విద్యుత్ వినియోగదారులకు నిజంగా శుభవార్తే
x
Telangana Discoms

విద్యుత్ వినియోగదారులకు నిజంగా శుభవార్తే

ఇంతకీ ఆ శుభవార్త ఏమిటంటే 2025-26 ఆర్ధికసంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెరగటంలేదు.


నిజంగా విద్యుత్ వినియోగదారులకు శుభవార్తనే చెప్పాలి. ఇంతకీ ఆ శుభవార్త ఏమిటంటే 2025-26 ఆర్ధికసంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెరగటంలేదు. విద్యుత్ ఛార్జీలు పెంచి లోటును భర్తీచేసుకోవాలని డిస్కంలు ప్రభుత్వానికి రిపోర్టు రూపంలో సిఫారసుచేసినా ఛార్జీలు పెంచటానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఛార్జీలు పెంచాలని డిస్కంలు సిఫారసుచేయటం, అందుకు రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం తిరస్కరించటం అంటే శుభవార్తకాక మరేమవుతుంది. మామూలుగా అయితే డిస్కంలు చెప్పాయని, ఆర్ధికలోటుందని ఏవేవో కారణాలతో ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీల(Electricity charges)ను పెంచి అందినకాడికి బాదటమే ఇప్పటివరకు వినియోగదారులకు(Consumers) అనుభవం. ఎలక్ట్రిసీటి రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ) ఛైర్మన్ విదేశాల్లో ఉన్న కారణంగా డిస్కంల రిపోర్టును జనాలముందు ఉంచకుండా నేరుగా ప్రభుత్వానికే సమర్పించాయి. ఛైర్మన్ హైదరాబాదు(Hyderabad)కు వచ్చిన తర్వాత అన్నీ విషయాలను ప్రజలకు నేరుగా వివరించబోతున్నారు.

వచ్చేఏడాది ఆదాయం కన్నా వ్యయం రు. 20,151 కోట్లు ఎక్కువగా ఉంటుందని డిస్కంలు తమ రిపోర్టులో ప్రభుత్వానికి వివరించాయి. ఆ లోటును ప్రభుత్వం రాయితీపద్దు కింద బడ్జెట్లో డిస్కంలకు కేటాయిస్తే విద్యుత్ ఛార్జీలు పెంచి వినియోగదారులను బాదాల్సిన అవసరం ఉందని డిస్కంలు అభిప్రాయపడ్డాయి. అయితే ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించటం అనుమానమే కాబట్టి డైరెక్టుగా ఛార్జీలు పెంచేస్తే సరిపోతుందన్నది డిస్కంల ఆలోచన. అయితే పైన చెప్పిన రు. 20,151 కోట్లలో 2024-25 ఏడాది రాయితీపద్దు కింద ప్రభుత్వం డిస్కంలకు రు. 12 వేలకోట్లను కేటాయించింది. రాబోయే ఏడాది లోటును కూడా భర్తీచేయాలంటే మరో రు. 8,151 కోట్లను బడ్జెట్లో కేటాయించాల్సుంటుంది. రెండేళ్ళుగా కరెంటు ఛార్జీలను పెంచకపోవటంతో డిస్కం(Discoms)ల ఆదాయం పెద్దగా పెరగలేదు. ఆదాయం పెరగకపోవటం ఒకవైపు, వినియోగం పెరిగిపోతుండటంమరోవైపు. వెరసి డిస్కంలకు నిర్వహణభారం విపరీతంగా పెరిగిపోతోంది.

ఇపుడు అమల్లో ఉన్న కరెంటు ఛార్జీల ప్రకారమైతే వచ్చేఏడాది రు. 45,698 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ఇదేసమయంలో నిర్వహణ వ్యయం రు. 65,849 కోట్లకు చేరుకుంటుంది. అంటే రు. 20,151 కోట్ల ఆర్ధికలోటు తప్పదని అర్ధమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ డిస్కం ఆదాయం రు. 36,277 కోట్లయితే, అంచనా వ్యయం రు. 46,035 కోట్లు. ఇక్కడే రు. 10 వేల కోట్ల లోటు కనబడుతోంది. వరంగల్ కేంద్రంగా ఉత్తర డిస్కం అంచనా ఆదాయం రు. 9,421 కోట్లయితే, అంచనా వ్యయం రు. 19,814 కోట్లు. ఇక్కడ కూడా సుమారు రు. 10 వేల కోట్ల లోటు కనబడుతోంది. ఉత్తర తెలంగాణలో వ్యవసాయ బోర్లు, కాళేశ్వరంతో పాటు ఎత్తిపోతల పథకాలు ఎక్కువగా ఉన్నందున కరెంటు వినియోగంతో పాటు నిర్వహణ వ్యయంకూడా ఎక్కువగానే ఉంటోంది. వీటన్నింటికీ అదనంగా అర్హులైన పేదలకు నెలకు 200 యూనిట్లవరకు ఉచిత విద్యుత్ పథకం ఉండనే ఉంది. రెవిన్యులు, లోటు ఎలాగున్నా విద్యుత్ ఛార్జీలు పెంచాలన్నడిస్కంల ప్రతిపాదనలను ప్రభుత్వం తిరస్కరించటం వినియోగదారులకు శుభవార్తనే చెప్పాలి.

Read More
Next Story