
సెక్యూరిటి లేకుండా ట్యాంక్ బండ్ పై రేవంత్ సడెన్ సర్ ప్రైజ్
సచివాలయం(Telangana Secretariat) ముందు, నెక్లసె రోడ్డు, ట్యాంక్ బండ్(Tank bund) జనాలతో ఇసుకేస్తే రాలనంతగా నిండిపోయింది.
ఒకవైపు వినాయక నిమజ్జనాల ఊరేగింపులతో హైదరాబాద్, సికింద్రాబాద్ నగర వీధులు దద్దరిల్లిపోతున్నాయి . మరోవైపు నిమజ్జనాల(Ganesh immersion) కోసం తీసుకువస్తున్న వినాయకుడి విగ్రహాలతో జంటనగరాల్లోని ప్రధాన రోడ్లు దాదాపు జనాలతో క్రిక్కిరిసిపోయాయి. గణేష్ నిమజ్జనాలను ప్రత్యక్షంగా చూసేందుకు జంటనగరాల్లోని అనేక ప్రాంతాలకు చెందిన వేలాది ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. విగ్రహాల నిమిజ్జనం చూసేందుకు వేలాదిమంది తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదున్నారు. సచివాలయం(Telangana Secretariat) ముందు, నెక్లెసె రోడ్డు, ట్యాంక్ బండ్(Tank bund) జనాలతో ఇసుకేస్తే రాలనంతగా నిండిపోయింది. ఇలాంటి సమయంలో ట్యాంక్ బండ్ పై ఒక్కసారిగా కలకలం రేగింది. కారణం అక్కడ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రత్యక్షమవ్వటమే.
అవును, మీరుచదివింది నిజమే. రేవంత్ ఒక్కసారిగా జనాల మధ్యలో ట్యాంక్ బండ్ పై ప్రత్యక్షమయ్యాడు. అశేష సంఖ్యలో గుమిగూడిన జనాల మధ్యలోకి ముఖ్యమంత్రులు రావటం దాదాపు జరిగేపనికాదు. ఎందుకంటే వేలాదిమంది మధ్యలోకి ముఖ్యమంత్రులు వెళ్ళేందుకు సెక్యురిటి అధికారులు అనుమతించరు. ఏవైపు నుండి ఎలాంటి ప్రమాదం మీదపడుతుందో అన్న ఆందోళనతో సెక్యూరిటి అధికారులు ఒప్పుకోరు. అలాంటిది రేవంత్ ట్యాంక్ బండ్ మీద వేలాది జనాల మధ్యలో కనబడటాన్ని ముందు చాలామంది జనాలు నమ్మలేదు.
అయితే రేవంత్ ట్యాంక్ బండ్ మీద ప్రత్యక్షమైంది నిజమే. గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల గురించి, పోలీసు బందోబస్తు గురించి, ట్యాంక్ బండులో విగ్రహాల నిమజ్జనానికి చేసిన ఏర్పాట్లగురించి రేవంత్ అక్కడున్న జనాలను అడిగి తెలుసుకున్నారు. రేవంత్ తో మాట్లాడేందుకు జనాలు ఎగబడటంతో కాసేపు ట్యాంక్ బండ్ పై తోపులాట జరిగింది. అయితే పోలీసులు నియంత్రించటంతో వెంటనే తొక్కిసలాట నియంత్రణలోకి వచ్చింది. భక్తులు, స్ధానికులతో కాసేపు మాట్లాడిన రేవంత్ అక్కడినుండి వెళ్ళిపోయారు.
మామూలుగా ముఖ్యమంత్రి పర్యటన అంటేనే ప్రోటోకాల్ ప్రకారం సుమారు 350 మంది పోలీసులు రక్షణగా ఉంటారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతంలో ముందు రోప్ పార్టీ ఉంటుంది. ఈ రోప్ పార్టీలోనే సుమారు 100 మందికి పైగా ఏఆర్ పోలీసులు ఉంటారు. తర్వాత సీఎంకు రక్షణగా ఔటర్ లైనులో చుట్టూ మరో 100 మంది దాకా ఇంటెలిజెన్స్ సిబ్బంది ఉంటారు. ఆ తర్వాత రక్షణగా ఇన్నర్ లైనులో మరో 50 మంది పోలీసులుంటారు. చివరగా ముఖ్యమంత్రి చుట్టు సెక్యూరిటి అధికారులు, బ్లాక్ క్యాట్ కమేండోలు ఉంటారు. ఇన్ని వలయాల మధ్య పర్యటన సాగుతుంది కాబట్టి జనాలందరికీ ముందే ముఖ్యమంత్రి వస్తున్నది తెలిసిపోతుంది.
అయితే ఇపుడు ట్యాంక్ బండ్ మీదకు రేవంత్ వచ్చినపుడు పైన చెప్పిన రక్షణ వలయాలు ఏవీ లేవు. మఫ్టీలో కొద్దిమంది పోలీసులు మాత్రమే రక్షణగా జనాల్లో కలిసిపోయారు. రేవంత్ చుట్టు పదిమంది మాత్రమే సెక్యూరిటి వలయంగా నిలబడ్డారు. ట్యాంక్ బండ్ మీదకు వెళ్ళేటపుడు సెక్యూరిటితో వెళితే జనాలకు అసౌకర్యంగా ఉంటుందన్న కారణంగానే రేవంత్ రెగ్యులర్ గా ఉండే రోప్ పార్టీతో పాటు ఇతర సెక్యూరిటీని వద్దని వారించారు. ఏదేమైనా సరైన సెక్యూరిటి లేకుండా ట్యాంక్ బండ్ మీద రేవంత్ ప్రత్యక్షమవ్వటం మాత్రం ప్రమాదకరమనే చెప్పాలి.