
మార్లవాయి గిరిజన గూడెంలో ‘విదేశీ దేవుడు’
ఎవరా విదేశీయుడు, గిరిజనులకు 80 యేళ్లుగా ఆరాధ్యుడెలా అయ్యాడు?
'జల్ జంగల్ జమీన్' నినాదంతో ఆదివాసీ వీరుడు కొమురంభీం చేసిన తిరుగుబాటు నిజాం ప్రభుత్వాన్ని కుదిపి వేసింది. ఆ తిరుగుబాటుకు కారణం పట్టేదార్లు, షావుకార్లు, అధికారులేనని చెబుతారు. వారి దోపిడీని నిర్మూలించనిదే ఆదివాసులకు బ్రతుకు లేదని హైమన్ డార్ఫ్ గ్రహించాడు. నిజాం సర్కార్‌కు ప్రత్యేక సలహాదారునిగా ఉంటూనే స్వయంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. వీటిలో ముఖ్యమైనది 'భూ పంపిణీ'. స్వతంత్ర పోరాటానికి ముందే గిరిజనులకు 1.60 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేయించి వారి గుండెల్లో చెరగని ముద్ర వేశారు హైమన్‌డార్ఫ్ (Haimendorf ).
1940లో తెలంగాణా ప్రాంతం '7వ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్' పాలనలో ఉంది. ఆనాటి వ్యాపారులు, పట్వారీలు, అటవీశాఖ అధికారులు, పోలీసులు, స్థానిక జమీందార్లతో కలిసి నిరంకుశ దోరణితో ఆదివాసీలపై దౌర్జన్యాలు చేస్తూ వుండేవారు. 1935లో సిర్పూర్-కాగజ్‌నగర్‌లో పేపరుమిల్లు ఏర్పడటంతో, దాని అవసరాలకు అటవీ ప్రాంతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పలువురు గిరిజనేతరులు, వడ్డీ వ్యాపారులు ఇక్కడి అధికారుల అండతో గిరిజనుల భూములను కబ్జా చేశారు.
ఈ నేపథ్యంలో "అడవుల్లో ఉండేవన్నీ గిరిజనులకే చెందాలంటూ గిరిజన గోండు వీరుడైన కుమురం భీం 'జల్.. జమీన్.. జంగిల్'.. నినాదంతో తిరుగుబాటు చేశాడు. సుర్దాపూర్ ప్రాంత గూడేల్లోని గిరిజనులను సంఘటితం చేసి జోడేఘాట్ చుట్టుపక్కల పోడు సాగుకు భూములు సిద్ధం చేశాడు," అని కుమురం భీం మనవడు కుమురం సోనేరావు ఫెడరల్ తెలంగాణాతో తెలిపారు.
"12 గోండు గూడేలను ఏర్పాటు చేశాడు. ఈ గూడేల పరిధిలో దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ భూమిని గిరిజనులు కుమురం భీం నాయకత్వంలో ఆక్రమించుకున్నారు. గోండు, కొలాం, ఫరధాన్, తోటి నాయకపోడు గిరిజనులతో సైన్యాన్ని ఏర్పాటుచేశాడు. భీం నాయకత్వంలో గోండు రాజ్యపాలన ప్రారంభమైందని ప్రకటించాడు. ఈ విషయాన్ని నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు కలెక్టర్ అబ్దుల్ సత్తార్ చేరవేశాడు. నిజాం బలగాలు, కుమురం భీం దళ సభ్యుల మధ్య జరిగిన పోరులో భీం చనిపోయాడు," అని సోనేరావు చెప్పారు.
"తన సైనికుల చేతిలో భీం మరణించాడని తెలుసుకున్న నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆదివాసుల సమస్య పరిష్కరించడానికి చర్యలు చేపట్టాడు. ఆ సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం కొనసాగుతోంది. నాజీ జర్మనీ పాస్‌పోర్ట్‌తో దేశంలో ఉన్న నేరానికి హైమన్ డార్ఫ్‌ను బ్రిటీష్ ప్రభుత్వం అరెస్టు చేసి, నిజాం సంస్థానానికి పంపించింది. నిజాం నవాబు ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ అయిన హైమన్‌డార్ఫ్ డార్ఫ్‌ను గిరిజన వ్యవహారాలపై ప్రత్యేక సలహాదారునిగా నియమించి ఆదిలాబాద్ అడవులకు పంపించాడు. అలా హైమండార్ఫ్‌కు పడ్డ శిక్ష ఆదివాసిలకు వరమైంది," అని హిస్టారికల్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ సభ్యుడు మహ్మద్ గియాసుద్దీన్ అక్బర్ చెప్పారు.
ఆస్ట్రియా రాచరిక వంశంలో 1909, జూన్ 15న పుట్టిన శ్రీమంతుడు క్రిస్టాఫ్ ఫాన్ ప్యూరర్ హైమండార్ఫ్. (Haimendorf ) విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ రచనలు చదివి భారత్‌పై మక్కువ పెంచుకున్నాడు. మొదట ఆగ్రేయాసియా గిరిజనులపై అధ్యయనానికి గెల్డెర్న్‌ను స్ఫూర్తిగా తీసుకున్నాడు. 1936లో మానవ పరిణామ శాస్త్ర అధ్యయనానికి ఈశాన్య భారతంలోని నాగా (గిరిజను) లను మొదట ఎంచుకున్న డార్ఫ్ అనుబంధం జీవితాంతం ఆదివాసులతో కొనసాగింది. 1938-39 మధ్య నల్లమల అడవుల్లోని చెంచులు, కొండ రెడ్లపై డార్ఫ్ అధ్యయనం చేపట్టాడు. ఆ తరువాత ఆదిలాబాద్ గోండు గూడేలకు మారింది. నిత్యం చెంచు పెంటలు, గోండు గూడేల ఆవాసాలే తమ నివాసాలుగా, వారి సంస్కృతీ, సంప్రదాయాలు, గిరిజన జీవనంతో లీనమవుతూ బెట్టి డార్ఫ్‌ల అధ్యయనం కొనసాగిందని విక్కీపీడియా సమాచారం.
తన భార్యతో కలిసి హైదరాబాద్ నుంచి బయలుదేరిన హైమన్ డార్ఫ్ పలు అడివిలోని పలు గ్రామాల్లో తిరిగాడు. కానీ ఎవరూ దగ్గరకు రానివ్వలేదు. మాట్లాడడానికి కూడా ఇష్టపడ లేదు. అయితే మార్లవాయి గ్రామానికి చెందిన గూడెం పెద్దలు లచ్చుపటేల్, కనక రాజు బాయి హైమన్ డార్ఫ్‌ను తమ ఇంటికి ఆహ్వానించి ఆదివాసుల గోడు వినిపించారు. వారి మధ్య స్నేహం పెరిగింది. అప్పట్లో ఆ గూడెంలో కేవలం 35 ఇళ్ళు మాత్రమే వున్నాయి. అక్కడే ఓ గుడిసె లో 1941 నుండి 1945 వరకు హైమన్‌డార్ఫ్ నివాసం ఉన్నాడు. ఈ గ్రామం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో ఉంది. ఆ దంపతులు నివసించిన గుడిసెను ఇప్పుడు ఫోటో గ్యాలరీగా మార్చారు. వారు తమ పరిశోధనల సమయంలో సేకరించిన అన్ని ఫోటోలను అక్కడ అతికించారు.
"కనక రాజు బాయి ఇంటి పక్క గుడిసెలో హైమన్ డార్ఫ్ ఉండే ఉండేవారు. మా నానా ఆయన దగ్గర పనిచేస్తూ వుండే వారు. నేను కూడా నానతో వెళుతూ ఉండేవాడ్ని. నా చిన్నతనంలో అక్కడికి వెళ్లి ఆడుకునే వాడిని. కట్టెలు తీసుకుని వెళ్ళి ఇచ్చే వాడ్ని. ఓ రోజు నేను తీవ్ర అనారోగ్యానికి గురైయ్యాను. కడుపులో విపరీతమైన నొప్పి, చేతులకు దద్దుర్లు వచ్చాయి. సీరియస్ అయింది. హైమన్‌డార్ఫ్ నా ప్రాణాలు కాపాడారు అని మా పెద్దవాళ్ళు చెబుతూ వుంటారు," అని మార్లవాయి గ్రామస్థుడు స్వయం రాజు చెప్పారు.
"గూడెం పెద్దలు, పిల్లల్ని ఒక చోట చేర్చి హైమన్ డార్ఫ్ చదువు నేర్పించేవాడు. పంట మంచిగా వచ్చేలా వ్యవసాయం ఎలా చేయాలో ఆ సారే నేర్పించాడు. ఇప్పసారా తాగేవాడు కాదు, కానీ ఇప్ప పళ్ళు ఇష్టంగా తినేవాడు మేం తినే రొట్టెల్ని ఇష్టంగా తినేవాడు," అని మార్లవాయి గ్రామస్థుడు కొడాపా లింబారావు చెప్పారు.
రాజగోండు ప్రజల జీవన పరిస్థితులను అధ్యయనం చేయడానికి అడవి లోపల కాలినడకన, ఎడ్లబండిపై ప్రయాణిం చేసేవాడు హైమన్ డార్ఫ్. గోండుల జీవన విధానం, వారి ఆచార వ్యవహారాలు, సమస్యల గురించి తెలుసుకుని నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నివేదిక ఇచ్చాడు. నిజాం రాజు సహకారంతో గోండులకు విద్యాబుద్ధులు నేర్పుతూ, వారి హక్కుల మీద చట్టాలు చేయించాడు. అడవుల మధ్య, అభివృద్ధికి దూరంగా ఉంటున్న ఆదివాసుల జీవితాల్లో వెలుగులు నింపారు హైమన్‌డార్ఫ్ దంపతులు. నేడు అడవిబిడ్డలు కొంత అభివృద్ధి దిశగా పయనిస్తున్నారంటే అది హైమన్‌డార్ప్ చేసిన అధ్యయనం కృషే. స్వతంత్ర పోరాటానికి ముందే గిరిజనులకు 1.60 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేయించి వారి గుండెల్లో చెరగని ముద్ర వేశారు.
ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ (Haimendorf ) సిఫార్సులవల్ల ఆదివాసులకు జరిగినే మేలు ఏమిటంటే?
"1) నిజాం ప్రభుత్వం 10 వేల గిరిజన కుటుంబాలకు 1.60 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసింది. జైనూర్ మండలం ధబోలిలోనే 47 వేల ఎకరాలను పంపిణీ చేశారు.
2) డార్ఫ్ సలహా మేరకు నిజాం ప్రభుత్వం 1945లో గిరిజనుల అభివృద్ధికోసం ప్రత్యేకాధికారిని నియమించింది.
3) గిరిజనులు నివసించే ప్రదేశాలను 1945లో నోటిఫైడ్ షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించారు. ఇక్కడి భూముల బదలాయింపుపై నిషేధం విధించారు.
4) 1946లో మార్లవాయి, తాడవాయి, కొత్తమెల్ల ప్రాంతాల్లో 100 గిరిజన పాఠశాలలను స్థాపించింది. మార్లవాయి, తిర్యాణి మండలం గిన్నెధరి, వరంగల్‌లోని తాడ్వాయి, సుదిమైళ్లలో 30 గిరిజన ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు.
5) 1947లో నైజాం రూపొందించిన “దస్తూర్ ఉల్ అమాల్” పస్లీ చట్టం జారీ అయ్యింది. ఏజెన్సీ ప్రాంతంలో భూ బదలాయింపు చట్టం అమల్లోకి వచ్చింది. ఇపుడు అది 1/70 చట్టంగా మారింది.
6) డార్ఫ్ ప్రోత్సాహంతో తొలిసారి ఆదివాసీ తెగ నుంచి తుకారాం ఐఏఎస్‌గా ఎంపికయ్యారు.
7) భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950, జనవరి 26 నుంచి 40 గ్రామాలు షెడ్యుల్డ్ ఏజెన్సీగా మారాయి.
8) నాగోబా జాతర అనంతరం గిరిదర్బార్‌ను ఏర్పాటు చేసి వారి భాషలోనే ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
9) ఆదివాసులు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా వ్యవసాయ పని ముట్లు కొనడానికి రుణ సౌకర్యం కల్పిస్తూ 1946 నాటికే కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంకులు నెలకొల్పబడ్డాయి.
10) మార్లవాయిలో వ్యవసాయ క్షేత్రం స్థాపించి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో శిక్షణ కల్పించారు. పనిముట్ల తయారీకి వడ్రంగి విద్యను బోధించారు. విత్తనాల నిల్వ బ్యాంకులను స్థాపించారు," అని అని హైమన్ డార్ఫ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కనక వెంకటేష్ ఫెడరల్ తెలంగాణాతో తెలిపారు.

