తెలంగాణలో అయిదు రోజుల పాటు వర్షాలు, ఐఎండీ హెచ్చరికల జారీ
x

తెలంగాణలో అయిదు రోజుల పాటు వర్షాలు, ఐఎండీ హెచ్చరికల జారీ

తెలంగాణలోని జిల్లాలకు రాగల ఆయిదు రోజుల పాటు ఐఎండీ ఎల్లో, ఆరంజ్, రెడ్ అలర్ట్ లు జారీ చేసింది.


తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రాగల అయిదు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారతవాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఆదివారం నాడు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా , నిర్మల్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం భద్రాద్రి-కొత్తగూడెం, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.ఈ నెల 21 వతేదీ వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో, ఆరంజ్, రెడ్ అలర్ట్ లు జారీ చేస్తున్నట్లు ఐఎండీ డైరెక్టర్ వివరించారు.


ఉపరితల ఆవర్తనం ప్రభావంతో...
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఆదివారం వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. ఉపరితల చక్రవాహత ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ నైరుతి దిక్కుకు వాలింది. ఈ అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల సమీపంలో ఈ నెల 19వతేదీన మధ్యాహ్నం తీరాన్ని దాటే అవకాశముందని ఐఎండీ అధికారులు చెప్పారు.

ఆరంజ్ అలర్ట్ జారీ
తెలంగాణలో ఆదివారం నుంచి ఈ నెల 21వతేదీ వరకు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఆదివారం తెలంగాణలోని కామారెడ్డి, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ సందర్భంగా అయిదు జిల్లాలకు ఆదివారం ఆరంజ్ అలర్ట్ జారీ చేశామని ఆయన తెలిపారు.



హైదరాబాద్ నగరంలో మోస్తరు వర్షాలు

హైదరాబాద్ నగరంలో ఆదివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ శాస్త్రవేత్త ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులతో పాటు గంటకు 30 నుంచి40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఆయన చెప్పారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్షియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్షియస్ నమోదు అయింది.

భారీ వర్షాలు...ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట,వికారాబాద్, వరంగల్ జిలాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారి ఎ ధర్మరాజు వెల్లడించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములు, మెరుపులతో కూడి
న భారీవర్షాలు కురిసే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. దీంతో 12 జిల్లాల్లో ఆదివారం ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఆగస్టు 18 వతేదీన భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున రెడ్ అలర్ట్ ప్రకటించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలోని ఆదిలాబాద్, హనమకొండ, కామారెడ్డి, ఖమ్మం, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట్, వికారాబాద్, వరంగల్ జిల్లాల్ోల అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేఅవకాశముందని అధికారులు చెప్పారు.

19న ఆరంజ్ అలర్ట్ జారీ
ఈ నెల 19వతేదీన మూడో రోజు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. ఆదిలాబాద్, హన్మకొండ,కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ఆరంజ్ అలర్ట్ జారీచేశారు. ఈ నెల 20వ తేదీ, 21వతేదీల్లోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశమున్నందున ఎల్లో అలర్ట్ జారీ చేశారు.



Read More
Next Story