భట్టి బడ్జెట్ ప్రసంగంలో జాలువారిన ప్రముఖుల పలుకులు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పలువురు ప్రముఖుల పలుకులను ఉటంకించారు. ఎందరో ప్రముఖుల మాటలను భట్టి వల్లె వేశారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తన ప్రసంగంలో తెలంగాణ ప్రముఖుల పలుకులను ఉటంకించారు. ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని మహాకవి దాశరథి మాటలను గుర్తు చేస్తూ మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.
- దీంతో పాటు తెలంగాణ కలను సాకారం చేసిన సోనియాగాంధీ ఆశీస్సులతో బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యం కోసం ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని, దీంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన చేస్తున్నామని మంత్రి చెప్పారు.
మహాత్మాగాంధీ పేర్కొన్న విధంగా భారత దేశ ఆత్మ గ్రామాల్లో కనిపిస్తుంది.గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని భట్టి ప్రకటించారు. గ్రామ స్వరాజ్యం కృషి చేసి గ్రామీణాభివృద్ధికి జవసత్వాలు నింపిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ చూపిన బాటలో నడుస్తామని మంత్రి చెప్పారు.
‘‘మహిళలు సాధించిన ప్రగతే ఆ సమాజ ప్రగతికి కొలమానంగా నేను భావిస్తాను’’ అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను గుర్తుచేసిన మంత్రి తాము ఇందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేశామన్నారు.
‘‘ప్రజాస్వామ్యం అనేది బలవంతులకు, బలహీనులకు సమాన అవకాశాలు కల్పించేది’’అని గాంధీ చెప్పిన మాటలను గుర్తు చేశారు.‘‘చివరగా మహాత్మాగాంధీ గారి మాటలు నేను ఈ గౌరవ్ సభకు గుర్తు చేయాలనుకుంటున్నాను.మనం చేసే పనులకు, చేయగలిగే సామర్ధ్యానికి ఉన్న అంతరం ప్రపంచంలోని సమస్యలన్నింటిని పరిష్కరించడానికి సరిపోతుంది’’ అంటూ గాంధీ మాటలను గుర్తు చేస్తూ భట్టి తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. జై తెలంగాణ, జై హింద్ అని ఎమ్మెల్యేల హర్షధ్వానాల మధ్య భట్టి బడ్జెట్ ప్రవేశపెట్టారు.