తెలంగాణలో అరుదైన ధన్వంతరి శిల్పం
x

తెలంగాణలో అరుదైన ధన్వంతరి శిల్పం

మహబూబాబాద్ జిల్లా మండలకేంద్రం గూడూరులోని పాకాలవాగు ఒడ్డున


మహబూబాబాద్ జిల్లా మండలకేంద్రం గూడూరులోని పాకాలవాగు ఒడ్డున అరుదైన కాకతీయానంతరశైలి శిల్పాన్ని తెలంగాణ వారసత్వశాఖ అధికారి మల్లునాయక్ గారు గుర్తించారు.

సమపాద స్థానకభంగిమలో పద్మపీఠంపైన నిలబడివున్న ఈ మూర్తి ద్విభుజుడు. కుడిచేతిలో జలపాత్ర, ఎడమచేతిలో శంఖం ధరించి వున్నాడు. మెడలో హార,గ్రైవేయకాలున్నాయి. దండరెట్టలమీద, ముంజేతులకు కంకణాదులున్నాయి. కాళ్ళకు కడియాలు, పాంజీబులున్నాయి. కౌపీనం ధరించివున్నాడు. పరివారంగా చక్రపురుషుడు, గదాదేవి ఉన్నారు.

ప్రతిమాలక్షణాలనుబట్టి ఈ మూర్తి ధన్వంతరి. ఈ శిల్పం నిరాలంబంగా ఉంది. ధన్వంతరి శిల్పాలు సర్వాభరణాలంకృతమై కనిపిస్తాయి. ఈ విగ్రహం సాదాగా కనిపిస్తున్నది. శైలిని బట్టి ఈ శిల్పం కాకతీయానంతరశైలికి చెందినదని కొత్త తెలంగాణచరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ అన్నారు.

ఈ శిల్పాన్ని పాకాలవాగు ఒడ్డున నుంచి వరంగల్ పురావస్తు ప్రదర్శనశాలకు తరలించి, భద్రపరచాలని కొత్త తెలంగాణచరిత్రబృందం తెలంగాణ వారసత్వశాఖను కోరుతున్నది.

ఈ మూర్తి ప్రతిమాలక్షణాలను గుర్తించడంలో సుపర్ణమహి(టి.మహేశ్, అద్దంకి) సహకరించాడు.

ఫోటోగ్రఫీ: మల్లునాయక్, తెలంగాణ వారసత్వశాఖ, హైద్రాబాద్

Read More
Next Story