తెలంగాణలో 17 జిల్లాల్లో వర్షాలు,ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ
x
హైదరాబాద్ నగరంలో వర్షంతో రోడ్డు జలమయం

తెలంగాణలో 17 జిల్లాల్లో వర్షాలు,ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ శనివారం విడుదల చేసిన వెదర్ బులిటిన్ లో వెల్లడించింది.


తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తాంధ్ర తీరం నుంచి ఉత్తర శ్రీలంక వరకు తమిళనాడు తీరం గుండా 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిందని ఆమె చెప్పారు. చాలా జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులు, ఈదురుగాలితో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఆమె వివరించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఆగస్టు 13వతేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని డైరెక్టర్ వివరించారు.


17 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలోని 17 జిల్లాల్లో శనివారం ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం శాస్త్రవేత్త ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి, నారాయణపేట్, మేడ్చల్ మల్కాజిగిరి, సూర్యాపేట, నల్గొండ, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, మెదక్, వరంగల్, హన్మకొండ, జనగామ,జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి,జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, మంచిర్యాల్ జిల్లాల్లో పలు చోట్ల ఒ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆయన తెలిపారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఆయన పేర్కొన్నారు.



రాబోయే రెండు గంటల్లో వర్షం

హైదరాబాద్ నగరంలో ఉత్తర దిశ నుంచి మేఘావృతం నగరం వైపు వస్తున్నందున పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్,చందా నగర్, గాజులరామారం,అమీన్ పూర్, బీరంగూడ, అల్వాల్ పరిసర ప్రాంతాలలో రాబోయే రెండు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డ్యూటీ అధికారి పి మల్లికార్జునరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. హైదరాబాద్ నగరంలోని ఇతర ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత, రాత్రి సమయంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆయన చెప్పారు.

తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా
నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట వంటి దక్షిణ జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. తదుపరి గంట పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. వచ్చే రెండు గంటల్లో సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెదర్ మ్యాన్ వివిరించారు.


Read More
Next Story