గ్రేటర్ పరిధిలో దూసుకుపోతున్న రియల్ ఎస్టేట్
x
Cyber towers

గ్రేటర్ పరిధిలో దూసుకుపోతున్న రియల్ ఎస్టేట్

జెట్ స్పీడుతో దూసుకుపోతోంది అనేకన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నది రియల్ ఎస్టేట్ రంగమే అనటంలో అతిశయోక్తిలేదు.


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. జెట్ స్పీడుతో దూసుకుపోతోంది అనేకన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నది రియల్ ఎస్టేట్ రంగమే అనటంలో అతిశయోక్తిలేదు. గడచిన ఏడుమాసాల్లో అంటే 2023 నవంబర్ నుండి మొన్నటి జూన్ నెలవరకు ఆస్తుల రిజిస్ట్రేషన్ల మీద ప్రభుత్వానికి రు. 4670 కోట్ల ఆదాయం వచ్చింది.

గ్రేటర్ పరిధిలో భవన నిర్మాణ రంగం బాగా పుంజుకోవటంతో ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు, భవనాలు, లేఅవుట్ల అమ్మకాలు, కొనుగోళ్ళు పెరగటంతో పాటు రిజిస్ట్రేషన్ల ఫీజు ద్వారా ప్రభుత్వానికి 4670 కోట్ల రూపాయలు వచ్చినట్లు ప్రభుత్వమే ప్రకటించింది. గడచిన రెండు సంవత్సరాల్లో భవన నిర్మాణం రంగం పుంజుకున్న విధానంపై ప్రభుత్వం ఒక రిపోర్టును విడుదలచేసింది. ఈ రిపోర్టును చూస్తే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం ఏ స్ధాయిలో పుంజుకున్నదో అర్ధమవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రిపోర్టు ఏడు మాసాలకు సంబంధించినది అయినప్పటికీ వాస్తవంగా లావాదేవీలు జరిగింది నాలుగు మాసాలు మాత్రమే. పార్లమెంటు ఎన్నికల వల్ల ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో మూడు మాసాలు రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి లావాదేవీలు జరగలేదు. కాబట్టి రిజిస్ట్రేషన్లు కూడా పెద్దగా లేవు.
అంటే ప్రభుత్వం ప్రకటించిన రిజిస్ట్రేషన్ల ఆదాయం రు. 4670 కోట్లు నాలుగునెలల్లో వచ్చినట్లుగానే చూడాలి. నాలుగు నెలల్లో వివిధ ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రు. 4670 కోట్ల ఆదాయం రావటం అంటే మామూలు విషయంకాదు. అసలే ఆర్ధిక కష్టాల్లో ఉన్న రేవంత్ ప్రభుత్వాన్ని రిజిస్ట్రేషన్ల శాఖ ఎంత గట్టిగా ఆదుకుంటోందో అర్ధమవుతోంది. అంతకుముందు అంటే 2023 మే నుండి 2023 నవంబర్ వరకు వచ్చిన ఆదాయం రు. 4429 కోట్లు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పటికన్నా కాంగ్రెస్ హయాంలో పెరిగిన ఆదాయం రు. 241 కోట్లు. గడచిన 7 మాసాల్లో జరిగిన వివిధ ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య 2,18,160. గడచిన ఏడాది జరిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య 1,93,962. అంటే మొత్తం రిజిస్ట్రేషన్లలో 12 శాతం వృద్ధి నమోదైంది.

ఈ ఏడాదిలో ఇప్పటివరకు అంటే ఏడు మాసాల్లో 54,111 ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2023 మొదటి ఏడు మాసాల్లో జరిగిన రిజిస్ట్రేషన్లు 50,535. 2023 డిసెంబర్ నుండి 2024, జూన్ వరకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో అనుమతికోరుతు వచ్చిన భవననిర్మాణ దరఖాస్తుల సంఖ్య 18,077. పోయిన సంవత్సరంలో మే నుండి డిసెంబర్ వరకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య 17,911. గడచిన ఏడు నెలల్లో జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణాలకు అనుమతించిన భవనాల సంఖ్య 7809. ఒక్కసారిగా నగరంలో రియల్ ఎస్టేట్ రంగం ఎందుకు ఊపందుకుంది. ఎందుకని జెట్ స్పీడుతో దూసుకుపోతోంది ?
ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, మెట్రో రైలు విస్తరణ, సికింద్రాబాద్ ను జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తు మొదలైన రెండు ఎలివేటెడ్ క్యారిడార్ల నిర్మాణంతో సిటీ రూపురేఖలే మారిపోబోతోన్నాయి. సైబర్ టవర్స్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఆ ప్రాంతమంతా రియల్ ఎస్టేట్ రంగంలో ఆకాశానికి దూసుకుపోవటం ఖాయం. ఇదే సమయంలో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కూడా ఊపందుకోవటంతో సిటీకి నాలుగువైపులా రియల్ ఎస్టేట్ రంగం మంచి ఊపుమీదుంది. అందుకనే రిజిస్ట్రేషన్ల రూపంలో ప్రభుత్వానికి వేలాదికోట్ల రూపాయల ఆదాయం వచ్చిపడుతోంది.

Read More
Next Story