ఓట్లలో  నెహ్రు కన్నా మిన్న ఈ తెలంగాణ నేత
x
Ravi Narayana Reddy

ఓట్లలో నెహ్రు కన్నా మిన్న ఈ తెలంగాణ నేత

మొదటి ఎన్నికలు 1952లో జరిగాయి. ఆ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఒక ముఖ్యమైన ఘట్టం జరిగింది.


బ్రిటీష్ వలస పాలన పోయి మనదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన రోజులు. మొదటి ఎన్నికలు 1952లో జరిగాయి. ఆ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఒక ముఖ్యమైన ఘట్టం జరిగింది. అదేమిటంటే నల్గొండలో పోటీచేసిన స్వాతంత్ర్య పోరాట వీరుడు, కమ్యూనిస్టు ప్రముఖ నేత రావి నారాయణరెడ్డి అత్యధిక మెజారిటితో గెలిచారు. ఇక్కడ రావికి అత్యధిక మెజారిటి రావటంలోవిశేషం ఏమీలేదు. విషయం ఏమిటంటే దేశ తొలి ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూకు మించిన మెజారిటి రావటమే గొప్ప. అప్పటి ఎన్నికల్లో నెహ్రూ ఉత్తర ప్రదేశ్ లోని ఫూల్ పూర్ నియోజకవర్గంలో ద్విసభ్య నియోజకవర్గం నుండి పోటీచేశారు.

కాంగ్రెస్ అభ్యర్ధులుగా నెహ్రూ, మసూరియా దిన్ ఇద్దరు పోటీచేశారు. వీళ్ళిద్దరిలో నెహ్రూ తన సమీప కేఎంపీపీ అభ్యర్ధి బన్సీలాల్ పైన గెలిచారు. అలాగే మసూరియా ఇండిపెండెంట్ అభ్యర్ధి ప్రభుదత్ బ్రహ్మచారి మీద గెలిచారు. నెహ్రూకు 2,33,571 ఓట్లొస్తే బన్సీలాల్ కు 59,642 ఓట్లొచ్చాయి. నెహ్రూకు వచ్చిన మెజారిటి 1,73,929 ఓట్లు. అదే సమయంలో ద్విసభ్య నియోజకవర్గంగా నల్గొండలో కూడా ఎన్నిక జరిగింది. పీడీఎఫ్ అభ్యర్ధులుగా రావి నారాయణరెడ్డి, సుంకం అచ్చాలు పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులుగా పీ మహేంద్రనాధ్, వీ భాస్కరరావు పోటీచేశారు. రావికి 3,09,162 ఓట్లొస్తే పీ మహేంద్రనాధ్ కు 96,837 ఓట్లొచ్చాయి. అంటే రావికి వచ్చిన మెజారిటి 2,12,325 ఓట్లు. ఫూల్ పూర్ లో పోటీచేసిన నెహ్రూకు వచ్చిన మెజారిటి 1,73,929 ఓట్లయితే, నల్గొండలో పోటీచేసిన రావికి వచ్చిన మెజారిటి 2,12,325 ఓట్లు.

రావితో పోల్చుకుంటే జవహర్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న నేతనే చెప్పాలి. రావి నారాయణరెడ్డి పరిధి సమైక్య ఆంధ్ర ముఖ్యంగా తెలంగాణా ప్రాంతం మాత్రమే. అదే నెహ్రూ పరిధి ఇండియాను దాటేసింది. రావిగురించి రాష్ట్రం దాటి తెలిసింది తక్కువమందికే. కాని నెహ్రూ అంటే తలియని వాళ్ళు దేశంలో ఎవరూ ఉండరు. రావితో పోల్చితే ఇమేజిలో శిఖర సమానుడైన నెహ్రూకు వ్యతిరేకంగా పోటీచేయాలంటేనే ప్రత్యర్ధులు వెనకాముందాడాలి. అలాంటిది నెహ్రూకు మించి రావికి ఎక్కువ మెజారిటి రావటం అప్పట్లో దేశంలోనే సంచలనమని చెప్పాలి. అంటే ఫూల్ పూర్లో నెహ్రూకున్న ఇమేజికన్నా నల్గొండలో రావి నారాయణరెడ్డకి ఉన్న ఇమేజి చాలా చాలా ఎక్కువని అర్ధమవుతోంది.

Read More
Next Story