
‘బెట్టింగ్ యాప్ ల జోలికి వెళ్లను’
జంగిల్ రమ్మీ యాప్ నుంచి పైసా రాలేదు: ప్రకాశ్ రాజ్
పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ విచారణ కొనసాగిస్తోంది. జంగిల్ రమ్మీ, జీత్‌విన్, లోటస్ 365.. తదితర బెట్టింగ్ యాప్‌లకు వీళ్లు ప్రమోషన్లు చేయడం వివాదాస్పదమైంది. వీరి ప్రమోషన్ల ప్రభావంతో పలువురు బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మోసపోతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు రూ.వేల కోట్ల రూపాయల మనీలాండరింగ్ కు పాల్పడినట్టు తెలుస్తోంది. హవాలా మార్గంలో పలువురికి డబ్బు పంపించారనే కోణంలో ఈడీ ఆరా తీస్తోంది.
ముగిసిన విచారణ
బెట్టింగ్ యాప్‌ల కేసులో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ విచారణ ముగిసింది. దాదాపు ఐదు గంటలకు పైగా ఆయన్ని ఈడీ అధికారులు ఎంక్వైరీ చేశారు. ఆ క్రమంలో ప్రకాష్ రాజ్ స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేశారు. జంగిల్ రమ్మీ బెట్టింగ్ యాప్‌లో ప్రమోట్ చేసిన వ్యవహారంపై ప్రకాష్ రాజ్‌కు ఈడీ అధికారులు అనేక ప్రశ్నలు సంధించారు. ఆ యాప్ ప్రమోషన్‌లో ప్రకాష్ రాజ్ భారీ నగదు తీసుకున్నట్లు ప్రచారంలో ఉంది.
ఈ యాప్ ప్రమోషన్‌లో ఎంత నగదు వచ్చిందనే కోణంలో ఆయన్ని లోతుగా విచారించినట్లు తెలుస్తుంది. జంగిల్ రమ్మీ యాప్ ద్వారా తనకు ఒక్క పైసా నగదు కూడా రాలేదని ప్రకాశ్ రాజ్ ఈడీ అధికారులకు స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే 2016లో జంగిల్ రమ్మీ యాప్‌ను తాను ప్రమోట్ చేశానని ఈడీ అధికారులకు ప్రకాష్ రాజ్ చెప్పారు.
దుబాయ్‌కి చెందిన బెట్టింగ్ యాప్స్ నుంచి ప్రకాష్ రాజ్ లావాదేవీలు జరిపినట్లు అధికారులు గుర్తించారు.
ఆ కోణంలో ఆయన్ని విచారించారు. దుబాయ్ నుంచి కార్యకలాపాలు నడుస్తున్న బెట్టింగ్ యాప్స్‌ను పలువురు ప్రముఖ సినీనటుటు ప్రమోట్ చేశారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులకు బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన నగదును దుబాయ్‌లోనే పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారులకు సమాచారం ఉంది.
గత ఐదేళ్ల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రకాష్ రాజ్ స్టేట్‌మెంట్‌ను వారు క్షుణ్ణవగా పరిశీలించారు. అలాగే గతంలో జరిగిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై వారికి ప్రకాష్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. జంగిల్ రమ్మీతో కాంట్రాక్ట్ పూర్తయ్యాక.. మళ్లీ పునరుద్దరించుకోలేదని ప్రకాశ్ రాజ్ వారికి స్ప్టం చేశారు. అలాగే భవిష్యత్తులో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని ఈడీ అధికారుల ఎదుట ప్రకాష్ రాజ్ వాగ్దానం చేసినట్లు తెలుస్తుంది.
జంగిల్ రమ్మీ యాప్ యాజమాన్యంతో తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగ లేదని ఈడీ అధికారులకు ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. విచారణ అనంతరం వెలుపలికి వచ్చిన ప్రకాష్ రాజ్ మీడియా తో మాట్లాడుతూ.. బెట్టింగ్ ఆడి ఎవరు మోసపోవద్దని ప్రజలకు ఆయన సూచించారు.