
‘నాకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డే అడ్డుపడుతున్నారు’
మంత్రి పదవి అనేది ఆడంబరం, అందం కోసం వేసుకునే ఆభరణం కాదు. ఒక బాధ్యత. ఈ పదవిలో కూర్చునే వారు తమ బాధ్యతను గుర్తించి ప్రజలకు మంచి చేయాలని రాజగోపాల్ అన్నారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అత్యంత కీలకంగా ఉంది. మంత్రి పదవుల కోసం పలువురు నేతలు పోటీ పడుతుండగా.. కేబినెట్ ఎక్స్‌పాన్షన్‌లో పార్టీ హైకమాండ్‌దే తుది నిర్ణయమని టీపీసీసీ వెల్లడించింది. దీంతో మంత్రి పదవి కోసం జరుగుతున్న పోటీ కాంగ్రెస్ పార్టీలో మరింత తీవ్రతరం అయింది. తాజాగా ఇది కీలక మలుపు తీసుకుంది. ఇప్పటికే మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రేసులో ఉన్నారు. కానీ ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మంత్రిగా ఉన్న క్రమంలో ఆయనకు రావడం లేదని అంతా అనుకుంటున్నారు. కానీ తనకు మంత్రిపదవి రాకపోవడానికి కారణం తన అన్న కాదని, మాజీ హోంమంత్రి, పార్టీ సీనియర్ నేత జానారెడ్డే అంటూ తాజాగా రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీశాయి. అసలు రాజగోపాల్‌కు మంత్రిపదవి రాకుండా జానారెడ్డి ఎందుకు అడ్డుపడుతున్నారు? అన్న సందేహం తీవ్రతరం అవుతోంది.
‘‘జానారెడ్డి సహా పలువురు నేతలు కలిసి నాకు మంత్రిపదవి రాకుండా ధృతరాష్ట్రుడు పాత్ర పోషిస్తున్నారు. మంత్రి పదవి అంటే అడుక్కుంటే వచ్చేది కాదు. కెపాసిటీని బట్టి వస్తుంది’’ అని రాజగోపాల్ వ్యాఖ్యానించారు. ‘‘మంత్రి పదవి అనేది ఆడంబరం, అందం కోసం వేసుకునే ఆభరణం కాదు. ఒక బాధ్యత. ఈ పదవిలో కూర్చునే వారు తమ బాధ్యతను గుర్తించి ప్రజలకు మంచి చేయాలి. తెలంగాణను గతంలో ఒక కుటుంబ పార్టీ పాలించింది. వారి పాలనలో తమకు వంగివంగి దండాలు పెట్టిన వారికి మంత్రిపదవులు కట్టబెట్టారు. కానీ కాంగ్రెస్ అలాంటి పార్టీ కాదు. ఇదొక జాతీయ పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. నాకు మంత్రి పదవి ఇస్తే కిరీటంలా కాదు.. బాధ్యతగా భావిస్తా. నాలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదేపదే అడుగుతుంటే చాలా బాధేస్తోంది’’ అని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగానే తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఉండటం, ఇప్పుడు తాను మంత్రిపదవి కోరుకోవడంపై వస్తున్న వార్తలను కూడా తప్పుబట్టారు. ‘‘ఒక ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తారా? అని ఓ వ్యక్తి అంటున్నారు. దేశం తరఫున క్రికెట్లో అన్నదమ్ములు యూసుఫ్ పటాన్, ఇర్ఫాన్ పటాన్ ప్రాతినిధ్యం వహిస్తే లేనిది మంత్రి పదవులు ఇద్దరికి ఇస్తే తప్పా? 30 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి నేడు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల వారికి మంత్రి పదవి ఇవ్వాలని గుర్తొచ్చింది’’ అని అన్నారు. ‘‘పలు జిల్లాల్లో మంత్రులకు ఇన్‌ఛార్జ్ పదవులు ఇచ్చినా అక్కడ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. కానీ నేను భువనగిరిలో గెలిచాను. అయినా నాకు మంత్రి పదవి ఇవ్వడంలో కొందరు దుర్మార్గులు, జనారెడ్డి లాంటి వాళ్లు ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అంటే గల్లా ఎగరేసుకొని ఉంటాడే తప్పా అడుక్కునే స్థితిలో ఉండు. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి’’ అని రాజగోపాల్ అన్నారు.