revanth reddy asaduddin owaisi
x

పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో కొత్త పొత్తుకి సంకేతాలు??

సీఎం రేవంత్ రెడ్డి, ఎంఐఎం అధినేత పరస్పర ప్రశంసల వెనక ఆంతర్యం ఏంటి? తెలంగాణలో మరో పొత్తు తెరపైకి రానుందా? ఇప్పుడిదే రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తున్న హాట్ టాపిక్.


పార్లమెంటు ఎన్నికల వేళ పాతబస్తీలో నయా పొలిటికల్ దోస్తీ మొదలవనుందా? ఓల్డ్ సిటీ మెట్రో మార్గ్ ఓల్డ్ ఫ్రెండ్స్ ని మళ్ళీ కలపనుందా? సీఎం రేవంత్ రెడ్డి, ఎంఐఎం అధినేత పరస్పర ప్రశంసల వెనక ఆంతర్యం ఏంటి? తెలంగాణలో మరో పొత్తు తెరపైకి రానుందా? ఇప్పుడిదే రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తున్న హాట్ టాపిక్.

సార్వత్రిక ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో నెగ్గేందుకు బద్ద శత్రువుతో కూడా మైత్రి కోసం పాకులాడుతున్నాయి రాజకీయ పార్టీలు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తుపై కసరత్తు చేస్తున్నాయి. ఇటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా తక్కువ పర్సెంట్ ఓట్ల డిఫరెన్స్ తో ఆధిక్యం కోల్పోయిన బీఆర్ఎస్ నష్టంపై పోస్టుమార్టం చేస్తోంది. దళిత ఓట్లు కురిపించలేదని భావించిన అధిష్టానం.. ఈసారి బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే కలిసొస్తుందని ఆ పార్టీతో చేతులు కలిపింది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టాలంటే ఎంఐఎంతో స్నేహహస్తం అవసరమని హస్తం పార్టీ యోచిస్తున్నట్టు అనిపిస్తోంది. అటు కాంగ్రెస్ తో పొత్తు ఓవైసీకి కూడా లాభదాయకమే. అందుకే ఈ రెండు పార్టీలు పొత్తు కోసం వ్యూహాలు రచిస్తున్నట్టు వారి వైఖరి చూస్తుంటే స్పష్టం అవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు.

రేవంత్, అసదుద్దీన్ పరస్పర ప్రశంసలు..

శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓల్డ్ సిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇబ్రహింబాగ్‌లో నిర్మించిన తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాల, పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా 5.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ పరస్పరం ప్రశంసలు కురిపించుకున్నారు.

"ఇది పాత బస్తీ కాదు. ఇదే అసలు సిసలైన హైదరాబాద్‌. ఈ హైదరాబాద్‌ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. హైదరాబాద్‌ అభివృద్ధి మా బాధ్యత. ఈ ప్రాంతంలో అవసరమైన అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాం. అందుకు స్పష్టమైన హామీ ఇస్తున్నాం.” అని రేవంత్ అన్నారు. "అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎంని ఓడించాలని నేను కూడా ప్రయత్నించా. కానీ అది జరగలేదు. అయితే ఎన్నికలు వేరు, అభివృద్ధి వేరు అని, హైదరాబాద్ అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ విషయంలో మజ్లిస్ సపోర్ట్ తీసుకుంటాం. మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం. దీనికోసమే అక్బరుద్దీన్‌తో కలిసి లండన్ థెమ్స్ నగరాన్ని సందర్శించాం. అసదుద్దీన్ బారిష్టర్ చదివారు, దేశవ్యాప్తంగా కీర్తి గడించారు. వారు కేవలం మైనారిటీల అభివృద్ధి కోసమే కాదు, దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, హైదరాబాద్ అభివృద్ధిలో తప్పకుండా వారి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం" అని రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇక మజ్లిస్ అధినేత అసదుద్దీన్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఐదేళ్లు ప్రశాంతంగా పరిపాలన చేసుకోవచ్చని.. అందుకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రేవంత్ చాలా పట్టుదల కలిగిన వ్యక్తిని అదే తనని ఈ స్థాయిలో నిలబెట్టిందని కొనియాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారని, కానీ కొన్ని శక్తులు వారిని విడగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నాయని, అలాంటి శక్తులను అడ్డుకోవాల్సి ఉందని పిలుపునిచ్చారు. సీఎం ని కలవగానే పాతబస్తీ అభివృద్ధికి రూ. 120 కోట్ల నిధులు మంజూరు చేశారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. ఇక కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన మూసి అభివృద్ధికి తమ సహకారం ఉంటుందని ప్రకటించారు.

పొత్తుకి సంకేతాలు..!

కేసీఆర్ వంటి ఉద్దండులు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందంటూ వ్యాఖ్యలు చేస్తున్న వేళ.. రేవంత్, ఓవైసీల వైఖరి వాటికి చెక్ పెట్టినట్టు అయింది. రాష్ట్ర విభజన అనంతరం మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ కి బై చెప్పి బీఆర్ఎస్ తో చేతులు కలిపింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ హంగ్ వస్తే బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని అంతా భావించారు. కానీ, కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ని దాటేసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే కేసీఆర్ తో ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పు పొంచివుందనేది విశ్లేషకుల అభిప్రాయం. దీనికి తోడు గులాబీ అగ్రనేత సహా పలువురు నేతలు కాంగ్రెస్ సర్కార్ త్వరలోనే కూలిపోతుందని విమర్శలు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ లో కొంతమంది ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకుని ఎంఐఎం లేదా బీజేపీ సహకారంతో కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్లాన్ వేస్తున్నారేమో అనే అనుమానాలు సైతం ఉన్నాయి. ఈ క్రమంలో మీ సహకారం మాకు కావాలని రేవంత్, మజ్లిస్ పార్టీ మీకు సహకరిస్తుంది అంటూ అసదుద్దీన్ వ్యాఖ్యానించడం లోక్ సభ ఎన్నికల ముందు కొత్త పొత్తుకి తెర లేవనుందేమో అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read More
Next Story