చాన్నాళ్ల తర్వాత  రాజీవ్ గాంధీ మళ్లీ ప్రత్యక్షం...
x

చాన్నాళ్ల తర్వాత 'రాజీవ్ గాంధీ' మళ్లీ ప్రత్యక్షం...

తెలంగాణలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు రాజకీయ వివాదానికి దారి తీసింది.


తెలంగాణలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు రాజకీయ వివాదానికి దారి తీసింది. రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు సెక్రటేరియట్ లో ఆయన విగ్రహాన్ని పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య మరో వార్ మొదలైంది. రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. కానీ దీనిని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. విగ్రహం పెడితే తొలగిస్తాం అంటూ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో రాజీవ్ గాంధీ విగ్రహ రగడ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

విగ్రహం తొలగిస్తాం...

రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థలంలో పెడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అక్కడ విగ్రహం పెడితే తొలగిస్తాం అని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో మేము ఉన్నపుడు సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయించిన స్థలంలో పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో మేము అధికారంలో ఉన్న రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టు పేరు మార్చలేదు.. కానీ తర్వాత మేము అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ పేరు తీసేసి పీవీ నరసింహారావు లేదా ప్రొఫెసర్ జయశంకర్ అని పేరు మారుస్తాం అని కేటీఆర్ హెచ్చరించారు.

విగ్రహాలపై పడ్డ కాంగ్రెస్?

రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోయింది. తెలంగాణలో దాదాపు పదేళ్ళపాటు దివంగత కాంగ్రెస్ ప్రముఖుల పేర్లు మచ్చుకి కూడా వినిపించని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడా పథకాలకు కాంగ్రెస్ నేతల పేర్లు కానీ, వారి విగ్రహాల ఏర్పాటుకి కానీ నోచుకోలేదు. అంతకుముందు కాంగ్రెస్ పదేళ్ళపాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ప్రభుత్వ పథకానికి, నిర్మాణాలకు కాంగ్రెస్ దివంగత నేతల పేర్లే ఉండేవి. వైఎస్సార్ మరణంతో జాతీయ నేతలకంటే ఎక్కువగా రెండు రాష్ట్రాల్లోనూ వైఎస్సార్ కే ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. ఊరూరా ఆయన విగ్రహాలే వెలిశాయి. మొత్తంగా పదిహేనేళ్ల పాటు కాంగ్రెస్ దివంగత అగ్రనేతల విగ్రహాలు రాష్ట్రంలో కరువయ్యాయి.

ఈ క్రమంలో ఇందిరమ్మ పాలన, రాజీవ్ గాంధీ రాజ్యం అంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్... అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పేర్లు మళ్ళీ జనాల్లో గుర్తుండిపోవాలని ప్రణాళికలు వేస్తున్నట్టు కన్పిస్తోంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చాకలి ఐలమ్మ, ప్రొఫెసర్ జయశంకర్ వంటి తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలను ప్రతిష్టించింది. దివంగత భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ నేత అయిన పీవీ నరసింహారావు విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రతిష్టించి సెంటిమెంట్ కురిపించింది. మన తెలంగాణ నాయకుడికి కాంగ్రెస్ ద్రోహం చేసిందని పీవీని ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది.

ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల జపం చేస్తోంది. వారి విగ్రహాల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. అలాగే గతంలో ఏర్పాటు చేసిన విగ్రహాలకు సైతం కొత్త హంగులు పులుముతోంది. ఈ క్రమంలో సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై ద్రుష్టి సారించింది. ఈ నెల 20వ తేది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ముందు ఏర్పాటు చేస్తున్న రాజీవ గాంధీ విగ్రహావిష్కరణ చేయబోతోంది. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Read More
Next Story