దెబ్బకు ‘హైడ్రా’ అంటేనే  వణికిపోతున్నారా ?
x
Hydra commissioner RV RangaNath

దెబ్బకు ‘హైడ్రా’ అంటేనే వణికిపోతున్నారా ?

కబ్జాలను క్లియర్ చేసేపనిలో హైడ్రా పడిందో వెంటనే రాజకీయంగా ఒత్తిళ్ళు మొదలైపోయాయి. వెంటనే హైడ్రాను ఉపసంహరించాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి.


హైడ్రా అంటేనే అక్రమార్కులు వణికిపోతున్నారు. హైడ్రా సంక్షిప్తనామానికి అసలు అర్ధం ఏమిటంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఈ హైడ్రా ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే హైదారాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వ స్ధలాలు ఏ రూపంలో ఉన్నా అంటే చెరువులు, కుంటలు, పార్కులు, ఆటస్ధలాలను ఆక్రమణలనుండి కాపాడటమే. ఒకవేళ ఇప్పటికే ఆక్రమణల్లో ఉంటే వాటిని తొలగించి దాన్ని రక్షించి తిరిగి ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకురావటమే ధ్యేయంగా హైడ్రా పనిచేస్తుంది. హైడ్రాకు ఐపీఎస్ అధికారి రంగనాధ్ ను ప్రభుత్వం కమీషనర్ గా నియమించింది. ఇందులో పనిచేసేందుకు ఎస్పీ స్ధాయి అధికారులు ఇద్దరితో పాటు కానిస్టేబుల్ స్ధాయి వరకు మొత్తం 259 మంది సిబ్బందిని నియమించింది.




తమ శాఖలకు సంబంధించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయని వివిధ శాఖల అధికారులు లేదా ప్రభుత్వ స్ధలాలు ఆక్రమణల్లో ఉన్నాయని మామూలు జనాలు చెబితే చాలు వెంటనే హైడ్రా అక్కడ వాలిపోతోంది. ఆక్రమణలను క్లియర్ చేయటంతో పాటు కాపాడేందుకే ప్రభుత్వం హైడ్రా పరిధిని 2500 చదరపు కిలోమీటర్లకు పెంచింది. హైడ్రాకు అందిన సమాచారం ప్రకారం నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని సుమారు 400 చెరువులు, కుంటల్లో 80 శాతం కబ్జాదారుల చేతిలో బందీలైపోయున్నాయి. అంటే కబ్జాకు గురయ్యాయి. ఇపుడు వీటన్నింటినీ కబ్జాదారుల నుండి కాపాడే పనిలో హైడ్రా బిజీగా ఉంది.



ఎప్పుడైతే కబ్జాలను క్లియర్ చేసేపనిలో హైడ్రా పడిందో వెంటనే రాజకీయంగా ఒత్తిళ్ళు మొదలైపోయాయి. వెంటనే హైడ్రాను ఉపసంహరించాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వ స్ధలాలను, ప్రజోపయోగ స్ధలాలను కబ్జాలు చేసేది ఎక్కువగా రాజకీయ నేతలు లేదా వాళ్ళ మద్దతున్న రియాల్టర్లే. అందుకనే ముందు రాజకీయనేతలు, మద్దతుదారుల్లో అలజడి పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే కబ్జా ఎవరిచేతుల్లో ఉందని చూడకుండా హైడ్రా అక్రమకట్టడాలను క్లియర్ చేసేస్తుండటమే.




ఎప్పుడైతే కబ్జాలను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం పూర్తిస్ధాయిలో అధికారాలు ఇచ్చిందో వెంటనే హైడ్రా రంగంలోకి దిగిపోయింది. ప్రభుత్వ స్ధలాల్లో నిర్మించిన 51 అక్రమనిర్మాణాలను కూల్చేసి తిరిగి ఆ స్ధలాన్ని హైడ్రా ప్రభుత్వానికి అప్పగించింది. మాదాపూర్, శివరాంపల్లిలో చాలా సంవత్సరాలుగా ఆక్రమణల్లో ఉన్న బం రుక్ ఉద్ దౌలా చెరువులోని కట్టడాలను కూల్చేసింది. ఈ నిర్మాణాలన్నీ అనధికారికం కావటంతో ముందుగా సమాచారం ఇచ్చినా పట్టించుకోని కారణంగా బుల్డోజర్లతో నిర్మాణాలను కూల్చేసింది. దీంతో పాటు కింగ్స్ కాలనీ, శాస్త్రీనగర్లోని కొందరు ప్రముఖల ఇళ్ళని కూడా కూలగొట్టేసింది. హైడ్రా లెక్క ప్రకారం పై రెండు కాలనీల్లోని కొందరు ప్రముఖుల ఇళ్ళు అనధికారికంగా నిర్మించినవే. ప్రభుత్వ భూములు తమ ఆక్రమణల్లోనుండి జారిపోతాయని అనుకుంటున్న నేతలు, మద్దతుదారులు తమకు అందుబాటులో ఉన్న వాళ్ళతో తమజోలికి రాకుండా ఉండేట్లుగా హైడ్రాపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.




అయితే ఒత్తిళ్ళను పట్టించుకుండా బహదూర్ పురా ఎంఎల్ఏ మొహమ్మద్ మొబిన్, ఎంఎల్సీ మీర్జా రహమత్ బేగ్ నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చేసింది. వీళ్ళిద్దరు ప్రభుత్వ స్ధలాలను ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. తమకు అందిన ఫిర్యాదులను హైడ్రా కన్ఫర్మ్ చేసుకుని వెంటనే రంగంలోకి దిగేసి కూల్చేసింది. పది ఎకరాల్లో నిర్మించిన అనేక కట్టడాలను హైడ్రా కూల్చేసి చెరువును మళ్ళీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చినట్లు కమీషనర్ రంగనాధ్ చెప్పారు. నగరంతో పాటు శివారుప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్ధలాలను హైడ్రా గుర్తించినట్లు రంగనాధ్ చెప్పారు. ఒక్కో ఆక్రమణను తొలగిస్తున్నామన్నారు.


ఇపుడు సమస్య ఏమిటంటే హైడ్రా ఏర్పాటు చట్టవిరుద్ధమంటు జీహెచ్ఎంసీలోని మజ్లిస్ కార్పొరేటర్లు కొందరు గోల మొదలుపెట్టారు. హైడ్రా ఏర్పాటుకు జీహెచ్ఎంసీలోని స్టాండింగ్ కమిటి, కౌన్సిల్ తీర్మానాలు లేకుండానే ప్రభుత్వం ఎలా ఏర్పాటుచేస్తుందంటు కొందరు కార్పొరేటర్లు మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలిసి నిరసన తెలిపారు. షేక్ పేట కార్పొరేటర్, స్టాండింగ్ కమిటి సభ్యుడు ఫరాజుద్దీన్ నాయకత్వంలో మేయర్ను కలిశారు. హైడ్రాను వెంటనే విత్ డ్రా చేయాల్సిందే అని పట్టుబట్టారు. జీహెచ్ఎంసీ మేయర్ అనుమతి లేకుండా హైడ్రా కబ్జాలను ఎలాగ తొలగిస్తుందంటు కార్పొరేటర్లు గద్వాలను నిలదీశారు.

వీళ్ళ సమస్యేంటి ?




హైడ్రాను వీళ్ళు ఎందుకింతగా వ్యతిరేకిస్తున్నారంటే ఆక్రమణలను తొలగిస్తున్నపుడు బహదుర్ పురా ఎంఎల్ఏ మొబిన్, ఇద్దరు కార్పొరేటర్లను హైడ్రా లెక్కేచేయలేదు. లెక్కచేయకపోగా వీళ్ళని అరెస్టుచేయించింది. వీళ్ళని అరెస్టుచేసి 10 ఎకరాల్లో అనధికారికంగా చేసిన నిర్మాణాలు మొత్తాన్ని కూల్చేసింది. దాంతో మజ్లిస్ ఎంఎల్ఏతో పాటు కార్పొరేటర్లు మండిపోతున్నారు. ప్రభుత్వభూముల ఆక్రమణల్లో ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అన్నీ పార్టీల నేతలు, మద్దతుదారులు కలిసిపోయారు. ఇపుడు హైడ్రా దెబ్బకు కబ్జాదారులందరు వణికిపోతున్నారు. ప్రభుత్వ స్ధలాలను ఆక్రమించుకుని దశాబ్దాలుగా తమ ఆధీనంలోనే ఉంచుకున్నవాటిన్నంటినీ ఇపుడు హైడ్రా క్లియర్ చేసి వెనక్కు లాక్కుంటోంది. వెనక్కు తీసుకున్న ఆక్రమితస్ధలం ఏ శాఖదైతే వెంటనే ఆ శాఖకు అప్పగించి పటిష్టమైన రక్షణ ఏర్పాటుచేస్తోంది. కబ్జాదారులు మళ్ళీ స్ధలంజోలికి రాకుండా హైడ్రా జాగ్రత్తలు తీసుకుంటోంది.

ప్రగతినగర్లోని ఎర్రచెరువులో నిర్మించిన మూడు నిర్మాణాలను హైడ్రా గురువారం కూల్చేసింది. ఈ మూడు భవనాల జోలికి హైడ్రా రాకుండా కొందరు విశ్వప్రయత్నాలు చేసుకున్నారని సమాచారం. అయితే ఎవరినీ లెక్కపెట్టకుండా గురువారం ఉదయమే స్ధలానికి చేరుకున్న హైడ్రా అధికారులు మూడింటిని నేలమట్టం చేసేశారు. కారణం ఏమిటంటే ఎర్రచెరువును ఆక్రమించి నిర్మాణాలు చేసేయటమే. విచిత్రం ఏమిటంటే ఈ నిర్మాణాలకు హెఎండీఏ అనుమతులుండటం. అంటే జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండీఏలోని టౌన్ ప్లానింగ్ అధికారుల్లోనే కొందరు అక్రమ నిర్మాణాలను అనుమతులిచ్చేస్తున్నారు. అయితే నిర్మాణాలకు ఎన్ని అనుమతులున్నా చెరువులు, ప్రభుత్వ స్ధలాల్లో నిర్మాణాలు చేయటం తప్పు. దీని ఆధారంగానే హైడ్రా ఇపుడు అక్రమార్కుల దుమ్ము దులిపేస్తోంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళితో పాటు మామూలు జనాలు, విజిల్ బ్లోయర్లు హైడ్రా చర్యలతో ఫుల్లు హ్యాపీగా ఉన్నారు. తమ పరిధిలో ఎక్కడెక్కడ అక్రమనిర్మాణాలున్నాయనే విషయాలను విజిల్ బ్లోయర్లు సాక్ష్యాధారాలతో సహా హైడ్రాకు వివరాలు అందిస్తున్నారు.


హైడ్రాను నేరుగా ఆపలేమన్న ఉద్దేశ్యంతోనే కబ్జాదారులంతా ఏకమై మజ్లిస్ పార్టీ నేతలను ముందుకు తోస్తున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ పరిధిలో మజ్లిస్ బలమైన రాజకీయ శక్తి అన్న విషయం తెలిసిందే. మజ్లిస్ కు ఏడుగురు ఎంఎల్ఏలు, ఒక ఎంపీ, ఇద్దరు ఎంఎల్సీలతో పాటు సుమారు 35 మంది కార్పొరేటర్లున్నారు. అందుకనే హైడ్రాకు వ్యతిరేకంగా కార్పొరేటర్లు ముందు జీహెచ్ఎంసీలో పావులు కదుపుతున్నారు. తొందరలో జరగబోయే స్టాండింగ్ కమిటిలో ఇదే విషయాన్ని చర్చించబోతున్నారు. రేవంత్ రెడ్డి ఆలోచన ప్రకారం ఏర్పాటైన హైడ్రా భవిష్యత్తు చివరకు ఏమవుతుందో అనే ఆసక్తి పెరిగిపోతోంది.

Read More
Next Story