ఘ‌నంగా ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్  39వ వర్ధంతి ఉత్స‌వాలు
x

ఘ‌నంగా ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ 39వ వర్ధంతి ఉత్స‌వాలు

ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజబెత్ దంపతుల స‌మాధులు మార్ల‌వాయిలో ఎందుకున్నాయి?




ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజబెత్ దంపతుల 39వ వర్ధంతి ఉత్స‌వాలు మార్ల‌వాయిలో ఘ‌నంగా జ‌రిగాయి. ఉత్స‌వాల్లో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా ఇంటిగ్రేటెడ్ ట్రైబ‌ల్ డ‌వ‌ల‌ప్‌మెంట్ ఏజెన్సీ ప్రాజెక్ట్ ఆఫీస‌ర్ యువ‌రాజ్ మ‌ర్మ‌ట్ ను గ్రామ స‌ర్పంచ్ కనక ప్రతిభ ఆధ్వ‌ర్యంలో గ్రామ‌స్థులు ఆదివాసుల సంస్కృతీ సాంప్రదాయం ప్రకారం ఆహ్వానించారు.

ఆ త‌రువాత డోలు, తుడుం వాయిద్య క‌ళాకారులు నృత్యాలు చేస్తూ ప్రాజెక్ట్ ఆఫీస‌ర్‌ను గూడెంపెద్ద అయిన ల‌చ్చుప‌టేల్ ఇంటికి తీసుకు వెళ్ళారు. ల‌చ్చుప‌టేల్ కుటుంబ స‌భ్యులు సిద్దంగా వుంచిన ప్ర‌త్యేక పూజా సామాగ్రి, పూలు, ప్ర‌త్యేక వ్ర‌స్తాలు తీసుకుని ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ స్మృతి వనం వెళ్ళి నివాళులు అర్పించారు.


అక్క‌డి నుంచి నేరుగా ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజబెత్ దంపతులు నివ‌సించిన ఇంటిని ప్రాజెక్ట్ ఆఫీస‌ర్ మ‌ర్మ‌ట్ సంద‌ర్శించి ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో మాట్లాడారు. "ఆదివాసుల అభివృద్ధి కోసం ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ స్పూర్తితో ప‌నిచేస్తాను. స్థానిక గిరిజ‌నులకు ఉపాధి క‌ల్పించ‌డంపై ఫోక‌స్ పెట్టాను. గోండి క‌ల్చ‌ర్ చీర‌ల్ని ఇళ్ల‌ల్లోనే త‌యారు చేసేలా యూనిట్‌లు ఏర్పాటు చేసి ప్ర‌తి కుటుంబం నెల‌కు ఐదు నుంచి ప‌ది వేల రూపాయ‌లు సంపాదించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. రాబోయే మూడు నెల‌ల్లోనే ఈ ప్రాజెక్ట్ ను అమ‌లులోకి తీసుకురావ‌డానికి ప్ర‌భుత్వం యాక్ష‌న్ ప్లాన్ రూపొందిస్తోంది," అని మ‌ర్మ‌ట్ ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో చెప్పారు.

ఎక్క‌డో ఆస్ట్రియన్ దేశంలోని వియ‌న్నాకు చెందిన ఆంత్రోపాల‌జీ ప్రొఫెస‌ర్ హైమ‌న్ డార్ఫ్, ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల‌పై అధ్య‌య‌నం చేశారు. త‌న భార్య బెట్టి ఎలిజబెత్ తో క‌లిసి జైనూర్ మండ‌లంలోని మార్ల‌వాయి గ్రామంలో 'గ‌డ్డి గుడిసె'లో నివ‌సిస్తూ 'గోండి భాష‌'ను నేర్చుకుని, 'ఎడ్ల‌బండి'పై తిరుగుతూ ఆదివాసీ జీవితాల్ని ప‌రిశోధించారు. "ది గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్" అనే పుస్త‌కంలో ఆదివాసుల జీవ‌న విధానం, వారి సంస్కృతి, సాంప్ర‌దాయాల్ని వివ‌రించారు.

నేడు అడవిబిడ్డలు కొంత అభివృద్ధి దిశగా పయనిస్తున్నారంటే అది హైమ‌న్ డార్ఫ్ చేసిన అధ్యయనం కృషే. స్వతంత్ర పోరాటానికి ముందే గిరిజనులకు 1.60 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేయించి వారి గుండెల్లో చెరగని ముద్ర వేశారు.

1990లో బెట్టి ఎలిజిబెత్ హైదరాబాద్‌లో చ‌నిపోయారు. అయితే ఆమె కోరిక మేరకు మార్లావాయి గ్రామంలో గిరిజన సంప్రదాయంలోనే గిరిజనులంతా అంత్యక్రియలను జరిపించారు. సతీమణి మరణం అనంతరం డార్ఫ్ ఇంగ్లండ్ వెళ్ళారు. ఆయన మనసంతా మార్లావాయిలోనే వుండేదట. అంతగా ఆ గిరిజులతో మమేకమైపోయారు డార్ఫ్.

1995లో డార్ఫ్ తుదిశ్వాస విడిచారు. ఆయన బ్రతికి వుండగానే భార్య ఎలిజిబెత్ సమాధి పక్కనే తన సమాధిని నిర్మించుకున్నారు. తాను మరణించిన తరువాత తన అస్థికలను మార్లవాయిలోని భార్య సమాధి పక్కనే వున్న తన సమాధిలో ఐక్యం చేయమని కుమారుడితో డార్ఫ్ చెప్పారట.

ఈ క్రమంలో డార్ఫ్ చనిపోయిన 17 ఏళ్లకు 2012 ఫిబ్రవరి 27న డార్ఫ్ కుమారుడు లచ్చు కుమార్ అలియాస్ నికోలస్ తండ్రి డార్ఫ్ అస్థికలను మార్లవాయిలోని సమాధిలో గిరిజన సంప్రదాయంలో ఐక్యం చేశాడు. ఇలా ఇప్పటికీ డార్ఫ్ మార్లావాయి గిరిజనులు ఆయన తమ అభివృద్ధి కోసం అందించిన సేవలను ఇప్పటికీ స్మరించుకొంటున్నారు.

Read More
Next Story