
POCSO Act | అమ్మాయిలపై అత్యాచారాలు,దోషులకు కఠిన కారాగార శిక్షలు
బాలికలపై అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.పోక్సో కేసుల్లో 60 రోజుల్లో విచారణ జరపడంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు దోషులకు శిక్షలు వేశాయి.
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు మైనర్ బాలికలపై 170 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 187 మంది దోషులుగా కోర్టు ప్రకటించింది.మైనర్లపై అత్యాచారాల ఘటనల్లో సత్వర న్యాయం అందించేందుకు పోలీసులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు యత్నిస్తున్నాయి.ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ (పోక్సో యాక్ట్) దీంతో ఈ నెలలోనే పలు కేసుల్లో న్యాయమూర్తి సంచలన తీర్పులు వెలువరించారు.
60 రోజుల్లో పోక్సో కేసుల దర్యాప్తు
హైదరాబాద్ నగరంలో మైనర్ బాలికలపై అత్యాచారాల కేసులు పెచ్చు పెరిగాయి. ముక్కుపచ్చలారని అమ్మాయిలపై కామాంధులు అత్యాచారాలకు ఒడిగడుతున్న ఘటనలు పెరిగిన నేపథ్యంలో ఈ కేసుల సత్వర పరిష్కారానికి పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. బాలికలపై అత్యాచారం జరిగిన తర్వాత 60 రోజుల్లోగా పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్లు వేస్తున్నారు. మైనర్లపై అత్యాచారాల్లో పోక్సో కేసుల విచారణకు ప్రభుత్వం ప్రత్యేకంగా పోక్సో కోర్టులను ఏర్పాటు చేసింది.
సాక్ష్యాధారాలతో దోషులకు శిక్షలు
పోలీసులు సత్వర విచారణ జరిపి జడ్జీలు దోషులకు శిక్షలు కూడా వేస్తున్నారు. ఈ కేసుల విచారణకు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధలో ప్రత్యేక కోర్టు బృందాలను ఏర్పాటు చేసింది. సంచలనం రేపిన అత్యాచార ఘటనలపై తాము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఛార్జిషీట్లు వేయడం వల్ల దోషులకు కోర్టులు సత్వర శిక్షలు విధిస్తున్నాయని రాచకొండ సెంట్రల్ క్రైం రికార్డ్ బ్యూరో ఏసీపీ రమేష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ కేసుల్లో సాక్ష్యాధారాలను తాము పకడ్బందీగా కోర్టుల్లో ప్రవేశపెడుతుండటం వల్ల పలు కేసుల్లో దోషులకు యావజ్జీవ కారాగార శిక్షలు పడ్డాయని ఏసీపీ రమేష్ వివరించారు.
రాచకొండలో ఎన్నెన్నో పోక్సో కేసులు
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 170 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 187 మంది దోషులుగా కోర్టు ప్రకటించింది.31 పోక్సో కేసుల్లో దోషులకు ప్రత్యేక కోర్టు జడ్జీలు శిక్ష విధించారని రాచకొండ సెంట్రల్ క్రైం రికార్డ్ బ్యూరో ఏసీపీ రమేష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ కేసుల్లో 9 మంది దోషులకు జీవిత ఖైదు, 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షలను జడ్జి విధించారు. మరో 12 మందికి పదేళ్ల జైలు, ఏడుగురికి ఏడేళ్ల కారాగార శిక్ష విధించారు. మరో 16 మంది దోషులకు అయిదేళ్ల జైలు,నాలుగేళ్లు లేదా అంతకంటే తక్కువ జైలు శిక్షను 94 మంది దోషులకు జడ్జి విధించారని ఏసీపీ రమేష్ తెలిపారు.
పోక్సో కేసులో దోషికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ మెకానిక్ వరికుప్పల మహేష్ యాదయ్య అనే యువకుడు ఒక మైనర్ బాలికను ప్రేమ పేరుతో మభ్యపెట్టి, ఆమెను అపహరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
రంగరెడ్డి జిల్లా సరూర్ నగర్ చంపాపేట్ విష్ణుపురి కాలనీలో బైక్ మెకానిక్ మహేష్ యాదయ్య(23) అనే యువకుడు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో అతనిపై సెక్షన్ 366,376 (2), ఐపీసీ సెక్షన్ 5, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సరూర్ నగర్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు ఛార్జిషీటు వేశారు. ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి మహేష్ యాదయ్యను దోషిగా నిర్ధారించి, అతనికి 20 షంవత్సరాల జైలు శిక్ష, రూ.25వేల జరిమానా, బాధిత బాలికకు రూ.5లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
రేపిస్టుకు జీవిత ఖైదు
ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎనిమిదేళ్ల మైనర్ బాలికను మాయమాటలతో ఆశచూపించి, అపహరించి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన సంచలనం రేపింది.ఈ కేసులో దోషి ఆటోడ్రైవర్ షేక్ జావీద్ (27) కు పోక్సో చట్టం ప్రకారం జడ్జి జీవిత ఖైదు శిక్ష విధించారు.ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో బాలికపై అత్యాచారం జరిగిందని సాక్ష్యాధారాలు దొరికాయి. ఈ కేసులో ఎల్.బి.నగర్‌లోని రంగారెడ్డి జిల్లా గౌరవ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి ఫిబ్రవరి 11వతేదీన నిందితుడిని దోషిగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడు జావీదుకు జీవిత ఖైదు శిక్ష, రూ.25వేల జరిమానా విధించారు. బాధిత బాలికకు రూ.10 లక్షల పరిహారం అందించారు.
పోక్సో కేసులో నిందితుడికి ఏడాది కఠిన కారాగారం
సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికతో పరిచయం పెంచుకుని, ప్రేమ పేరుతో వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలో దోషి జలపూర్ సాయి కిరణ్ (20)కు పోక్సో చట్టం ప్రకారం ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష విధించారు. రంగారెడ్డి జిల్లా ఎల్.బి.నగర్‌లోని ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి ఫిబ్రవరి 5వ తేదీన నిందితుడు సాయికిరణ్ ను దోషిగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడికి ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష,రూ.2 వేల జరిమానా విధించారు. బాధిత బాలికకు రూ.50వేల పరిహారం అందించారు.
పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అరబిక్ భాష నేర్పిస్తూ ఒక మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలో దోషి మొహమ్మద్ షాహబాజ్ (36)కు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. బాలికపై అత్యాచారం, పోక్సో చట్టం ప్రకారం రంగారెడ్డి జిల్లా ఎల్.బి.నగర్‌లోని ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి ఫిబ్రవరి 4వతేదీన నిందితుడు షాహబాజ్ ను దోషిగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడికి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష,రూ.5వేల జరిమానా విధించారు.
Next Story