నంగునూరులో అరుదైన  ‘స్థాపనాచార్య’ జైన శిల్పం
x

నంగునూరులో అరుదైన ‘స్థాపనాచార్య’ జైన శిల్పం

శిల్పంలో జైనగురువు, అతనికి రెండు పక్కల శ్రావకులు, కింద వ్యాసపీఠానికి రెండువైపుల అతని బోధన వింటున్న శిష్యులు కనిపిస్తున్నారు.


జైనధర్మంలో విగ్రహపూజ రావడానికి ముందు చిహ్నాల ఆరాధన ఉండేది. అందులో ధర్మచక్రం, మానస్తంభం, శిలాపటం, ఆయగపట్టాలు, స్తూపాలు, పంచ పరమేష్టి, సిద్ధచక్రం, అష్టమంగళాలు, త్రిరత్న, చైత్యవృక్షం, నందీశ్వర ద్వీపం, చరణపాదుకలు, నిశీధులు, స్థాపనాచార్యలు ముఖ్యమైనవి.

జైన సాధువు, పుస్తకం, వ్యాసపీఠం, శిష్యులున్నట్టు చెక్కిన శిల్పాన్ని స్థాపనాచార్య అంటారు. పుస్తకగచ్ఛ, సరస్వతీ గచ్ఛగా గుర్తించబడ్డ ఇటువంటి శిల్పాలు ప్రాథమికంగా ‘స్థాపనాచార్య’లే. కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ తన స్వంత గ్రామం నంగునూరులో స్థాపనాచార్య శిల్పాన్ని గుర్తించాడు. గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉన్న శిలాస్తంభాన్ని పరిశీలించి, అది జైన శిల్పమని ప్రాథమికంగా గుర్తించాడు. శిల్పంలో జైనగురువు, అతనికి రెండు పక్కల శ్రావకులు, కింద వ్యాసపీఠానికి రెండువైపుల అతని బోధన వింటున్న శిష్యులు కనిపిస్తున్నారు. ఈ శిల్పాన్ని పరిశీలించిన చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఇది 11,12వ శతాబ్దాలకు చెందిన జైన శిల్పాలలో అరుదైన స్థాపనాచార్య శిల్పం అని తెలిపారు. స్థపతి, మరియు చరిత్రకారుడు డా.ఈమని శివనాగిరెడ్డి గారు కూడా ఇదే విషయాన్ని నిర్ధారించారు. గతంలో లభించిన ఆధారాలను బట్టి గ్రామం పెద్ద జైన కేంద్రంగా ఉండేదని తెలిసింది. కానీ తాజాగా లభించిన ఈ శిల్పాన్ని బట్టి గ్రామం గొప్ప జైన విద్య కేంద్రంగా కూడా వెలుగొందిదని తెలుస్తుంది.

Read More
Next Story