ఎంఎల్ఏ హత్య కోసం రెక్కీ
x
BJP MLA Raja Singh

ఎంఎల్ఏ హత్య కోసం రెక్కీ

బీజేపీ గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ ను హత్యచేసేందుకు జరిగిన రెక్కీని పోలీసులు నిర్ధారించారు.


తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ ఎంఎల్ఏ హత్యకు రెక్కీ జరిగింది. బీజేపీ గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ ను హత్యచేసేందుకు జరిగిన రెక్కీని పోలీసులు నిర్ధారించారు. తరచూ వివాదాల్లో ఉండే రాజాసింగ్ చాలామందికి ముఖ్యంగా ఏఐఎంఐఎం పార్టీలోని కొందరికి కంట్లో నలుసుగా మారారు. అందుకనే రాజాసింగ్ పై దాడికి ఇప్పటికి చాలాసార్లు ప్రయత్నాలు జరిగాయి. ఇందులో భాగంగానే ఆదివారం ఉదయం ఎంఎల్ఏ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను స్ధానికులు గమనించారు. ఇదే విషయాన్ని వెంటనే మంగళహట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు స్పందించి ఎంఎల్ఏ ఇంటికి చేరుకున్నారు. అయితే పోలీసులు వస్తున్న విషయాన్ని గమనించిన సదరు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు చాకచక్యంగా వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయమై రాజాసింగ్ మాట్లాడుతు తనపై రెక్కీ జరిగిన విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ఇలాంటి రెక్కీలకు తాను భయపడే వ్యక్తిని కాదని స్పష్టంచేశారు. తనను హత్యచేయటానికి కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తనకు అనుమానంగా ఉందన్నారు. తనింటి చుట్టూ తిరుగుతు, తన కదలికలను గమనిస్తు కొందరు రెక్కీ చేసి విషయాలన్నింటినీ ముంబాయ్ లోని కొందరికి చేరవేస్తున్నట్లు తనకు సమాచారం ఉందని ఎంఎల్ఏ చెప్పారు.

మరోవైపు రెక్కీ నిర్వహించిన వ్యక్తులను పోలీసులు ఇస్మాయిల్, మహ్మద్ ఖాజాగా గుర్తించారు. వాళ్ళదగ్గరున్న సెల్ ఫోన్లు తీసుకుని ఓపెన్ చేస్తే రాజాసింగ్ ఫొటోలు, తుపాకులు, బుల్లెట్ల వివరాలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాజాసింగ్ హత్యకు రెక్కీ జరిగిందన్న విషయం తెలియగానే ఓల్డ్ సిటీలోని గోషామహల్ నియోజకవర్గంతో పాటు పార్టీలో ఒక్కసారిగా సంచలనం మొదలైంది. రాజాసింగ్ అంటేనే పార్టీలో ఫైర్ బ్రాండ్ గా చాలా పాపులర్. గోషామహల్ నియోజకవర్గం నుండి రాజాసింగ్ మూడుసార్లు వరుసగా గెలుస్తున్నారు. ఇదివరకు కూడా రాజాసింగ్ ను చంపేందుకు ప్రయత్నాలు జరిగాయి.

పాకిస్ధాన్, నేపాల్ లోని కొందరు వ్యక్తుల ఆదేశాల ప్రకారమే తాను రాజాసింగ్ హత్యకు ప్రయత్నించినట్లు అప్పట్లో పట్టుబడిన గుజరాత్ యువకుడు చెప్పిన విషయం తెలిసిందే. ఎంఎల్ఏ హత్యకు కోటిరూపాయల సుపారీ కుదిరినట్లు కూడా చెప్పాడు. ఈ నేపధ్యంలోనే తాజాగా ఇద్దరు యువకులు రాజాసింగ్ హత్యకు రెక్కీ జరిగిందనే విషయం సంచలనంగా మారింది. రాజాసింగ్ పై ఇప్పటికి 105 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

Read More
Next Story