కంచ గచ్చిబౌలిలో జీవవైవిధ్యం కాపాడండి : మాజీ సివిల్ సర్వెంట్ల విన్నపం
x

కంచ గచ్చిబౌలిలో జీవవైవిధ్యం కాపాడండి : మాజీ సివిల్ సర్వెంట్ల విన్నపం

కంచ గచ్చిబౌలిలో జీవవైవిధ్యం కాపాడాలని మాజీ సివిల్ సర్వెంట్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు.మాజీలతో కూడిన రాజ్యాంగ ప్రవర్తనా బృందం ప్రకటన జారీ చేసింది.


హైదరాబాద్ నగరంలోని కంచ గచ్చిబౌలిలో జీవవైవిధ్యాన్ని కాపాడాలని మాజీ సివిల్ సర్వెంట్లు సభ్యులుగా కూ కూడిన రాజ్యాంగ ప్రవర్తనా బృందం (సీసీజీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గచ్చిబౌలిలో వంద ఎకరాల అటవీ భూమిలో బుల్డోజర్లను ఉపయోగించి చెట్లను కూల్చివేయడంపై మాజీ సివిల్ సర్వెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంతోపాటు హైదరాబాద్ నగరంలో అడవులను పరిరక్షించి జీవవైవిధ్యాన్ని కాపాడాలని వారు కోరారు.


67 మంది మాజీ అధికారుల ప్రకటన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసి పదవీ విరమణ చేసిన రేచల్ ఛటర్జీ, జమ్మూ అండ్ కశ్మీర్ మాజీ డీజీపీ కొలాసో, స్వీడన్ మాజీ రాయబారి సుశీల్ దూబే, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ప్రధానమంత్రి మాజీ సలహాదారు టీకేఏ నాయర్, పంజాబ్ మాజీ డీజీపీ జూలియో రెబిరో వంటి 67 మంది మాజీ సివిల్ సర్వీస్ అధికారులు సంతకాలు చేసిన ప్రకటనను ఆదివారం విడుదల చేశారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోని మరిచింది...
2023 ఎన్నికల్లో అడవులు, వృక్షాలు, వన్యప్రాణులను రక్షిస్తామని, పర్యావరణాన్ని పరిరక్షిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొని, అధికారంలోకి వచ్చాక దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని మాజీ అధికారులు ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు చెట్ల నరికివేతను, బుల్డోజర్లను వ్యతిరేకించగా రాష్ట్ర ప్రభుత్వం వారితో చర్చించకుండా లాఠీచార్జ్ చేసి అరెస్టు చేసిందని వారు పేర్కొన్నారు.

పచ్చదనాన్ని తగ్గించొద్దు
కంచ గచ్చిబౌలి భూములు అటవీ భూములు కాదని రాష్ట్రప్రభుత్వం వాదిస్తుందని, కానీ దీనికి ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదని వారు తెలిపారు. కంచ గచ్చిబౌలి భూములను అటవీ భూములుగా గుర్తించాలని వారు కోరారు. కంచ గచ్చిబౌలిలో వలస పక్షులు, 220 జాతుల పక్షలు, జింకలు, నక్షత్ర తాబేళ్లు ఉన్నాయని వారు గుర్తు చేశారు. కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంతం వల్ల వర్షాలు కురుస్తున్నాయన్నారు. తెలంగాణలో పచ్చదనాన్ని తగ్గించే వినాశకరమైన ప్రయత్నాలు తమను కలవర పెడుతున్నాయని వారు వివరించారు.

ఐటీ పార్కు ఏర్పాటు కోసం ప్రత్యామ్నాయ స్థలాలు అందుబాటులో ఉన్నా వాటిని కాదని విద్యార్థులు, ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా పర్యావరణ విధ్వంసం చేయడం తగదని మాజీ సివిల్ సర్వెంట్లు హితవు పలికారు. కంచ గచ్చిబౌలి భూముల్లో పచ్చదనాన్ని పెంచి జీవవైవిధ్యానికి స్వర్గధామంగా చేయాలని వారు సూచించారు.


Read More
Next Story