![ఏపీలో రెడ్ బుక్..తెలంగాణలో పింక్ బుక్ ఏపీలో రెడ్ బుక్..తెలంగాణలో పింక్ బుక్](https://telangana.thefederal.com/h-upload/2025/02/13/512569-kavithaandpinkbook.webp)
ఏపీలో రెడ్ బుక్..తెలంగాణలో పింక్ బుక్
తెలంగాణలో కల్వకుంట్ల కవిత(Kavitha Pink Book) పింక్ బుక్ అంటు మొదలుపెట్టారు.
తెలుగురాష్ట్రాల్లో బుక్కుల గోల పెరిగిపోతోంది. ఏపీలో టీడీపీ యువనేత నారా లోకేష్ రెడ్ బుక్ అంటు నానా గోలచేస్తున్న విషయం తెలిసిందే. అదేపద్దతిలో తెలంగాణలో కల్వకుంట్ల కవిత(Kavitha Pink Book) పింక్ బుక్ అంటు మొదలుపెట్టారు. అందరి చిట్టాలను రాసుకుంటున్నట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పింక్ బుక్ బయటకు తీసి ఒక్కొక్కళ్ళ లెక్కలు సరిచేస్తామంటు బెదిరించారు. ఏపీలో ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన లోకేష్(Lokesh) రెడ్ బుక్ అంటూ ఊదరగొట్టారు. టీడీపీ(TDP) నేతలపై కక్షసాధింపులకు పాల్పడుతున్న నేతలే కాదు పోలీసు అధికారుల జాతకాలను కూడా రెడ్ బుక్ లో నోట్ చేసుకుంటున్నట్లు చెప్పాడు. అధికారంలోకి రాగానే ఒక్కోళ్ళ కత చెబుతానని చాలాచోట్ల బహిరంగంగానే హెచ్చరించాడు.
అప్పట్లో చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ రెడ్ బుక్ ను బయటకుతీశాడు. రెడ్ బుక్(Red Book) లో ఎవరెవరి పేర్లను అయితే రాసుకున్నాడో వాళ్ళందరిపైనా ఏదో కేసుపెట్టి అరెస్టులు చేయిస్తున్నాడు. తాజాగా గన్నవరం మాజీ ఎంఎల్ఏ వల్లభనేని వంశీ అరెస్టు కూడా రెడ్ బుక్ లో భాగమేనని వైసీపీ నేతలు గోలచేస్తున్నారు. రెడ్ బుక్ లో ఇంకా చాలామంది పేర్లున్నాయని అందరి కతలు మెల్లిగా చెబుతానని లోకేష్ స్వయంగా వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. రెడ్ బుక్ లెక్కల ప్రకారమే నేతలపైనే కాదు అధికారులు ముఖ్యంగా పోలీసు అధికారులపైన కూడా కేసులు పెడుతున్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన 8 నెలలకే ఇంతమంది నేతలపైన కేసులు పెట్టి, అధికారులను సస్పెండ్ చేస్తే మిగిలిన పదవీకాలంలో ఇంకెంతమందిని అరెస్టు చేయిస్తారో చూడాల్సిందే.
ఏపీలో గొడవ అలాగుంటే తెలంగాణలో తాజాగా కల్వకుంట్ల కవిత పింక్ బుక్ అంటు మొదలుపెట్టారు. ఈ బుక్ సంగతిని గతంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఒకసారి ప్రస్తావించారు. అయితే పింక్ బుక్ లో రాసుకుంటున్నాము, కతలు చెబుతామని కాకుండా తమను ఇబ్బందులు పెడుతున్న నేతలపై ఇంతకింత బదులు తీర్చుకుంటామన్నారు. అయితే ఇపుడు కవిత మాత్రం అందరి లెక్కలు తీర్చేస్తామని వార్నింగ్ ఇవ్వటం సంచలనంగా మారింది. తమను ఇబ్బందిపెడుతున్న నేతల్లో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రశక్తే లేదని బహిరంగంగానే వార్నింగ్ ఇవ్వటం ఇపుడు టాక్ ఆప్ ది స్టేట్ గా మారింది. మరి పింక్ బుక్ లో ఎవరెవరి పేర్లుంటాయో ? ఎంతమంది పేర్లు రాసుకుంటారో చూడాలి.