దేశద్రోహం చట్టాల అవసరం ఏముంది?: ప్రొఫెసర్ హరగోపాల్ ప్రశ్న
x

దేశద్రోహం చట్టాల అవసరం ఏముంది?: ప్రొఫెసర్ హరగోపాల్ ప్రశ్న

సభలకు పోలీసులు ఏలాంటి ఆటంకాలు కల్పించకుండా ఉండటం చూస్తే ప్రస్తుతం తెలంగాణ పాలకులు ప్రజాస్వామ్యం పునరుద్దరణలో తొలి అడుగులుగా వేశారా అని పిస్తుంది.



హన్మకొండ, మార్చి 2, సమకాలీన సమాజంలో దేశద్రోహం చట్టాల అవసరం ఏముందో పాలకులు ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. శనివారం హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని అజ్ఞాత మహిళా అమరుల స్మృతిలో విప్లవోద్యమంపై నిషేధం ఎత్తి వేయాలని అమరుల బంధుమిత్రుల సంఘం సభ నిర్వహించింది. సభకు భవానీ అధ్యక్షత వహించారు.



ప్రొఫెసర్ హరగోపాల్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ డెబ్బయి ఏళ్లకిందట స్వాతంత్య్రోద్యమ సమయంలో బ్రిటిష్ పాలకులు దేశద్రోహం చట్టాలను రూపొందించారని చెప్పారు. నేటి ఆ చట్టాలను రద్దు చేయకుండా అమలు చేయడం శోచనీయం అన్నారు. పాలన విధానాన్ని ప్రశ్నించే రచయితలు, మేధావులు, జర్నలిస్టుపై దారణమైన 'ఉపా' లాంటి చట్టాలను ప్రయోగించడం సరికాదన్నారు. దేశంలో అంబానీ, ఆదానీల ఆదాయం పెరిగిందని సామాన్యుల జీవితాలలో మార్పు లేదన్నారు.

రాష్ట్రంలో కొత్త సర్కార్ పాలన వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. వరంగల్ లో విప్లవోద్యమంపై నిషేధం ఎత్తి వేయాలని ఏబిఎమ్ఎస్ సభ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సభలకు ఏలాంటి పోలీసు ఆటంకాలు కల్పించకుండా పరిస్థితులు ఉండటం ప్రస్తుతం పాలకులు ప్రజాస్వామ్యం పునరుద్దరణలో తొలి అడుగులుగా భావించాలని పేర్కొన్నారు.

మరిన్ని ప్రజాస్వామిక విలువల సాధన కోసం ఉద్యమకారులుగా ముందుకు సాగాలని ఆయన కోరారు. వ్యవసాయ రంగంలో తమ హక్కుల కోసం ఉద్యమించే రైతులను దేశద్రోహులుగా చిత్రీకరించడం విషాదమన్నారు. బ్యాంకుల నుండి కోట్లాది రూపాయలు రుణాల పేర దోచుకుని వెళ్లే బడాబాబులను దేశభక్తులుగా ప్రచారం చేయడం ఎంతవరకు న్యమని ప్రశ్నించారు. ప్రజాస్వామిక హక్కుల పోరాటాలను అణచి వేయడానికి నిర్భంధ చట్టాలను ప్రయోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

అజ్ఞాత రచయిత్రులు రాసిన "వియుక్క" కథల పుస్తకాలను ప్రొఫెసర్ హరగోపాల్ ఆవిష్కరణ చేయగా ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే మాట్లాడుతూ విప్లవోద్యమ అమరులను తలచుకోవడం ఉత్తమ సంప్రదాయమన్నారు. వియుక్క కథలను తెలుగు సమాజాన్ని ప్రభావితం చేయగలవని చెప్పారు. ఆరు పుస్తకాలగా సాహిత్యాన్ని ప్రచురణ చేయడం అభిలషణీయమని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో తొలుత అమరుల స్తూపావిష్కరణ సబిత, చేసి అమరులకు ఘనంగా ఆటపాటలతో నివాళులు అర్పించారు. సభలో అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ, ప్రధాన కార్యదర్శి పద్మకుమారి, విరసం అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ, వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ , ప్రొఫెసర్ సూరెపల్లి సుజాత, సాదినేని వెంకటేశ్వర్లు,పాణి, సంధ్య, సత్య, రమక్క,ఉష, రేణుక, శాంత, భవానీ, హుస్సేన్, తంగెళ్ల సుదర్శనం, కోడం కుమార్ , రవీందర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.


Read More
Next Story