తెలంగాణలో రాగల అయిదు రోజుల పాటు వర్షాలు
x
తెలంగాణలో వర్షాలు

తెలంగాణలో రాగల అయిదు రోజుల పాటు వర్షాలు

తెలంగాణలో రాగల అయిదు రోజుల పాటు పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లోఅలర్ట్ జారీ చేసింది.


తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆగస్టు 31వతేదీ వరకు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న మంగళవారం రాత్రి ‘ఫెడరల్ తెలంగాణకు చెప్పారు.మంగళవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయని డైరెక్టర్ తెలిపారు. బుధవారం తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హనమకొండ, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్గొండ, పెద్దపల్లి, సూర్యాపేట్, వరంగల్, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిలాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని ఆమె వివరించారు. భారీవర్షాల నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాగల అయిదు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అధికారులు చెప్పారు.


బంగాళాఖాతంలో అల్పపీడనం
వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఒడిస్సా వెస్ట్ బెంగాల్ తీరాలకి సమీపంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ అధికారులు చెప్పారు. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు కొనసాగుతుందని వారు తెలిపారు. ఈ అల్పపీడనం రాగల రెండు రోజుల్లో వాయువ్యదిశలో కదిలి మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు చెప్పారు.

రేపు, ఎల్లుండి భారీవర్షాలు
తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మంగళవారం నుంచి ఆగస్టు 31వతేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు. రేపు, ఎల్లుండి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఆయన వివరించారు. రేపు ,ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు తో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. వర్షాలు కురవనున్న నేపథ్యంలో తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీ చేశామని ఆయన వివరించారు.

పలు జిల్లాల్లో భారీవర్షాలు
ఆగస్టు 26వతేదీ రాత్రి వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌ జిల్లాల్లోనూ నాన్‌స్టాప్ జల్లులు కురుస్తాయని వెదర్ మ్యాన్ పేర్కొన్నారు.హైదరాబాద్ నగరంలో ఓ మోస్తరు వర్షం కురుస్తుందని వెదర్ మ్యాన్ వివరించారు.


Read More
Next Story