
జూబ్లీహిల్స్ లో పోటీకి రెడీ
2024 సార్వత్రిక ఎన్నికల్లో మాధవి(BJP Leader Madhavai Latha) హైదరాబాద్(Hyderabad) పార్లమెంటు అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలో పోటీచేయటానికి రెడీగా ఉన్నట్లు బీజేపీ నేత మాధవీలత ప్రకటించారు. ఉపఎన్నికలో ఎవరిని పోటీచేయించాలన్నది పార్టీ జాతీయ నాయకత్వం ఇష్టమని గుర్తుచేశారు. తనను గనుక పార్టీ నాయకత్వం పోటీచేయమని అడిగితే పోటీచేయటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాధవి(BJP Leader Madhavai Latha) హైదరాబాద్(Hyderabad) పార్లమెంటు అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు ఉపఎన్నికలో పోటిచేయించేందుకు గట్టి అభ్యర్ధులు ఎవరనే విషయమై పార్టీ కసరత్తు చేస్తోంది. ఇదే విషయమై పార్టీకి కొత్త అధ్యక్షుడిగా నియమితులైన ఎన్ రామచంద్రరావు కూడా దృష్టిపెట్టారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మాధవి పై ప్రకటనచేయటం ప్రాధాన్యత సంతరించుకున్నది.
ఇదే సందర్భంగా గోషామహల్ అసెంబ్లీ ఎంఎల్ఏ రాజాసింగ్ గురించి ఆసక్తికరమైన కామెంట్ చేశారు. రాజాసింగ్(Rajasingh) పార్టీకి రాజీనామా చేసిన కారణం ఆయనకైనా తెలుసా అనే అనుమానాన్ని వ్యక్తంచేశారు. ఎంపీగా తనకు పార్టీ టికెట్ ఇచ్చినపుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీలో ఎంపీగా పోటీచేసేందుకు మగాడు ఎవరూ లేరా అని బహిరంగంగానే నాయకత్వాన్ని రాజాసింగ్ తప్పుపట్టిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ఎంపీగా తనకన్నా ఎంఎల్ఏగా రాజాసింగ్ కు తక్కువ ఓట్లు వచ్చినట్లు చెప్పారు. గోషామహలే(Goshamahal) కాదని హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోను తాను పర్యటిస్తానని చెప్పారు.
పేదల ఇళ్ళను కూల్చేస్తున్న హైడ్రా(Hydra) ఓవైసీ సోదరుల నిర్వహణలో ఉన్న అక్రమనిర్మాణం ఫాతిమా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ జోలికి వెళ్ళటానికి ఎందుకు భయపడుతున్నదో తెలీటంలేదని ఎద్దేవా చేశారు. తన పార్లమెంటు పరిధిలో వేలాది మంది ప్రజలు హైడ్రా కారణంగా రోడ్డున పడినట్లు తెలిపారు. ఎంఐఎం ఇచ్చే డబ్బుల మూటలతో కాంగ్రెస్ ప్రభుత్వం నోరు కట్టేసుకున్నట్లు ఎద్దేవా చేశారు.