తెలంగాణాలో ప్రైవేటు కాలేజీలు బంద్
x
PVT college at Kodada

తెలంగాణాలో ప్రైవేటు కాలేజీలు బంద్

దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్న ఆర్ధికసమస్య పరిష్కారం విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘం మూతేయాలని డిసైడ్ అయ్యాయి.


తెలంగాణాలో ప్రైవేటు కాలేజీలు మూతపడ్డాయి. దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్న ఆర్ధికసమస్య పరిష్కారం విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘం కాలేజీలను మూతేయాలని డిసైడ్ అయ్యాయి. దసరా పండుగ సందర్భంగా విద్యార్ధులందరికీ సెలవులు ప్రకటించిన యాజమాన్యాలు కాలేజీలను నిరవధికంగా మూసేయాలని డిసైడ్ చేయబోతున్నట్లు ప్రకటించాయి. అందుకనే దసరా పండుగ సెలవుల్లో విద్యార్ధులను ఇళ్ళకు పంపేటప్పుడే కాలేజీలను నిరవధికంగా మూతేస్తున్నట్లు చెప్పి పంపేశాయి. సమస్య పరిష్కారం అయినపుడు కాలేజీలను ఎప్పటినుండి తెరిచేది సమాచారం అందిస్తామని కాలేజీల యాజమాన్యాలు విద్యార్ధులకు చెప్పాయి.

ఇపుడు విషయం ఏమిటంటే ఫీజు రీఎంబర్స్ మెంట్ అన్నది ప్రభుత్వానికి కాలేజీల యాజమాన్యాలకు పెద్ద సమస్యగా మారింది. గడచిన మూడేళ్ళుగా ప్రభుత్వం కాలేజీలకు ఫీజు రీఎంబర్స్ మెంటు చెల్లించటంలేదు. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ కోసం యాజమాన్యాలు ఎంతగా ప్రయత్నించినా అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం కాని ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాని ఎందుకనో సానుకూలంగా స్పందించటంలేదు. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ విషయం మాట్లాడుదామని యాజమాన్యాలు ఎంతగా ప్రయత్నించినా కేసీఆర్, రేవంత్ అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. దాంతో తమకు అందాల్సిన బకాయిల కోసం అడిగి అడిగి విసిగిపోయి చివరకు కాలేజీలను మూసేసాయి.

ఫీజు రీఎంబర్స్ మెంట్ రూపంలో రాష్ట్రంలోని 1800 డిగ్రీ, పీజీ ప్రైవేటు కాలేజీలకు సుమారు రు. 7500 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. క్రమంతప్పకుండా ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లిస్తే కాలేజీలకు ఏడాదికి రు. 2500 కోట్లు చెల్లించాల్సుంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన డిగ్రీ, పీజీ విద్యార్ధులు సుమారు 10 లక్షలమందికి ప్రభుత్వం ఫీజు రీ ఎంబర్స్ మెంట్ చెల్లించాలి. వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బిల్లులను రెడీచేసి ఆర్ధికశాఖకు సకాలంలోనే పంపుతున్నా అక్కడ ఆగిపోతోందని సమాచారం. విచిత్రం ఏమిటంటే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ లోనే విద్యార్ధులకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ అని ప్రభుత్వం బడ్జెట్ సమయంలోనే ప్రకటిస్తున్నా ఆచరణలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడటంలేదు.

ఇదే విషయాన్ని కోదాడలో ఎస్వీ డిగ్రీ, పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ బొబ్బిలి రామకృష్ణారెడ్డి ‘తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ అందని కారణంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1800 డిగ్రీ, పీజీ కాలేజీలను యాజమాన్యాలు మూసేసినట్లు చెప్పారు. ఫీజు రీఎంబర్స్ మెంటు నిధులు అందితే కాని మళ్ళీ కాలేజీలను తెరవకూడదని యాజమాన్యాలు నిర్ణయించినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లన్ నిదుల్లో కేంద్రప్రభుత్వం నుండి 60 శాతం నిధులు అందితే రాష్ట్రప్రభుత్వం వాటాగా 40 శాతం నిధులుంటాయన్నారు. రాష్ట్రం తన వాటా 40 శాతం నిధులను చూపించిన తర్వాతే కేంద్రం తన వాటాగా 60 శాతం నిదులను విడుదలచేస్తుందన్నారు. గడచిన మూడేళ్ళుగా రాష్ట్రప్రభుత్వం తన వాటా 40 శాతం నిధులను విడుదలచేయని కారణంగా కేంద్రం కూడా తన వాటా 60 శాతం నిధులను ఆపేసిందన్నారు.

ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు రాష్ట్రప్రభుత్వంతో సంబంధంలేకుండా కేంద్రం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ (డీబీటీ) పద్దతిలో నిధులను విద్యార్ధుల బ్యాంకు ఖాతాలకు విడుదల చేయాలని ప్లాన్ చేసినట్లు చెప్పారు. అయితే అందుకు కేంద్రం విడుదలచేసిన గైడ్ లైన్సును రాష్ట్రప్రభుత్వం అమలుచేయని కారణంగా డీబీటీ పద్దతి అమల్లోకి రాలేదని రెడ్డి చెప్పారు. మూతపడిన వాటిల్లో డిగ్రీ కాలేజీలు 1600, పీజీ కాలేజీలు 50, బీఈడీ కాలేజీలు 100 దాకా ఉన్నట్లు ప్రిన్సిపల్ చెప్పారు.

గ్రూప్ పరీక్షలపై ప్రభావం

ఇపుడు కాలేజీలు మూతపడిన ప్రభావం గ్రూప్ 1 పరీక్షలపైన పడే అవకాశాలున్నట్లు ప్రిన్సిపాల్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈనెల 21 నుండి 27 వరకు గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు జరగబోతున్నట్లు గుర్తుచేశారు. ఈ పరీక్షలకు అత్యధిక సెంటర్లు ప్రైవేటు కాలేజీలే అన్న విషయాన్ని ప్రిన్సిపాల్ చెప్పారు. నిరవధికంగా ప్రైవేటు కాలేజీలు మూతపడిన కారణంగా ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షలకు ప్రత్యామ్నాయ సెంటర్లను చూసుకోవాలన్నారు. వచ్చేనెలలో గ్రూప్ 3 పరీక్షలతో పాటు డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు కూడా జరగాలన్నారు. ఇప్పటికే జరుగుతున్న పీజీ పరీక్షలను అర్ధాంతరంగా వాయిదా వేసినట్లు చెప్పారు. వేల కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్ మెంటు నిధులను చెల్లించే విషయంలో ప్రభుత్వం నుండి కనీసం హామీ కూడా రాకపోవటం చాలా దురదృష్టమని రెడ్డి అబిప్రాయపడ్డారు. యాజమాన్యాల నిర్ణయం వల్ల విద్యార్ధులతో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నట్లు రెడ్డి చెప్పారు. విద్యాశాఖను కూడా తానే నిర్వహిస్తున్న కారణంగా ఫీజు రీ ఎంబర్స్ మెంట్ సమస్యను పరిష్కరించేందుకు వెంటనే చొరవచూపించాలని రామకృష్ణారెడ్డి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తిచేశారు.

Read More
Next Story