![Alcohol Drinkers | మందుబాబుల్లో తెలంగాణ రికార్డ్, ఎక్కువగా తాగేస్తున్నారు... Alcohol Drinkers | మందుబాబుల్లో తెలంగాణ రికార్డ్, ఎక్కువగా తాగేస్తున్నారు...](https://telangana.thefederal.com/h-upload/2025/02/15/512998-alcohal.webp)
మద్యం గ్లాసులతో ఛీర్స్ చెబుతున్న మందుబాబులు (ఫైల్ ఫొటో)
Alcohol Drinkers | మందుబాబుల్లో తెలంగాణ రికార్డ్, ఎక్కువగా తాగేస్తున్నారు...
దక్షిణాది రాష్ట్రాల్లోనే తెలంగాణ రాష్ట్రం మందుబాబుల సంఖ్యలో అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణలో 53.8 శాతం మంది మద్యం తాగుతున్నారని జాతీయ కుటుంబ సర్వేలో తేలింది.
దక్షిణాది రాష్ట్రాల్లోనే (southern states) తెలంగాణ మందుబాబుల (alcohol consumption) సంఖ్యలో మొదటి స్థానంలో ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో (national survey)తేలిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయమంత్రి అనుప్రియా పటేల్ రాజ్యసభలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురుషుల్లో 34.9 శాతం మంది, తెలంగాణలో 53.8 శాతం మంది మద్యం తాగుతున్నారని కేంద్ర సహాయమంత్రి అనుప్రియా తాజాగా తెలిపారు. దేశవ్యాప్తంగా మద్యం తాగే వారి సంఖ్య 29.2 నుంచి 22.4 శాతానికి తగ్గినా, తెలంగాణలో 50 శాతం మంది (Telangana ranks first) మద్యం తాగుతున్నారని జాతీయ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది.
తెలంగాణలో మహిళలు కూడా...
దక్షిణాది రాష్ట్రాల్లోనే తెలంగాణ మహిళలు ఎక్కువగా మద్యం తాగుతున్నారని జాతీయ కుటుంబ సర్వే తేల్చిచెప్పింది. దక్షిణాది రాస్ట్రాల్లో 6.7 శాతం మంది మహిళలు మద్యానికి అలవాటు పడ్డారని సర్వేలో తేలింది. తెలంగాణలో పట్టణ ప్రాంతాల మహిళల కంటే గ్రామీణ ప్రాంతాల మహిళలే ఎక్కువగా మద్యం తాగుతున్నారని సర్వేలో తేలడం సంచలనం రేపింది.
పండుగ అయినా...పబ్బం అయినా ఛీర్స్ చెప్పాల్సిందే...
‘‘మందు బాబులం మేము మందు బాబులం...మందు కొడితే మాకు మేమే మహారాజులం’’ అంటూ గబ్బర్ సింగ్ సినిమాలో కోట శ్రీనివాసరావు పీకల దాకా మద్యం తాగి పాడిన పాట తెలంగాణలోని మందుబాబులకు కిక్ ఇచ్చింది. మద్యం తాగడం తెలంగాణలో సర్వసాధారణమని, పండుగైనా, పబ్బం అయినా మద్యం సీసాలు చేతబట్టుకొని ఛీర్స్ చెప్పాల్సిందే.
డిసెంబరు 31 రాత్రి రూ.402 కోట్ల మద్యం తాగారు...
2024 డిసెంబరు 31వతేదీన ఒక్క రాత్రి తెలంగాణలో తాగుబోతులు రూ.402 కోట్ల మద్యాన్ని తాగేశారని తెలంగాణ ఎక్సైజ్ శాఖ రికార్డులే తేటతెల్లం చేశాయి. దసరా అయినా, సంక్రాంతి అయినా, బోనాల పండుగ అయినా, పెళ్లి, ఇతర శుభకార్యాలు, చావు, కర్మకాండలైనా తెలంగాణలో మద్యం ఏరులై పారుతోంది. దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం విక్రయాల వల్ల వచ్చే ఎక్సైజ్ ఆదాయం ఏ యేటి కాఏడు పెరుగుతూనే ఉంది.
ఏరులై పారిన అక్రమ మద్యం
2024వ సంవత్సరంలో తెలంగాణలో తాగుబోతులు అక్రమ మద్యాన్ని కూడా పూటుగా తాగేశారు. 21,234 లీటర్ల అక్రమ మద్యాన్ని తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారంటే అక్రమ మద్యం విక్రయాలు ఏ విధంగా పెరిగాయో విదితమవుతుంది. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా 10,613 లీటర్లు పారింది. అటవీ గ్రామాల్లో నాటు సారా విక్రయాల జోరు కూడా పెరిగింది.
వేసవి ఆరంభంతో పెరిగిన బీర్ల డిమాండ్
వేసవి కాలం ఆరంభంతో ఎండల వేడిమి నుంచి ఉపశమనం కోసం మందుబాబులు ఛిల్డ్ బీర్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో బీర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇటీవల బీర్ల ధరలు కూడా పెరగడంతో బీర్ల తయారీ కంపెనీలు మూడు షిఫ్టుల్లో కార్మికులతో ఉత్పత్తి చేపిస్తున్నారు.తెలంగాణలో 13 బీర్ల తయారీ కంపెనీలుండగా, ఒక్కో బీరు కంపెనీ రోజులకు 2 లక్షల బీర్లను తయారు చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోనూ పెరిగిన మందుబాబులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పాత బ్రాండ్ల రాకతో గత నాలుగు నెలల్లో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో మందుబాబుల సంఖ్య కూడా పెరిగిందని ఎక్సైజ్ శాఖ రికార్డులు చెబుతున్నాయి. అనంతపురం నగరంలో 135 రోజుల్లో రూ.116 కోట్ల మద్యాన్ని తాగారు. ఏపీలో యువకులు బీర్లు తాగేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. నాలుగు నెలల్లో 12.55 లక్షల బీర్లను తాగారు.
మద్యం తాగుతున్న మహిళల్లో అసోం అగ్రస్థానం
మద్యం తాగుతున్న మహిళల్లో అసోం రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. దేశంలో మద్యం తాగుతున్న మహిళల జాతీయ సగటు 1.2 శాతం కాగా, అసోం రాష్ట్రంలో 16.5 శాతం మంది మహిళలు మద్యం తాగుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. ఈశాన్య రాష్ట్రాల మహిళలు మద్యాన్ని ఎక్కువగా తాగుతున్నారని సర్వే తెలిపింది. 15 నుంచి 49 ఏళ్ల వయసు గల మహిళలు ఎక్కువగా మద్యపాన ప్రియులని తేలింది. అసోం రాష్ట్రం తర్వాత మేఘాలయలో 8.7 శాతం మంది మహిళలు మద్యం తాగుతున్నారని సర్వే వెల్లడించింది. మద్యం తాగే మహిళల సంఖ్యలో అరుణాచల్ ప్రదేశ్ రాస్ట్రం మూడవ స్థానంలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 3.3శాతం మహిళలు మద్యాన్ని సేవిస్తున్నారని జాతీయ ఆరోగ్య సర్వే తెలిపింది. సిక్కింలో 0.3 శాతం,ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో 0.2 శాతం మహిళలు మాత్రమే మద్యం తాగుతున్నారు.
Next Story