
కమీషన్లు రావనే కేసీఆర్ ఎస్ఎల్బీసీని పట్టించుకోలేదు
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) పై విరుచుకుపడ్డారు
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) పై విరుచుకుపడ్డారు. సోమవారం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాలోని మన్నెవారిపల్లిలో జరుగుతున్న టన్నల్ పనులను, హెలీ మాగ్నటిక్ సర్వేకు సిద్ధంగా ఉన్న హెలికాప్టర్, అధునాతన పరికరాలను రేవంత్(Revanth) పరిశీలించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతు టన్నెల్ బోర్ మిషన్ తో పనులు చేయటం చాలా కష్టంగా మారిందన్నారు. జరుగుతున్న పనులపై బీఆర్ఎస్(BRS) నేతలు రాజకీయం చేయటం తగదన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా టన్నెల్ పనులు పూర్తిచేసి తీరుతామని గట్టిగా చెప్పారు.
అసలు పనులు జాప్యం జరగటానికి కేసీఆర్, హరీష్ రావే కారణమని ధ్వజమెత్తారు. అప్పులుచేసి, తప్పులు చేసి, దోపిడీ చేశారన్న కారణంగానే జనాలు 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ను పక్కనపెట్టినట్లు చెప్పారు. ప్రాజెక్టు పనులపై చిల్లరమాటలు మానుకోవాలని హరీష్ కు రేవంత్ హితవుచెప్పారు. అధికారంలో ఉన్న పదేళ్ళల్లో కేసీఆర్ ఒక్క ప్రాజెక్టును కూడా సక్రమంగా పూర్తిచేయలేదని మండిపడ్డారు. అందుకనే దీన్ని అలుసుగా తీసుకుని ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతోందన్నారు. కేసీఆర్ కు చిత్తశుద్ది ఉండుంటే టన్నెల్ పనులు ఎప్పుడో పూర్తయ్యేవన్నారు. కమీషన్లు రావని తెలిసిన తర్వాత ఎస్ఎల్బీసీ పనులను కేసీఆర్ గాలికి వదిలేసినట్లు ఆరోపించారు. పదేళ్ళ బీఆర్ఎస్ హయాంలో టన్నెల్ పనులు పది కిలోమీటర్లు కూడా పూర్తికాలేదని చెప్పారు. టన్నెల్ పూర్తిచేస్తే కాంగ్రెస్ కు మంచి పేరొస్తుందనే పనులను గాలికొదిలేసినట్లు రేవంత్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
30 టీఎంసీల నీటి తరలింపు, 3 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యంతో 1983లో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మంజూరైన విషయాన్ని రేవంత్ గుర్తుచేశారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ టన్నెల్-1, టన్నెల్-2 పనులను ప్రారంభించినట్లు తెలిపారు. రు. 1968 కోట్లతో టెండర్లు పిలిచిన ఈ ప్రాజెక్టుకు దేశంలోనే తొలిసారిగా టన్నెల్ బోర్ మిషన్ ఉపయోగించిన విషయాన్ని వివరించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ హయాంలో పది కిలోమీటర్ల పని కూడా ఎందుకు జరగలేదని రేవంత్ ప్రశ్నించారు. నల్గొండ జిల్లాకు గ్రావిటి ద్వారా నీళ్ళివ్వాలని తమ ప్రభుత్వం అనుకుంటుంటే బీఆర్ఎస్ అడ్డంకులు సృష్టిస్తున్నట్లు రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

