
మిస్ వరల్డ్ అందాల పోటీలకు వ్యతిరేకంగా నగరంలో ర్యాలీ
మే 10 నుంచి 31వరకు హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు
మిస్ వరల్డ్ ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాదులో మే పదో తేదీన మొదలై పలు ఈవెంట్స్ తో కొనసాగి, మే ముప్పై ఒకటో తేదీన గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది. ఈ కార్యక్రమాన్ని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తో కలిసి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈఓ జూలియా మోర్లీ, తెలంగాణ ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ, యువ వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ కలసి ప్రకటించారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ గడ్డమీద స్త్రీ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన చోట ఈ నిర్వహించడం పట్ల రాష్ట్రంలో నిర్వహించడం విచారకరం. మే 10 నుంచి 31 వరకు హైదరాబాదులో జరుగనున్న 72వ ప్రపంచ సుందరి పోటీలకు వ్యతిరేకంగా మహిళా, విద్యా ర్థి , యువజన , సాంస్కృతిక, దళిత, బహుజన సంఘాలు గళమెత్తాయి. దాదాపు నెలరోజులుగా ఈసంఘాలన్నీ కలిసి " మిస్ వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక వేదిక "ను ఏర్పాటు చేసుకున్నాయి. అందులో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు, పోస్టుకార్డ్ ఉద్యమం,కలెక్టర్లకు, చైల్డ్ అండ్ ఉమెన్ కమిషనర్ కు,మానవ హక్కుల కమిషనర్ కు,RDO లకు నివేదికలు సమర్పించారు. అనేక రూపాలలో తమ నిరసనను చాటి చెప్పారు. అందులో భాగంగా మిస్ వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక వేదిక సుందరయ్య పార్కు నుండి ఆర్. టి. సి. క్రాస్ రోడ్డు మీదుగా ఇందిరాపార్కు వరకు భారీ ర్యాలీని ఈ రోజు( 26/4/2025) నిర్వహించింది. అందాల పోటీలకు వ్యతిరేకంగా పలువురు నినదించారు.
మిస్ వరల్డ్ సంస్థతో కలిసి నిర్వహించబోతున్న ఈ పోటీలు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని ప్రభుత్వం చెపుతోంది. హైదరాబాదుకు ఉన్న చరిత్ర సంస్కృతి నేపథ్యం వల్లనే మన నగరాన్ని ఈ పోటీలకు వేదిక చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధంగా తెలంగాణ చారిత్రక కళా సంస్కృతులు ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇది మంచి అవకాశమని నిర్వాహకులు ఊదర కొడుతున్నారు. దీనితో తెలంగాణలో పర్యాటక రంగం, చేనేత పరిశ్రమ, పెట్టుబడులు ఇలా అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్ధి చెంది, యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని టూరిజం శాఖ కార్యదర్శి స్మితాసబర్వాల్ ప్రకటించారు. ప్రభుత్వం ఈ పోటీలపై పెడుతున్న కోట్లాది రూపాయల ఖర్చు ఆయా రంగాల అభివృద్ధి పై పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఆదాయంతోపాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయి.
ఇప్పటికే 1996లో బెంగళూర్ లో, 2024 లో ముంబైలో ప్రపంచసుందరి పోటీలను నిర్వహించారు. సనాతన ధర్మ సంస్థాపకుడుగా చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వం ఈ పోటీలను నిర్వహించడం అందులో భాగమా? స్త్రీల అంగాంగ ప్రదర్శననే సనాతన ధర్మమా? ఇది భారతదేశ సంస్కృతికి నిదర్శనమా? భారతదేశంలో నిర్వహించడం ఇది మూడోసారి.
రైతుల ఆత్మహత్యలు, స్త్రీల అత్యాచారాలు , నిరుద్యోగం లాంటి సమస్యలు ప్రభుత్వాల దృష్టికి రావడం లేదా?ఉద్యోగులకు, పెన్షనర్ లకు సక్రమంగా జీతాలు చెల్లించలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామంటూ ఈ పోటీల కొరకు వందల కోట్లు ఖర్చు పెట్టి వాటిని నిర్వహించడం వెనక ఉన్న కుట్రను అర్థం చేసుకొని, రాజకీయ, బహుళజాతి వ్యాపార సంస్థల స్వప్రయోజనాలను తిప్పికొట్టాలంటూ పలువురు వక్తలు అన్నారు.
తెలంగాణ మహిళ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక. అంగాంగ ప్రదర్శనకు కాదు. అందాల పోటీలు మహిళా సాధికారతకు సంకేతకాదు. మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రపంచ సుందరి పోటీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసారు. మహిళలను వినియోగ వస్తువుగా మారుస్తున్న సామ్రాజ్యవాద విషసంస్కృతిని వ్యతిరేకించాలని, హైదరాబాదులో జరుగబోయే 72వ ప్రపంచసుందరి పోటీలకు వ్యతిరేకంగా తెలంగాణ మహిళా, సాంస్కృతిక, విద్యార్థి , యువజన, దళిత, బహుజన ప్రజాసంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు.
ఈ ర్యాలీలో POW నుంచి వి. సంధ్య , జి. ఝాన్సి, జి. అనసూయ, భారతి, AIDWA నుంచి మల్లు లక్ష్మి అరుణ జ్యోతి, CMS నుంచి బి. జ్యోతి, ఇ. జయ, శ్రీదేవి, అరుణోదయ సాంస్కృతిక సంస్థ నుంచి విమలక్క, POW నుంచి డి.స్వరూప,శిరోమణి, శోభ, సంధ్య, NFIW నుంచి ఎన్.జ్యోతి, జి.అరుణ, AIMSS హేమలతత PDSU నుంచి నాగరాజు, మహేశ్ , PKM నుంచి జాన్, TPF నుంచి కె. రామ్ బాబు,AIDYO నుంచి పి. తేజ, AIDSO నుంచి ఎ. సత్యనారాయణ, HWWF నుంచి భండారు విజయ, నాయకులతో పాటు,ACF, KNS, PNM, PYL, KNPS,AISF, SFI, DYFI, HWWF,BMS, AIDSO, BRSS SKM,BSPMW, TAMS,TAS, DBF,PDM మొదలైన సంస్థలకు చెందిన వందలాది కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ పురుషులు అధికంగా లేకపోవడం విచారించ దగ్గ విషయం.