అది ఆలోచించే మెదడు, జాగ్రత్త సుమా! గాంధీ ఆస్పత్రికి సాయిబాబా భౌతికకాయం
x

అది ఆలోచించే మెదడు, జాగ్రత్త సుమా! గాంధీ ఆస్పత్రికి సాయిబాబా భౌతికకాయం

ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా మృతి వార్త విన్న ప్రొఫెసర్లు, ప్రజాస్వామికవాదులు, పౌర హక్కుల సంఘాల నేతలు కడచూపు కోసం హైదరాబాద్ తరలి వచ్చారు.


2024 అక్టోబర్ 14.. సోమవారం.. హైదరాబాద్ మౌలాలీ కమాన్ ప్రాంతం కిటకిటలాడుతోంది. దారిపొడవునా కామ్రేడ్ జీఎన్ సాయిబాబాకు జోహార్లు అనే పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఆ పక్కనే ఉన్న శ్రీనివాస హైట్స్ అపార్ట్మెంట్ ప్రాంగణం జోహార్ కామ్రేడ్ సాయిబాబా అనే నినాదాలతో మార్మోగుతోంది. బయటిగేటు వద్ద అమరవీరుల బంధుమిత్రుల సంఘం ఏర్పాటు చేసిన ఎర్రటి బ్యానర్లు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. అందులో ఒకటి ప్రత్యేకంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అదే ప్రొఫెసర్ సాయిబాబా చెల్లెలు భవానికి సంబంధించినది. ఆ బ్యానర్ పై " కలలపై కత్తివేటు పడుతున్న కాలాన పోరాట ప్రజల చరిత్రలో భాగమైన కామ్రేడ్ భవానికి విప్లవ జోహార్లు" అని రాసి ఉంది.

కవులు, కళాకారులు సాయిబాబాకు అరుణాంజలి సమర్పిస్తూ గేయాలు పాడుతున్నారు. అపార్మెంట్ కింద వేసిన కుర్చీలలో దేశనలుమూలల నుంచి వచ్చిన మేధావులు, విప్లవాభిమానులు, విప్లవరచయితల సంఘం నాయకులు, వామపక్ష పార్టీల నాయకులు, జర్నలిస్టులు కూర్చుని ఉన్నారు. మీడియా హడావిడి చెప్పనలవి కాకుండా ఉంది. ప్రపంచ విప్లవ మానవుడు, సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమ కారుడు, కవి, మేధావి జీఎన్ సాయిబాబా పార్దీవ దేహం గాజు పేటికలో ప్రశాంతంగా కనులు మూసి మరోప్రపంచం కోసం కలలు కంటున్నట్టుంది. ఈ మేధావి తలవాకిట కామ్రేడ్ జీఎన్ సాయిబాబా అమర్ హై, స్వేచ్ఛ కోసం హక్కుల కోసంపోరాడిన యోధుడా నీకు లాల్ సలాం అనే పెద్ద బ్యానర్ కట్టి ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా అందరూ క్యూలో వచ్చి పుష్పాంజలి ఘటిస్తున్నారు. ప్రొఫెసర్ సాయిబాబా భార్య వసంతను, కుమార్తె మంజీరాను పరామర్శించి భరోసా ఇస్తున్నారు. ప్రొఫెసర్ సాయిబాబా కల అర్థంతరంగా ఆగిపోయినా ఆయన పోరాట కాంక్షను సొంతం చేసుకుంటామంటూ బాసట చేస్తున్నారు.

ఎన్ కౌంటర్ లో మరణించిన ప్రొఫెసర్ సాయిబాబా చెల్లి భవానీ పేరిట వెలిసిన బ్యానర్

మధ్యాహ్నం 2 గంట ప్రాంతంలో కనిపించిన దృశ్యం ఇది. సాయిబాబా భౌతిక కాయాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి అప్పగించే సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ నాయకుల తాకిడి పెరిగింది. కమ్యూనిస్టు పార్టీల నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నేతలు, ఇతర ప్రజాసంఘాల నాయకులు ప్రొఫెసర్ సాయిబాబాకి నివాళులు అర్పించారు.

చావును నిరాకరించిన సాయిబాబాకి నివాళి...
'నేను చావును నిరాకరిస్తున్నాను' అని ఏనాడో ప్రకటించిన ఆయన ఆఖరి చూపు కోసం తెలుగురాష్ట్రాల మేధావులు తరలివచ్చారు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా 58 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 12 దసరా నాడైన శనివారం కన్నుమూశారు.
ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ఆకస్మిక మృతి వార్త విన్న పలువురు ప్రొఫెసర్లు, ప్రజాస్వామికవాదులు, పౌర హక్కుల సంఘాల నేతలు తల్లడిల్లారు. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల నుంచి ఆయన చివరి చూపు కోసం, నివాళులర్పించడానికి సోమవారం హైదరాబాద్ వచ్చారు. జీర్ణకోశ సంబంధ వ్యాధి సహా పలు అనారోగ్య సమస్యలతో రెండు వారాలుగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూసినట్టు నిమ్స్ వైద్యులు ప్రకటించినా ఇది కచ్చితంగా రాజ్య క్రూరత్వమేనని ఆరోపించారు. ప్రజా ఉద్యమాలకు, పౌర హక్కుల పరిరక్షణకు ఆయన మృతి తీరని లోటంటూ నివాళులర్పించారు. నిమ్స్ ఆస్పత్రి నుంచి భౌతిక కాయాన్ని సోమవారం ఉదయం 9 గంటలకు తీసుకుని తొలుత గన్ పార్కు దగ్గరి అమరవీరుల స్థూపం దగ్గరకు తీసుకెళ్తారు. అక్కడ ఉంచి నివాళులు అర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నుంచి గళమెత్తిన వారిలో సాయిబాబా ఒకరని పలువురు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత మౌలాలిలోని ఆయన సోదరుడు డాక్టర్ రాందేవ్ నివాసానికి తరలించారు. సాయంత్రం 4 గంటల వరకు ప్రొఫెసర్ సాయిబాబా భౌతికకాయాన్ని అక్కడ ఉంచారు. తర్వాత ఆయన చివరి కోరిక మేరకు గాంధీ మెడికల్ కాలేజీకి భౌతికకాయాన్ని అప్పగించేందుకు బయలు దేరారు.
నిర్దోషి టు నిర్దోషి.. అయినా తప్పని జైలు..
హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లీష్ లిటరేచర్‌లో పీజీ చేశారు. రాంలాల్ కాలేజీలో అధ్యాపకుడిగా ప్రారంభమైన ప్రస్థానం ఢిల్లీ వర్శిటీలో ప్రొఫెసర్‌ వరకు చేరింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రజల నుంచి పెద్దగా డిమాండ్ లేని రోజుల్లోనే 1990వ దశకం ప్రారంభంలో ప్రజాస్వామిక తెలంగాణ డిమాండ్‌ను తెరమీదకు తెచ్చారు. పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని జల్లుపల్లి నడుపల్లి అయినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పూర్తిగా సమర్ధించారు. ఢిల్లీ వర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సమయంలోనే 2014లో మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. మూడేళ్లు జైలులో గడిపారు. 2017లో గడ్‌చిరోలి ట్రయల్ కోర్టు ఆయనపై ఆరోపణలు రుజువయ్యాయని తీర్పును వెలువరించి జీవిత ఖైదు విధించింది.
ఇది కచ్చితంగా రాజ్య క్రూరత్వమే...
అప్పటి నుంచి నాగ్‌పూర్ అండా జైలులో ప్రత్యేక సెల్‌లో ఉన్న ఆయన పలుమార్లు బాంబే హైకోర్టును ఆశ్రయించి వీల్‌చైర్‌కు పరిమితమైన తనకు కనీస సౌకర్యాలను కల్పించాలని, పలు రకాల అనారోగ్య సమస్యలు ఉన్నందున వైద్య సౌకర్యాలు కల్పించాలని విన్నవించారు. తల్లి చనిపోయినప్పుడు పెరోల్ మీద విడుదల చేయాలని కోరారు. 9 ఏళ్ల పాటు నాగపూర్ జైల్లో ఉన్న ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. సుప్రీంకోర్టును ఆశ్రయంచడంతో ఆయన తరఫున సీనియర్ న్యాయవాది వృందా గ్రోవర్ వాదించారు. చివరకు ఆయనను సుప్రీంకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఈ ఏడాది మార్చి 7న ఆయన విడుదలైన తర్వాత అనారోగ్య సమస్యలకు ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఆ క్రమంలోనే నిమ్స్ ఆస్పత్రిలో జీర్ణకోశ సంబంధ వ్యాధికి సర్జరీ పూర్తయిన తర్వాత బీపీ కారణంగా తీవ్ర స్థాయిలో గుండెపోటు వచ్చి శనివారం రాత్రి 8.45 గంటలకు మృతి చెందినట్లు సాయిబాబా సోదరుడు రాందేవ్ తెలిపారు.
అంతిమయాత్ర సాగిందిలా...
ప్రొఫెసర్ సాయిబాబా కోరిక మేరకు ఇప్పటికే ఆయన నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి అప్పగించారు. మౌలాలీ నుంచి బయలుదేరిన అంతిమ యాత్రలో కవులు, కళాకారులు విప్లవగేయాలను ఆలపించారు. పెద్దఎత్తున విప్లవాభిమానులు, సాయిబాబా నుంచి పాఠాలు నేర్చుకున్న విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. రాజ్యానికి వ్యతిరేకంగా నినదించారు. దారిపొడవునా ప్రొఫెసర్ సాయిబాబా భౌతికకాయంపై ఎర్రజెండాలు నిప్పుకణికల్లా పడుతూనే వచ్చాయి. గులాబీల వర్షం కురిపించి తమ ప్రియతమ నేతకు నివాళులు అర్పించారు. డప్పు చప్పుళ్లు, పాటలు, నినాదాలతో ఆయనకు నివాళులు అర్పించారు. రాజ్యమే తనను చంపిందని, ఉపా చట్టాన్ని రద్దు చేయాలని సాయిబాబా అభిమానులు దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. యాత్ర అనంతరం ఆయన చివరి కోరిక మేరకు కుటుంబ సభ్యులు గాంధీ మెడికల్ కాలేజీకి పార్థివ దేహాన్ని అప్పగించారు. పౌర హక్కుల నేత, ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్త, మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు పౌరహక్కుల నేతలు తుది వీడ్కోలు పలికారు.
గన్ పార్క్ వద్ద నివాళులు..
నిమ్స్ ఆస్పత్రి నుంచి గన్‌పార్క్ వద్దకు ప్రొఫెసర్‌ సాయిబాబా భౌతికకాయాన్ని తీసుకువచ్చినపుడు పలువురు మంత్రులు నివాళులు అర్పించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ గన్‌పార్క్ వద్ద సాయిబాబా భౌతికకాయానికి నివాళులు అర్పిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హక్కుల ఉద్యమకారుడు ప్రొఫెసర్ సాయిబాబా అకాల మరణం బాధాకరం అన్నారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సాయిబాబాది సహజ మరణం కాదని, అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. సాయిబాబా చనిపోయిన ఆయన సిద్ధాంతాలు బతికే ఉంటాయన్నారు. పదేండ్లు అన్యాయంగా అతడిని నాగ్‌పూర్‌ జైళ్లో బంధించారని విమర్శించారు. ఆయన హత్యకు అసలు దోషి ఎవరో ప్రభుత్వం తేల్చాలని సీపీఐ నారాయణ డిమాండ్‌ చేశారు.
కేటీఆర్ గో బ్యాక్ అంటూ మౌలాలీలో నినాదాలు..
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మౌలాలీలో సాయిబాబాకు నివాళులు అర్పించేందుకు వచ్చినపుడు పౌరహక్కుల సంఘాల నాయకులు పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఉద్యమకారులపైన, పౌరహక్కుల సంఘాల నాయకులపైన పెట్టిన వందలాది కేసులకు పశ్చాత్తం వ్యక్తం చేసిన తర్వాతే ప్రొఫెసర్ సాయిబాబాకు నివాళులు అర్పించాలని కోరారు. ఈనేపథ్యంలో కొందరు కేటీఆర్ గో బ్యాక్.. కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఉపా వంటి తీవ్రమైన కేసులు పెట్టి జైళ్లల్లో పెట్టింది కేసీఆర్ ప్రభుత్వమే అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరాం, విమలక్క వంటి వారిపై కేసులు పెట్టించి.. వేధించి.. జైళ్లకు పంపించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని.. అలాంటి కేటీఆర్.. ఇప్పుడు సాయిబాబాకు ఎలా నివాళులు అర్పిస్తారంటూ ప్రశ్నించారు.

ఉద్యమకారుల ఆగ్రహంతో.. గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నా కేటీఆర్ మౌనంగా ఉన్నారు.. నివాళులు అర్పించి మౌనంగా వెనుదిరిగారు.
హరీశ్ రావు హామీ
ఆ తర్వాత టీఆర్ఎస్ మరో సీనియర్ నేత టి.హరీశ్ రావు వచ్చి సాయిబాబాకు నివాళులు అర్పించారు. సాయిబాబా కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సాయిబాబా కుటుంబ సభ్యులను పరామర్శించారు.
సాయిబాబ భౌతికకాయం గాంధీకి అప్పగింత..
ప్రొఫెసర్ సాయిబాబ భౌతికకాయాన్ని ఆయన భార్య వసంత, కుమార్తె మంజీర, ఇతర కుటుంబసభ్యులు పౌరహక్కుల సంఘాల నేతలతో కలిసి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి అప్పగించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సాయిబాబా రాసిన..
"సంగీతం ఆగిపోయింది
సృజనకారులను తరిమేశారు
చరిత్రకారులను సజీవంగా పాతిపెట్టారు
శాస్త్రవేత్తలను మచ్చిక చేసుకున్నారు
తత్వవేత్తలను ఉరికంబాలెక్కించారు
అపరిచితమైన మనుషులు
బాగా తెలిసిన మనుషులను
ప్రేమికులనూ ఆలోచకులనూ
కాల్చి చంపుతున్నారు"
అనే కవితను చదివి సాయిబాబాకు కన్నీటి నివాళి అర్పించారు.


Read More
Next Story