది ప్రభాకరరావే. ఆయన నేతృత్వంలో పోలీసు అధికారులు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావుతో పాటు ఒక మీడియా అధిపతి శ్రవణ్ రావు ఇష్టారాజ్యంగా అరాచకాలకు పాల్పడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మొదటి అరెస్టు జరిగిన మరుసటిరోజే ప్రభాకరరావు అమెరికాకుపారిపోయారు. అప్పటినుండి ఏడాదికిపైగా అమెరికాలోనే ఉండిపోయారు. విచారణకు ఏమాత్రం సహకరించలేదు. శాశ్వతంగా అమెరికాలోనే ఉండిపోయేట్లుగా చాలా ప్రయత్నాలు చేసుకున్నారు. ఇదేసమయంలో సుప్రింకోర్టు గట్టిగా వార్నింగ్ ఇవ్వటంతో వేరేదారిలేక ఇండియాకు రావటానికి అంగీకరించారు. తనను అరెస్టుచేయకుండా రక్షణ కల్పిస్తే హైదరాబాదుకు వస్తానని, స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్(సిట్)కు అన్నీవిదాలుగా సహకరిస్తానని సుప్రింకోర్టులో పిటీషన్ వేసి అరెస్టునుండి రక్షణ పొందారు.
అరెస్టునుండి రక్షణదొరకిన వెంటనే కీలకపాత్రదారి అమెరికానుండి హైదరాబాదుకు తిరిగొచ్చారు. అయితే సిట్ కు ఇప్పటివరకు ఎలాంటి సహకారం అందించలేదు. పైగా తనను ప్రశ్నలతో సిట్ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నట్లు కోర్టులో పిటీషన్ దాఖలు చేయటమే విచిత్రం. అందుకనే సిట్ కూడా ప్రభాకరరావుకు అరెస్టునుండి రక్షణ తొలగించాలని కేసు దాఖలు చేసింది. అరెస్టునుండి రక్షణ ఉన్న కారణంగా సిట్ విచారణకు ప్రభాకరరావు ఏరకంగా కూడా సహకరించటంలేదని సిట్ అదికారులు సుప్రింకోర్టుకు స్పష్టంచేశారు. ఈకేసు విషయంపైనే సోమవారం విచారణ జరిగింది. రెండువైపుల వాదనలు విన్నతర్వాత కేసును నాలుగు వారాలకు వాయిదావేసింది. విచారణలో సిట్ కు అన్నీవిదాలుగా సహకరించాలని చెప్పటమే ఆశ్చర్యం.
ఎవరైనా అరెస్టు భయంతోనే పోలీసులకు విచారణలో సహకరిస్తారు. అలాంటిది పోలీసులు అరెస్టుచేయటానికి లేదని తేలిపోయిన తర్వాత ఇక ఎవరైనా పోలీసులకు ఎందుకు సహకరిస్తారు ? ఇపుడు ప్రభాకరరావు ధైర్యం కూడా అదే. స్వయంగా సుప్రింకోర్టే ప్రభాకరరావును అరెస్టు చేయద్దన్న తర్వాత ఇక పోలీసులు ఏమిచేయగలరు ? తాను సహకరించకపోయినా పోలీసులు తనను ఏమీ చేయలేరన్న ధైర్యంతోనే ప్రభాకరరావు విచారణలో ఏమాత్రం సహకరించటంలేదు. అందుకనే అరెస్టు రక్షణను తొలగించాలని సిట్ అధికారులు సుప్రింకోర్టును కోరింది. ఈరోజు విచారణ నాలుగు వారాలకు వాయిదాపడింది కాబట్టి అప్పటివరకు ప్రభాకరరావు వెరీ లక్కీ అనే చెప్పాలి. ఆ తర్వాత అంటారా ? ఏమి జరుగుతుందో చూడాల్సిందే.