
మళ్లీ ఆందోళనబాట పట్టిన ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు
ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో 13 నుంచి సమ్మె
ఫీజు రీ ఎంబర్స్ మెంట్ చెల్లించకపోవడంతో ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు సమ్మె బాట పట్టడానికి సిద్దమయ్యాయి. ఈ నెల 12 లోపు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే 13 నుంచి సమ్మె బాట పట్టాలని ప్రయివేటు కళాశాలలు నిర్ణయించాయి. ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు అత్యవసరంగా సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. గత నెల 20, 21 తేదీల్లో బకాయిలు చెల్లిస్తామని డిప్యూటి ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క హామి ఇచ్చినప్పటికీ కేవలం 200 కోట్లు మాత్రమే విడుదల చేశారని ఎఫ్ఏటీహెచ్ఐ చైర్మన్ రమేష్ మీడియాతో అన్నారు. ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు భవిష్యత్ కార్యాచరణపై బుధవారం సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నాయి. దీపావళి లోపు 1200 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం హామి ఇచ్చిందని, ఎలా ఇస్తారో తెలియజేయాలని రమేష్ డిమాండ్ చేశారు. ప్రయివేటు కళాశాలల విద్యార్థులతో ఛలో హైద్రాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.
విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచరం
తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు, ప్రభుత్వానికి మధ్య ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదం మళ్లీ ముదురుతోంది. దసరా సెలవుల అనంతరం కాలేజీలను నిరవధికంగా మూసివేయాలని యాజమాన్యాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా తయారైంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజీలు గత నెల 15న బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రభుత్వం, యాజమాన్యాలతో చర్చలు జరిపింది. దసరాకు ముందు రూ.600 కోట్లు, దీపావళి తర్వాత మరో రూ.600 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ కళాశాలల యాజమాన్యాలు సంతృప్తి చెందడం లేదు. ప్రభుత్వ హామీతో యాజమాన్యాలు తమ ఆందోళనను విరమించుకున్నప్పటికీ దసరాకు ముందు కేవలం 200 కోట్ల రూపాయలు విడుదల చేయడంతో ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు ఉద్యమ బాట పట్టడానికి సిద్దమయ్యాయి.
అయితే, ప్రభుత్వం హామీ ఇచ్చి రెండు వారాలు గడిచిపోయినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాతో కాలేజీల ప్రతినిధులు సమావేశమయ్యారు. బకాయిల గురించి ప్రస్తావించగా, ఇప్పుడు నిధులు విడుదల చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం మొండి చేయి చూపినట్టు సమాచారం.