తెలంగాణ రాష్ట్రంలో శనివారం పర్యటించిన కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టు గురించి ఆసక్తి చూపించారు. తూర్పు, పశ్చిమ,దక్షిణ, ఉత్తర ప్రాంతాలకు కేంద్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం గేమ్ ఛేంజర్ గా మారబోతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రాంతీయ రింగ్ రోడ్డు ప్రాజెక్టు నుంచి 30 మీటర్ల కారిడార్ ను రీజనల్ రింగ్ రైలు నిర్మాణానికి ఇవ్వాలని తాను తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డిని కోరినట్లు రైల్వేశాఖ మంత్రి వెల్లడించారు. రీజనల్ రింగ్ రోడ్డు నుంచి 30 మీటర్ల కారిడార్ ను రైల్వేకు కేటాయిస్తే, తాము ఇన్ లాండ్ కంటైనర్ డిపోలను నిర్మించి ఆంధ్రప్రదేశ్ లోని పోర్టులకు సజావుగా చేరేలా రైల్వేలైను నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు.
తెలంగాణ సీఎం కలిసిన రెండు రోజులకే...
తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో కీలకమైన రీజనల్ రింగ్ రోడ్డు పక్కన రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టు చేపట్టాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతినిధి బృందం రైలు భవన్ లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసిన రెండు రోజులకే హైదరాబాద్ లో పర్యటించారు. తెలంగాణలో గ్రామీణ పేదరికాన్ని తగ్గించి, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కల్పించడంతోపాటు పది జిల్లాలను కలుపుతూ నిర్మించే రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టుకు రూ.8వేల కోట్లను మంజూరు చేయాలని తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వర్యంలోని మంత్రులు, ఎంపీల బృందం రెండు రోజుల క్రితం రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను రైలుభవన్ లో కలిసి వినతిపత్రాన్ని అందించారు.
హైదరాబాద్ కేంద్రంగా రైల్వే నెట్ వర్క్ అభివృద్ధి
హైదరాబాద్ నగరం కేంద్రంగా రైల్వే నెట్ వర్క్ ను అభివృద్ధి చేస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ప్రస్థుతం రోజుకు 600 రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయని, భవిష్యత్తులో దీని సంఖ్య 1200కు పెంచాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు ఇప్పటికే చేపట్టామని చెప్పారు.
హైదరాబాద్-జోధ్‌పూర్ డైరెక్ట్ రైలు
హైదరాబాద్-జోధ్‌పూర్ మధ్య మొదటి రోజువారీ డైరెక్ట్ రైలుకు శనివారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రైలు సర్వీసుతో హైదరాబాద్-జోధ్‌పూర్ ల మధ్య రైలు కనెక్టివిటీని పెంచుతుందని మంత్రి చెప్పారు. తెలంగాణ,రాజస్థాన్ రాష్ట్రాల మధ్య ప్రయాణించే ప్రయాణీకులకు ఈ రైలు సర్వీసు ఉపశమనం కలిగిస్తుందన్నారు.
కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్ సందర్శన
కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్‌ను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం సందర్శించారు. కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్‌ను తనిఖీ చేసి, దాని పురోగతి, కొనసాగుతున్న కార్యకలాపాలను మంత్రి అధికారులతో సమీక్షించారు. ఏఐ టెక్నాలజీ, సమగ్ర సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంపై రైల్వే శాఖ దృష్టి సారిస్తుందని మంత్రి చెప్పారు.తెలంగాణలోని శంకర్‌పల్లి - కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య విండో తనిఖీ నిర్వహించారు. భద్రతా పరమైన చర్యలను మంత్రి దక్షిణ మధ్య రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు.హైదరాబాద్ ప్రాంతంలో రైల్వే ప్రాజెక్టుల సామర్థ్యాన్ని రెట్టింపు చేయడంపై క్షేత్రస్థాయి అధికారులతో రైల్వే శాఖ మంత్రి సమీక్షించారు.