హైడ్రాకు జనాల జేజేలు
x
Hydra commissioner AV Ranganadh

హైడ్రాకు జనాల జేజేలు

వేలమంది విద్యార్ధులను ఇతర స్కూళ్ళు, కాలేజీల్లో సర్దుబాటుచేయటం సాధ్యంకాదు. అప్పుడది ప్రభుత్వానికి చాలా పెద్ద తలనొప్పిగా తయారవుతుంది.


కూల్చివేతలకు సంబంధించి జనాలు హైడ్రాకు జేజేలు పలుకుతున్నారు. చెరువులు, కాలువలు, కుంటల పరిరక్షణతో పాటు ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్ధలాలను తిరిగి ప్రభుత్వానికి అప్పగింటచమే ధ్యేయంగా హైడ్రాను రేవంత్ రెడ్డి ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులు, కాల్వలు, కుంటలను ఆక్రమించి చేసిన నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే సుమారు 18 చెరువుల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చేసి 48 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. ఆ 48 ఎకరాలను ఇరిగేషన్, మున్సిపల్, పంచాయితీరాజ్, రెవిన్యు శాఖలకు తిరిగి అప్పగించేసింది. ఇంకా చాలా నిర్మాణాలను పరిశీలిస్తోంది.

అక్రమనిర్మాణాల్లో ఎక్కువగా రాజకీయ ప్రముఖులతో పాటు బడాబాబుల ఫాం హౌసులు, కమర్షియల్ నిర్మాణాలే ఉన్నాయి. ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చేసిన విషయం ఎంతటి సంచలమైందో అందరు చూసిందే. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి 3.30 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ ను నాగార్జున నిర్మించినట్లు నిర్ధారించుకున్న హైడ్రా మొత్తం నెలమట్టంచేసేసింది. అలాగే జన్వాడలో బుల్కం నాలాను ఆక్రమించుకుని నిర్మించిన జన్వాడ ఫాంహౌస్ కొలతలు తీసుకున్నారు. ఏరోజైనా జన్వాడ ఫాంహౌసును కూల్చేయచ్చు. జన్వాడ ఫాంహౌస్ ఎందుకింత వివాదమైందంటే ఇది కేటీఆర్ది అవటమే. ఇలాంటి అనేక ప్రముఖుల ఫాంహౌసులపై హైడ్రా దృష్టిపెట్టి అన్నీ వివరాలను సేకరిస్తోంది.

హైడ్రా చర్యలకు మామూలు జనాలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పటివరకు తొలగించిన అక్రమనిర్మాణాల్లో ఎంఐఎం ఎంఎల్ఏ ముబిన్, కాంగ్రెస్ ఎంఎల్ఏ దానం నాగేందర్, కాకినాడ మాజీ ఎఓంపీ, కేంద్రమాజీమంత్రి పల్లంరాజు సోదరుడు ఆనంద్ ఆక్రమణలను కూడా హైడ్రా తొలగించేసింది. మరింతమంది మాజీమంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, ప్రజాప్రతనిధుల ఫాంహౌసులను కూడా కూల్చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే హైడ్రాకు జనాల మద్దతు విపరీతంగా పెరిగిపోతోంది.

ఇపుడు తాజా విషయం ఏమిటంటే ఓల్డ్ సిటి చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని సలకం చెరువును ఆక్రమించి నిర్మించిన ఫాతిమా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ భవనాలు అక్రమనిర్మాణాలుగా హైడ్రా తేల్చింది. ఫాతిమా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఎవరిదంటే ఎంఐఎం ఎంల్ఏ, పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కుటుంబానిది. సలకం చెరువులోని 12 ఎకరాలను ఆక్రమించేసి కాలేజీ, స్కూల్ భవనాలను కట్టేశారనే ఆరోపణలున్నాయి. కాలేజీ భవనాల ఆక్రమణలపై ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ ఫిర్యాదులను హైడ్రా అధ్యయనంచేసింది. కాలేజీ భవనాల నిర్మాణాలను చెరువును ఆక్రమించి కట్టారని హైడ్రా నిర్ధారణ చేసుకుంది. అందుకని వెంటనే అక్రమనిర్మాణాలను తొలగించే విషయంలో యాజమాన్యానికి హైడ్రా నోటీసులు జారీచేసింది.

కట్టడాలను హైడ్రా కూల్చేయటం ఖాయమని అర్ధమైన అక్బరుద్దీన్ నానా రచ్చచేస్తున్నారు. భవనాలను కూల్చేయటం కన్నా తనను తుపాకులు, కత్తులతో చంపేయండని సెంటిమెంటును ప్రయోగించారు. అయినా హైడ్రా లెక్కచేయలేదు. అయితే విద్యాసంవత్సరం మధ్యలో ఉందికాబట్టి వేలాదిమంది విద్యార్ధులు ఇబ్బంది పడకూడదని హైడ్రా ఆలోచించింది. అందుకనే వచ్చే విద్యాసంవత్సరం వరకు యాజమాన్యానికి టైం ఇచ్చింది. విద్యాసంవత్సరం ముగియగానే అక్రమ నిర్మాణాలను యాజమాన్యం తనంతట తానుగానే కూల్చేయాలని నోటీసులో హైడ్రా చెప్పింది. ఒకవేళ యాజమాన్యం అక్రమనిర్మాణాలను కూల్చకపోతే హైడ్రాను కూల్చేస్తుందని కూడా స్పష్టంగా చెప్పింది. ఇదే పద్దతిని నాదం చెరువును ఆక్రమించి నిర్మించుకున్న అనురాగ్ యూనివర్సిటి యాజమాన్యంతో పాటు మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యానికి కూడా వర్తిస్తుందని హైడ్రా చెప్పింది.

అనురాగ్ యూనివర్సిటి బీఆర్ఎస్ ఎంఎల్ఏ పల్లా రాజేశ్వరరెడ్డిది కాగా, మల్లారెడ్డి కాలేజీ కూడా కారుపార్టీ ఎంఎల్ఏ చేమకూర మల్లారెడ్డిది అన్న విషయం అందరికీ తెలిసిందే. పై కాలేజీల్లో కూడా వేలాదిమంది విద్యార్ధులు చదువుతున్న కారణంగా వాళ్ళ భవిష్యత్తు దెబ్బతినకూడదన్న ఉద్దేశ్యంతోనే కొంత గడువు ఇస్తున్నట్లు హైడ్రా నోటీసుల్లో చెప్పింది. ఈ పాయింట్ మీదే జనాలు హైడ్రాకు జేజేలు పలుకుతున్నారు. ఇతర నిర్మాణాలను కూల్చేసినట్లుగా కాలేజీలను కూడా కూల్చేయకుండా వేలాది విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న హైడ్రాను జనాలు అభినందిస్తున్నారు. హైడ్రా నోటీసుల ఉద్దేశ్యం ఏమిటంటే ఈ విద్యాసంవత్సరం తర్వాత 2024-25 విద్యాసంవత్సరంలో విద్యాసంస్ధలు అడ్మిషన్లు చేయకూడదు.

విద్యార్దుల భవిష్యత్తు కోసమే

వేలాది విద్యార్ధుల భవిష్యత్తు దెబ్బ తినకూడదనే యాజమాన్యాలకు గడువు ఇచ్చినట్లు హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాధ్ చెప్పారు. ఫాతిమా విద్యాసంస్ధలు, అనురాగ్ యూనివర్సిటి, మల్లారెడ్డి విద్యాసంస్ధల్లో వేలాదిమంది విద్యార్ధులు చదువుతున్న విషయం తెలిసిందే. విద్యాసంవత్సరం మొదలై రెండు నెలలు అయిపోయింది. ఆ సమయంలో కాలేజీలను కూల్చేస్తే వేలాది విద్యార్ధుల విద్యాసంవత్సరం దెబ్బతింటుంది. ఇన్ని వేలమంది విద్యార్ధులను ఇతర స్కూళ్ళు, కాలేజీల్లో సర్దుబాటుచేయటం సాధ్యంకాదు. అప్పుడది ప్రభుత్వానికి చాలా పెద్ద తలనొప్పిగా తయారవుతుంది. అందుకనే అక్రమనిర్మాణాల్లో విద్యాసంస్ధలను ఖాళీచేయటానికి యాజమాన్యాలకు హైడ్రా తగిన గడువు ఇచ్చింది. మరో ఎనిమిదినెలల్లోగా ఇపుడున్న విద్యాసంస్ధలకు ప్రత్యామ్నాయంగా యాజమాన్యాలు వేరే భవనాలను చూసుకోవాల్సిందే. ఇదే సమయంలో అవకాశం ఉన్న విద్యార్ధులు కూడా వేరే విద్యాసంస్ధల్లో అడ్మిషన్లకు ప్రయత్నాలు చేసుకుంటారు.

నిర్మాణంలో ఉన్న భవనాలను, ఫాంహౌసులు, ఎన్ కన్వెన్షన్ను కొట్టేసినట్లు విద్యాసంస్ధలను కొట్టకుండా హైడ్రా విచక్షణ ఉపయోగించింది. విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే యాజమాన్యాలకు హైడ్రా గడువు ఇవ్వటంతో విద్యార్ధుల తల్లి, దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంలోనే జనాలు హైడ్రాకు జేజేలు పలుకుతున్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి విద్యాసంస్ధల నిర్వహణకు యాజమాన్యాలు ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిందే. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

Read More
Next Story