
ఎన్నికల కమిషన్‌కు రఘునందన్ రావు ఫిర్యాదు..
ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నవీన్ యాదవ్ ఎలా అర్హుడని ప్రశ్నించిన ఎంపీ.
కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నవీన్ ఏ విధంగా అర్హులు? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు.. ఓటర్ కార్డులను పంచుతున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ చేతుల్లోకి రావాల్సిన ఓటర్ కార్డులు.. కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఎలా వెళ్లాయి? అని రఘునందన్ ప్రశ్నించారు. ఓటర్ కార్డులను కాంగ్రెస్ నేతలు బహిరంగంగా పులిహోర పొట్లాలు పంచినట్లు పంచుతుంటే ఎన్నికల కమిషన్, జీహెచ్ఎంసీ కమిషనర్లు ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు.
‘‘జూబ్లీహిల్స్‌లో ఓటర్ కార్డులను పంచుతున్న నవీన్ యాదవ్.. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఎలా అర్ఢుడు అవుతాడు. నవీన్ యాదవ్‌కు ఓటర్ కార్డులు ఎవరిచ్చారు? జీహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చారా? ఎన్నికల కమిషన్ ఇచ్చిందా? దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. బీహార్‌లో SIR(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) చేస్తామంటే గగ్గోలు పెట్టిన మేధావులు దీనిపై ఎందుకు స్పందించట్లేదు. దీనిపై స్పందించాలి. SIR అంటే ఓట్ల చోరీ అంటున్నారు. మరి ఇదేంటీ.. ఐడీ కార్డుల చోరీనా? ఈ అంశంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశా. ఓటర్ కార్డుల పంపిణీపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా’’ అని రఘునందన్ రావు చెప్పారు.
నవీన్ చేసిందిదే..
ఇటీవల యూసఫ్‌గుడలోని తన కార్యాలయంలో స్థానిక బస్తీవాసులకు ఓటర్ ఐడీ కార్డుల పంపిణీ అంటూ నవీన్ యాదవ్.. కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఏజెన్సీ నుంచి తీసుకున్న పైరసీ ఓటర్ కార్డులను ఆయన పంపిణీ చేసినట్లు కొందరు చెప్తున్నారు. అయితే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950, సెక్షన్ 28 ప్రకారం ఓటరుకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ద్వారా ఎలక్టోరల్ ఫొటో గుర్తింపు కార్డు (ఈపీఐసీ)ను కేంద్ర ఎన్నికల సంఘమే నేరుగా పంపిణీ చేస్తుంది. అటువంటి కార్డులను నవీన్ యాదవ్.. తన కార్యాలయంలో అందించడం తీవ్ర చర్చలకు దారితీస్తోంది.