
ఎన్నిక ద్వారా అధ్యక్షుడిని ప్రకటించాలి
అధిష్టానాన్ని ధిక్కరించిన బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్
కాంట్రవర్శీకి కేరాఫ్ అడ్రస్ గా బిజెపి హాట్రిక్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిలిచారు. నిత్యం ఏదో ఇష్యూ చేస్తూ ప్రచారంలో ఉంటున్న రాజాసింగ్ తాజాగా బిజెపి అధిష్టానాన్ని దిక్కరించారు. సంవత్సరకాలంగా నానుతున్న తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవికి ఎన్. రాంచందర్ రావు పేరు అధిష్టానం ఖరారు చేసింది. ఈ సమాచారం అందిన వెంటనే రాజాసింగ్ తన అసమ్మతి గళాన్ని ఎత్తారు. ఎన్నికలు నిర్వహించకుండా రాంచందర్ పేరు ఎలా ప్రకటిస్తారని ఆయన అధిష్టానాన్ని ప్రశ్నించారు.
‘‘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని నిర్ణయించినట్లు పార్టీలో పెద్ద ఎత్తునప్రచారం జరుగుతుంది. రాష్ట్ర అధ్యక్షుడిని బూత్ స్థాయి నుంచి ముఖ్య నేత వరకు ఓటు వేసి ఎన్నుకోవాలి. అంతే కాని మా వాడు మీ వాడు అంటూ నియమించుకుంటూ పోతే పార్టీకి నష్టం జరుగుతుంది. తెలంగాణలో బిజెపి అధికారంలో రావాలంటే కచ్చితంగా ఎన్నిక నిర్వభించాలి’’ అని రాజాసింగ్ డిమాండ్ చేశారు. సీల్డ్ కవర్ లో పార్టీ అధ్యక్షుడిని ప్రకటించడం భారతీయ జనతాపార్టీ సాంప్రదాయం కాదని అన్నారు. ఎన్నిక ద్వారా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించాలి అని ఆయన డిమాండ్ చేశారు.
ఇది కొత్తేం కాదు
అయితే రాజాసింగ్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చే ముందు సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియో ఒకటి వైరల్ చేశారు. నన్ను పార్టీ అధ్యక్షుడిగా చూడాలని మెజారిటీ బిజెపి కార్యకర్తలు ఫోన్ లు చేస్తున్నట్టు చెప్పారు. అందుకే నాకో అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నా. పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీలో గోరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తా. గోరక్షణ కు పాటు పడే కార్యకర్తలకు రక్షణగా నిలబెడతా. బిజెపి అవసరాన్ని గడప గడపకు చాటి చెబుతా. ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు అభ్యర్థులను ప్రకటిస్తాం. అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు. విఐపిలా ఉండే వారు కాకుండా హిందుత్వం కోసం పని చేసే వ్యక్తిని నియమిస్తే బాగుంటుంది. రాజాసింగ్ అధ్యక్షుడు కావొద్దని ఓ బృందం పని చేస్తుంది అని ఆరోపణలు చేశారు.
రాజాసింగ్ అధిష్టానాన్ని ధిక్కరించడం ఇది కొత్తేం కాదు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డిని నియమించినప్పుడు అప్పట్లో గట్టిగా వ్యతిరేకించారు. బండి సంజయ్ ను కొనసాగిస్తే బిజెపి అధికారంలో వచ్చేదని బాహాటంగానే చెప్పేశారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలో రాకపోవడానికి అధిష్టానమే కారణమని రాజాసింగ్ పరోక్షంగా చెప్పారు. రాజాసింగ్ స్టేట్ మెంట్ పై బిజెపి ఏ విధంగా తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.