బీజేపీ అభ్యర్థి మాధవీలతపై రాజుకున్న ‘రామబాణం’ వివాదం
x
madhavi latha arrow gestre (Photo Credit : Facebook)

బీజేపీ అభ్యర్థి మాధవీలతపై రాజుకున్న ‘రామబాణం’ వివాదం

హైదరాబాద్ రామనవమి వేడుకల్లో బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలతపై వివాదం రాజుకుంది. మసీదు వైపు రామబాణం ఎక్కుపెట్టినట్లు చేసిన సంజ్ఞల వీడియో వివాదం రేపింది.


హైదరాబాద్ నగరంలో జరిగిన రామనవమి వేడుకల్లో హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత సిద్దియాంబర్ బజార్ మసీదు ముందు రామబాణం ఎక్కుపెట్టినట్లు చేసిన సంజ్ఞల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏప్రిల్ 17న జరిగిన రామనవమి ర్యాలీలో పాల్గొన్న మాధవీలత మసీదు వైపు బాణం వేస్తూ సైగ చేసి వివాదంలో చిక్కుకున్నారు.

- మసీదు వైపు ‘బాణం’ వేసినందుకు బీజేపీ అభ్యర్థి మాధవి లతపై ఒవైసీ మండిపడ్డారు.బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు శాంతిభద్రతలకు ముప్పు కలిగిస్తున్నాయని, వారి చర్యలతో ‘హైదరాబాద్‌ బ్రాండ్‌’ను నాశనం చేస్తున్నాయని ఒవైసీ ఆరోపించారు.
- హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రెచ్చగొట్టే సైగలు చేసిన ఘటనపై పోలీసులు, ఎన్నికల కమిషన్ మౌనం వహించడం ఏమిటని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి ఏం చేస్తున్నారో చెప్పాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు.


-‘‘మాధవీలత సైగలపై ఎన్నికల సంఘం, సీఈఓ,నగర పోలీసు కమిషనర్‌ను ఎందుకు అడగరు? అని అసదుద్దీన్ విలేకరులను ప్రశ్నించారు.‘‘ఈ వీడియో ఎన్నికల కమిషన్ చూడలేదా? నేను అదే చేసి ఉంటే, నాపై సుమోటో చర్య తీసుకునే వారు’’అని ఒవైసీ అన్నారు.
- ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నగరంలో బీజేపీ అభ్యర్థి చర్య రెచ్చగొట్టే విధంగా ఉందని ఒవైసీ ఆరోపించారు. కాగా ఈ వివాదంపై మాధవీలత స్పందిస్తూ అక్కడ మసీదు ఉందని తనకు తెలియదని వివరణ ఇచ్చారు.
- ‘‘నేను ఒక భవనం వైపు బాణం వేస్తున్నట్లు సైగ చేశాను, అంతే... మసీదు ఎక్కడ నుంచి వచ్చింది?’’ అని మాదవీలత ఎదురు ప్రశ్నించారు. యువతను రెచ్చగొట్టేందుకు ఒవైసీ, అతని మద్దతుదారులు వివాదాలు రేకెత్తిస్తున్నారు’’అని ఆమె ఆరోపించారు. తాను హిందూ, ముస్లిం సోదరులతో కలిసి బాగా పని చేస్తున్నందున తమపై కుట్ర పన్నారని ఆమె పేర్కొన్నారు.
- 15 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న కాషాయ పార్టీ చర్యలను హైదరాబాద్‌, తెలంగాణ ప్రజలు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


క్షమాపణలు చెప్పిన మాధవీలత
వివాదం రేపిన వీడియోపై బీజేపీ అభ్యర్థి మాధవీలత క్షమాపణలు చెప్పారు. ‘‘నాపై ప్రతికూలతను సృష్టించడానికి నా వీడియో ఒకటి మీడియాలో ప్రసారం చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది. ఇది అసంపూర్ణమైన వీడియో అని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను, అలాంటి వీడియో కారణంగా ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే, నేను ఆ వ్యక్తులందరినీ గౌరవిస్తాను కాబట్టి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను’’ అని మాధవీలత గురువారం ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

చర్యలు తీసుకోవాలని నెటిజన్ల డిమాండ్
రామ నవమి ఊరేగింపు సందర్భంగా మాధవీలత సిద్దియాంబర్ బజార్ మసీదు వద్ద బాణం వేసినట్లు చేసిన సంజ్ఞపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేశారు. ఆన్‌లైన్‌లో వెలువడిన వీడియోలో మాధవీ లత సిద్దియాంబర్ జంక్షన్‌లో జీపుపై నిలబడి, బాణం గురిపెట్టినట్లు నటిస్తుండగా జనం చూశారు. జనాలు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించి బీజేపీ నాయకురాలి చర్యలను చిత్రీకరించారు. మరికొందరు నెటిజన్లు మాధవీలత సంజ్ఞను సమర్ధిస్తున్నారు. దీనిపై శుక్రవారం రాత్రి వరకు పోలీసులు కానీ ఎన్నికల కమిషన్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.


Read More
Next Story