ఆరోగ్య శ్రీ సేవలకు బ్రేకులు.. తగ్గేదేలేదంటున్న ప్రైవేట్ ఆసుపత్రలు
x

ఆరోగ్య శ్రీ సేవలకు బ్రేకులు.. తగ్గేదేలేదంటున్న ప్రైవేట్ ఆసుపత్రలు

నెలకు రూ.100 కోట్లు ఇస్తామన్నా వినిపించుకోని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు.


తెలంగాణలోని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు బుధవారం అర్ధరాత్రి నుంచే ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేశాయి. కొన్ని రోజుల నుంచి హెచ్చరిస్తున్నట్లే అర్థరాత్రి నుంచి సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తమకు రావాల్సిన బకాయిలు వచ్చేంత వరకు ఈ సేవలను పునరుద్దరించమని భీష్మించుకుని కూర్చున్నాయి. ఈ విషయంపై ఫోకస్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు ఒక డీల్ కూడా ఆఫర్ చేశాయి. ప్రతి నెలా కూడా ఆరోగ్య శ్రీ సేవల కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు చెల్లిస్తుందని సర్కార్ తెలిపింది. అయినా సరే.. ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు మాత్రం ససేమిరా అంటున్నాయి. సమ్మె విషయంలో వెనక్కి తగ్గేది లేదని నెట్ వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు వద్దిరాజు రాకేష్ వెల్లడించారు. అయితే ఆరోగ్య శ్రీ సేవలను యథావిధిగా కొనసాగించాలని ఆరోగ్య శ్రీ సీఈఓ ఉదయ్ కుమార్.. ప్రైవేట్ ఆసుపత్రులను కోరారు.

నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి..

‘‘ఆరోగ్య శ్రీ సేవల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. గడిచిన 21 నెలల్లో ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.1,779 కోట్లు చెల్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1375 వైద్య చికిత్సల చార్జీలను సగటున 22 శాతం పెంచాం. ఛార్జీల పెంపు, కొత్త ప్యాకేజీల చేర్పుతో పేషంట్ల కోసం ప్రభుత్వం అదనంగా రూ.487.29 కోట్లు ఖర్చు చేస్తోంది’’ అని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం ఆసుపత్రులకు నెలకు రూ.95 కోట్లు చెల్లిస్తున్నామని, దానిని రూ.100 కోట్లకు పెంచడానికి ప్రభుత్వం అంగీకరించిందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రులన్నీ కూడా తమ సమ్మెను విరమించుకుని ఆరోగ్య శ్రీ సేవలను పునరుద్దరించాలని కోరారు.

రూ.1400 కోట్ల బకాయిలు..

అయితే తమ బకాయిలు చెల్లించే వరకు సమ్మె విరమించమని నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం నుంచి ఆరోగ్య శ్రీ సేవలకు సంబంధించి రూ.1400 కోట్ల బకాయిలు ఉన్నాయని అసోసియేషన్ ప్రెసిడెంట్ వద్దిరాజు రాకేష్ తెలిపారు. ‘‘గతేడాది ఆగస్టు నుంచి బకాయిల చెల్లింపు కోసం ఆసుపత్రులు ఎదురుచూశాయి. కానీ ఎటువంటి ఫలితం లేకపోయింది. దాంతో మరోదారి లేకనే సేవలు నిలిపివేయాలన్న నిర్ణయానికి వచ్చాం. ఆర్థిక సమస్యలతో పాటు ఆసుపత్రుల్లో సేవలకు సంబంధించి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించాలని మంత్రి, ఆరోగ్యశ్రీ సీఈఓలకు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలో 470 ఆసుపత్రులు ఉన్నాయి. వాటన్నింటికీ కలిపి రూ.1400 కోట్ల బకాయిలు ఉన్నాయి’’ అని ఆయన వివరించారు.

ఏడాదిలో రెండోసారి..

2025లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిచిపోవడం ఇది రెండో సారి. ఈ ఏడాది జనవరిలో కూడా దాదాపు ఒక వారం పాటు ఆరోగ్య శ్రీ సేవలను ఆసుపత్రులు బంద్ చేశాయి. 2024 డిసెంబర్ నాటికి ఆరోగ్య శ్రీ.. బకాయిలు రూ.1000 కోట్లు దాటిందని తెలిపిన ఆసుపత్రులు వాటిని వెంటనే చెల్లించాలని కోరాయి. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో జనవరి 10 నుంచి సమ్మెకు దిగాయి. కొన్ని రోజుల పాటు ఆరోగ్య శ్రీ సేవలను ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు నిలిపివేశారు.

Read More
Next Story