
థియేటర్లలో రేట్లపై ప్రేక్షకుల తిరుగుబాటు !
మల్టీప్లెక్స్‌లు, భారీ థియేటర్లలో ఉంటున్న అలివిమాలిన ధరలపై ప్రేక్షక ప్రపంచ నిరసన స్వరం వినిపించింది. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న ప్రేక్షకులు.. వీటికి వ్యతిరేకంగా ప్రశ్నించడం ప్రారంభించారు. ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత.. థియేటర్లలో భారీగా ఉంటున్న రేట్ల అంశం అత్యంత కీలకంగా మారింది. ఈక్రమంలోనే ప్రేక్షకులు ముందు వస్తున్నారు. అధిక రేట్లకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే శుక్రవారం హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలో ఉన్న సంధ్య థియేటర్‌లో సంతక సేకరణ కార్యక్రమం చేపట్టారు. థియేటర్లో స్నాక్స్ రేట్లు భారీగా ఉన్నాయని భావించిన ప్రతి ప్రేక్షకుడి దగ్గర నుంచి సంతకాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
టికెట్, స్నాక్స్, పార్కింగ్ ధరలను తగ్గించాలని ప్రేక్షకులు డిమాండ్ చేశారు. వారికి వీవైఎల్ కార్యకర్తలు మద్దతుగా నిలిచారు. ప్రతి ఒక్కరూ తమకు మద్దతు తెలిపాలని, ఉద్యమం చేస్తేనే ఈ రేట్లు తగ్గుతాయని వారు పేర్కొన్నారు. వీవైఎల్ చర్యతో థియేటర్లలో ఉంటున్న అధిక రేట్లపై తిరుగుబాటు ప్రారంభించారన్న వాదన బలం పుంజుకుంటుంది. తమ వినోదాన్ని అదునుగా తీసుకుని దోచుకోవాలనుకుంటున్న థియేటర్ల యజానులపై ప్రేక్షకులు తిరుగుబావుటా ఎగరేశారని కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం సంధ్య థియేటర్ దగ్గర చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమం తీవ్ర చర్చలకు దారి తీస్తోంది.

