బాసర సరస్వతీ నిలయంలో అన్నీ సమస్యలేనా ?
x
Basara IIIT students

బాసర 'సరస్వతీ నిలయం'లో అన్నీ సమస్యలేనా ?

బాసర అనగానే అందరికీ చదువుల సరస్వతే గుర్తుకొస్తుంది. కాని బాసరలో చదువుతున్న విద్యార్ధులు మాత్రం నిత్యం సమస్యలతోనే సావాసం చేస్తున్నారు.


బాసర అనగానే అందరికీ చదువుల సరస్వతే గుర్తుకొస్తుంది. కాని బాసరలో చదువుతున్న విద్యార్ధులు మాత్రం నిత్యం సమస్యలతోనే సావాసం చేస్తున్నారు. అందుకనే ఇక ఎంతమాత్రం సమస్యలతో సావాసం చేయలేమని చెప్పి వేరేదారిలేక ఉద్యమబాట పట్టారు. ఇపుడు విషయం ఏమిటంటే బాసరలోని ఐఐఐటి కాలేజి ఆర్జేయూకేటీ విద్యార్ధులు పోరుబాట పట్టారు. ఎందుకంటే సుదీర్ఘంగా సమస్యలు పరిష్కారం కాకపోవటంతో వేరే దారిలేక విద్యార్ధులంతా కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. కారణాలు స్పష్టంగా తెలీదుకాని చాలా సంవత్సరాలుగా విద్యార్ధులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్నా ఎలాంటి ఉపయోగం కనబడటంలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నపుడు కూడా బాసర విద్యార్ధులు దాదాపు వారంరోజుల పాటు రాత్రి, పగలు, ఎండా, వానను లెక్కచేయకుండా కాలేజి క్యాంపస్ ముందు పెద్ద ఆందోళనే చేశారు.



ఎండకు ఎండి, వానకు తడిసిన విద్యార్ధుల్లో కొందరు తీవ్ర అస్వస్ధతకు గురై ఆసుపత్రుల్లో చేరటం మీడియాలో ప్రముఖంగా వార్తలకెక్కింది. దాంతో అప్పటి ప్రభుత్వం వేరేదారిలేక స్పందించి మంత్రులను విద్యార్దులతో చర్చలకు పంపింది. అప్పటి విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ లాంటి కొందరు సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వటంతో విద్యార్ధులు ఆందోళనను విరమించారు. అయితే మంత్రుల హామీలు హామీలుగానే మిగిలిపోయాయి. తర్వాత ఎన్నికలు జరగటం, ప్రభుత్వం మారటం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సమస్యలు పరిష్కారం కాకపోవటంతో బాసర ఐఐఐటి విద్యార్ధులు మళ్ళీ ఆందోళన మొదలుపెట్టారు. విద్యార్ధులంతా చలి, వానలను కూడా లెక్కచేయకుండా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా తమ సమస్యలకు పరిష్కారమైతే దొరకటంలేదనే ఆవేధనతో విద్యార్ధులంతా నాలుగురోజుల క్రితం రాత్రి కాలేజి హాస్టల్ బిల్డింగులో సమావేశమయ్యారు.



ఆ సమావేశంలో సమస్యల జాబితాను రెడీచేసుకున్నారు. మరుసటిరోజు సమస్యల జాబితాను, వాటి పరిష్కారాన్ని సూచిస్తు అధికారులను కలిశారు. రెండు మూడు రోజుల తర్వాత కూడా అధికారుల నుండి ఎలాంటి స్పందన కనబడకపోవటంతో తప్పనిస్ధితిలో విద్యార్ధులు ఆందోళనకు దిగారు. తమ సమస్యల జాబితాను ప్లకార్డుల మీద రాసుకుని 2 వేలమంది విద్యార్ధులు యూనివర్సిటీ క్యాంపస్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. తర్వాత వైస్ ఛాన్సలర్ బంగ్లా ముందు ఆందోళనకు కూర్చున్నారు. సమస్యలను పరిష్కరించటంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతు విద్యార్ధులు పెద్దఎత్తున నినాదాలిచ్చారు. సమస్యలు పరిష్కారమయ్యేవరకు తమ శాంతియుత నిరసనలు జరుగుతునే ఉంటాయని విద్యార్ధులు హెచ్చరించారు. అయితే విద్యార్ధుల ఆందోళనలపై ఉన్నతాధికారులు ఆంక్షలు విధించారు.

విద్యార్ధుల డిమాండ్లు ఏమిటి ?


యూనివర్సిటిలో ప్రస్తుతం ఉన్న ఉన్నతాధికారులందరినీ మార్చేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇన్ చార్జి వీసీ స్ధానంలో స్ధానికంగానే ఉండే పూర్తిస్ధాయి వీసీని నియమించాలని అడుగుతున్నారు. వీసీతో పాటు ఇపుడున్న డైరెక్టర్ను కూడా మార్చేసి కొత్త డైరెక్టర్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్ధిక విషయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని విద్యార్ధులు కోరుకుంటున్నారు. రెండేళ్ళ జమాఖర్చుల వివరాలను వెంటనే ప్రకటించాలని అడుతున్నారు. మెస్సులలో భోజనం నాణ్యత పెంచాలని, మెనూను పాటించేలా చర్యలు తీసుకోవాలని, మెస్ కాంట్రాక్టరును పారదర్శకంగా నియమించాలని కోరుతున్నారు.

టీచింగ్, నాన్ టీచింగ్ ను పర్మినెంట్ పద్దతిలో వెంటనే నియమించాలని, క్యాంపస్ లోని ఆసుపత్రిలో వెంటనే స్టాఫ్ తో పాటు సౌకర్యాలను మెరుగుపరచాలని, ముఖ్యంగా విద్యార్ధినుల కోసం లేడీ డాక్టర్, స్టాఫ్ ను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫుడ్ కోర్టును ఏర్పాటుచేయటంతో పాటు క్రీడల పరికరాలను అందుబాటులో ఉంచాలని అడుగుతున్నారు. హాస్టళ్ళల్లో మౌళికసదుపాయాలను పెంచాలని కోరుతున్నారు. కాలేజీలో ఇప్పటివరకు జరిగిన ఆత్మహత్యలపై వెంటనే విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



పై డిమాండ్లు చూసిన తర్వాత విద్యార్ధుల డిమాండ్లలో గొంతెమ్మకోరికలు ఏమీ లేవని అర్ధమవుతోంది. మరి విద్యార్ధులు లేవనెత్తుతున్న సమస్యల పరిష్కారంలో అప్పటి బీఆర్ఎస్ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాయో అర్ధంకావటంలేదు. ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై ఆసక్తి చూపటంలేదు. విద్యార్ధులేమో సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఆందోళనలను విరమించేదిలేదని గట్టిగా పట్టుబట్టారు. అయితే రోజుల తరబడి ఆందోళన తర్వాత ఇన్ చార్జి వీసీ ప్రొఫెసర్ వీ వెంకటరమణ దిగొచ్చి విద్యార్ధులతో చర్చించారు. సమస్యల పరిష్కారానికి వీలైనంత తొందరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో తాత్కాలికంగా ఆందోళనను విరమించారు.



ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే బీఆర్ఎస్ హయాంలో విద్యార్ధులు ఆందోళన చేసినపుడూ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణనే. ఇపుడు ఆందోళన చేసినపుడూ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణే. అప్పుడూ, ఇప్పుడూ సమస్యలు కూడా దాదాపు ఒకటే. అయినా ప్రభుత్వాల్లో చలనం కనబడటంలేదు. దీన్నిబట్టే విద్యార్ధుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాల చిత్తశుద్ది ఏమిటో అర్ధమైపోతోంది. మరి విద్యార్ధుల సమస్యలకు పరిష్కారం ఎప్పుడో చూడాలి.

Read More
Next Story