ఓసీ కోట డోర్నకల్ లో చరిత్ర సృష్టించిన రెడ్యానాయక్
ఓసీ నియోజకవర్గంలో ఎస్టీ నేత పోటీచేయటమే కాదు సుమారు 5 వేల ఓట్ల మెజారిటితో గెలిచిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది.
మన రాజ్యాంగం ప్రకారం ఓసీ నియోజకవర్గాల్లో అగ్రవర్ణాలు, రిజర్వుడు నియోజకవర్గాల్లో రిజర్వుడు కేటగిరి అభ్యర్ధులు పోటీచేస్తారు. రిజర్వుడు కేటగిరి అభ్యర్ధులకు ప్రత్యేకంగా కొన్ని నియోజకవర్గాలను రాజ్యాంగం రిజర్వు చేసింది కాబట్టి కాబట్టి వీళ్ళకు ఓసీ నియోజకవర్గాలు కేటాయింపు జరగదు. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రతి రాష్ట్రంలోను కొన్ని నియోజకవర్గాలు రిజర్వ్ అయ్యాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఒక ఎస్టీ నేత ఓసీ నియోజకవర్గంలో పోటీచేస్తారని ఎవరైనా ఊహించగలరా ? ఓసీ సీట్లలో ఎవరైనా పోటీచేయచ్చు కాని రిజర్వుడు సీట్లలో మాత్రం రిజర్వుడు కేటగిరీల అభ్యర్ధులే పోటీచేయాలి. ఈ సూత్రం ఆధారంగానే ఓసీ నియోజకవర్గంలో ఎస్టీ నేత పోటీచేయటమే కాదు సుమారు 5 వేల ఓట్ల మెజారిటితో గెలిచిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది.
ఇంతకీ విషయం ఏమిటంటే ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లా, డోర్నకల్(Dornakal) నియోజకవర్గంలో 1989 జనరల్ ఎన్నికల్లో ధర్మసోత్ రెడ్యానాయక్(Redya naik) కాంగ్రెస్(Congress) అభ్యర్ధిగా పోటీచేసి గెలవటం అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఓసీ నియోజకవర్గంలో ఎస్టీ నేత పోటీచేయటం ఏమిటి ? గెలవటం ఏమిటని పెద్ద చర్చ జరిగింది. అసలు ఓసీ నియోజకవర్గంలో ఎస్టీ నేతకు టికెట్ ఎలా వచ్చింది ? ఓసీ వర్గాల్లో ఎంఎల్ఏ అభ్యర్ధిగా పోటీచేయటానికి గట్టి నేతలే లేరా ? అనే సందేహమూ వచ్చింది. అయితే ఎస్టీ నేతకు టికెట్ రావటానికి పెద్ద నేపధ్యమే ఉంది. వరంగల్ జిల్లాలో అప్పట్లో రామసహాయం(Ramasahayam) సురేంద్రరెడ్డి అనే పే........ద్ద నేతుండేవారు. డోర్నకల్ ఎంఎల్ఏగా వరంగల్ ఎంపీగా చాలాసార్లు గెలిచారు రెడ్డిగారు. 1989లో రెడ్డిగారు వరంగల్ ఎంపీగా పోటీచేయాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా అప్పటివరకు తాను ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ సీటుకు నూకల నరేష్ రెడ్డికి ఎంఎల్ఏ టికెట్ ఇప్పించాలని అనుకున్నారు.
అనుకున్నట్లే నూకలకు టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు కూడా చేశారు. అప్పట్లో రామసహాయం ఎంతచెబితే జిల్లాలో అంతే. అందుకనే నూకలకు టికెట్ ఖాయమనే అందరు అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో అదే నియోజకవర్గానికి చెందిన రాజవర్ధనరెడ్డి టికెట్ రేసులోకి దూసుకొచ్చారు. నూకలకు రామసహాయం మద్దతు ఉందని తెలిసినా రాజవర్ధన్ రేసులోకి ఎందుకు వచ్చారు ? ఎందుకంటే అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి(Marri ChennaReddy)కి రామసహాయంకు పడదు. అందుకనే రామసహాయం ఆధిపత్యానికి జిల్లాలో గండికొట్టాలని ఏకంగా డోర్నకల్ నేతయిన రాజవర్ధన్ రెడ్డిని మర్రి రంగంలోకి దింపారు. డోర్నకల్ లో మొదలైన టికెట్ పోటి హైదరాబాద్ దాటి చివరకు ఢిల్లీకి చేరుకున్నది. నూకలకు టికెట్ ఇవ్వాలని రామసహాయం, రాజవర్ధన్ కే టికెట్ దక్కాలని మర్రి ఎవరికి వారుగా గట్టి ప్రయత్నాలు చేశారు.
పార్టీ అధిష్టానం నచ్చచెప్పాలని చూసినా ఇద్దరిలో ఎవరూ వెనక్కు తగ్గలేదు. దాంతో మధ్యేమార్గంగా టికెట్ ఇద్దరికీ కాకుండా కొత్తవాళ్ళని ఎవరినైనా పోటీచేయించాలని అధిష్టానం సూచించింది. అందుకు చెన్నారెడ్డి అంగీకరించారు కాని రామసహాయం అంగీకరించలేదు. ఎంఎల్ఏ అభ్యర్ధిగా నూకల తప్ప ఇంకెవరూ పోటీచేసేందుకు లేదని గట్టిగా పట్టుబట్టారు. తమ సూచనకు చెన్నారెడ్డి అంగీకరించినా రామసహాయం ఒప్పుకోకపోవటంతో అధిష్టానంకు బాగా మండిది. వెంటనే నియోజకవర్గంలో కొత్త అభ్యర్ధిని చూసి పోటీలోకి దింపమని చెన్నారెడ్డిని అధిష్టానం ఆదేశించింది. టికెట్ కోసం అధిష్టానంతో మాట్లాడి లాభంలేదని అర్ధమైపోయిన రామసహాయం వెంటనే డోర్నకల్ వచ్చేశారు.
అప్పటికే అధిష్టానం ఆలోచనలను పసిగట్టిన రామసహాయం తన మద్దతుదారులు ఇద్దరిని స్వతంత్ర్య అభ్యర్ధులుగా నామినేషన్లు వేయాలని చెప్పారు. రామసహాయం సూచనతో ఇద్దరు నేతలు నామినేషన్లు వేశారు. నామినేషన్లు దాఖలుచేసిన వారిలో ఒకళ్ళు నూకలయితే రెండో అభ్యర్ధి రెడ్యానాయక్. టికెట్ ఎవరికి వస్తే రెండో వాళ్ళు పోటీనుండి ఉపసంహరించుకోవాలని కూడా రామసహాయం ముందే చెప్పారు. అందుకు ఇద్దరు అంగీకరించారు. రామసహాయం ఆలోచన ఏమిటంటే అధిష్టానం తన మాటను కాదని చెన్నారెడ్డి క్యాండిడేట్ కు టికెట్ ఇవ్వదని. ఎలాగూ తాను సూచించిన అభ్యర్ధి నూకలకే టికెట్ దక్కుతుంది కాబట్టి రెడ్యాను పోటీనుండి తప్పించవచ్చని. రామసహాయం ఆలోచనల ప్రకారమే ఇద్దరూ వెంటనే నామినేషన్లు వేశారు. అయితే రామసహాయం ఒకటి ఆలోచిస్తే అధిష్టానం మరో విధంగా ఆలోచించింది. డోర్నకల్ లో కొత్త అభ్యర్ధిని పోటీలోకి దింపాలని చెన్నారెడ్డిని ఆదేశించింది. దాంతో చెన్నారెడ్డి కొత్త అభ్యర్ధి కోసం వెతికి అప్పటికే ఇండిపెండెంటుగా నామినేషన్ వేసిన రెడ్యానాయక్ ను అభ్యర్ధిగా ఎంపికచేశారు. చెన్నారెడ్డి ఎంపికను రామసహాయం, నూకల ఏమాత్రం ఊహించలేదు. రెడ్యాను అభ్యర్ధిగా దింపితే రామసహాయం మద్దతుదారుల్లో చీలిక వస్తుందని+ఎస్టీలంతా రెడ్యాకే ఓట్లేస్తారన్నది చెన్నారెడ్డి వ్యూహం. రెడ్యాను అభ్యర్ధిగా ఎంపికచేస్తే తన మద్దతుదారుడికే టికెట్ వచ్చింది కాబట్టి రామసహాయం చివరలో అయినా మెత్తపడతారని చెన్నారెడ్డి అనుకున్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో ఎస్టీల ఓట్లు చాలా ఎక్కువుగా ఉన్నాయి. అప్పటికే రెడ్యా సమితి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
చెన్నారెడ్డి దెబ్బను ముందుగా ఊహించని రామసహాయం షాక్ తిన్నా నూకలను ఇండిపెండెంటుగా బరిలోకి దింపారు. నిజానికి అంతకుముందు రామసహాయం చెప్పినట్లే టికెట్ వచ్చిన వాళ్ళు పోటీలో ఉండాలి, రెండోవాళ్ళు పోటీనుండి తప్పుకోవాలి. తాను ప్రతిపాదించిన నూకలకు టికెట్ ఇవ్వకపోగా తన మద్దతుదారుడు అందులోను ఎస్టీ కుర్రాడు రెడ్యాకు పార్టీ టికెట్ దక్కటాన్ని రామసహాయం జీర్ణించుకోలేకపోయారు. పార్టీ అభ్యర్ధిగా రెడ్యాను ప్రకటించినా నామినేషన్ల దాఖలు చివరి తేదీవరకు నూకలకు బీపారమ్ ఇవ్వాలని రామసహాయం ఒత్తిడి పెడుతునే ఉన్నారు. రామసహాయం ప్రయత్నం ఏ స్ధాయంలో జరిగిందంటే నామినేషన్ల దాఖలు గడువు 15 నిముషాల్లో ముగుస్తుందనగా మాత్రమే రెడ్యాకు పార్టీ బీపారమ్ ను అందించగలిగింది. ఎప్పుడైతే రెడ్యా కాంగ్రెస్ అభ్యర్ధిగా బీఫారమ్ ను అందించారో అప్పుడు తన మాటను తానే రామసహాయం తప్పారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా రెడ్యానాయక్, టీడీపీ(TDP) అభ్యర్ధిగా సత్యవతీ రాథోడ్, ఇండిపెండెంట్లుగా నూకల నరేష్ రెడ్డి, రాజవర్ధనరెడ్డి పోటీపడ్డారు. ఎస్టీ ఓట్లలో చీలిక తెచ్చే ఉద్దేశ్యంతో టీడీపీ కూడా ఎస్టీ నేత సత్యవతినే రంగంలోకి దింపింది. ఎంతో ఉత్కంఠ కలిగించిన ఆ పోటీలో సుమారు 5 వేల ఓట్ల మెజారిటితో రెడ్యానాయక్ గెలిచి చరిత్ర సృష్టించారు. జనరల్ సీటులో రిజర్వుడు కేటగిరీ నేత పోటీచేయటం, గెలవటం అన్నది పేద్ద సంచలనమనే చెప్పాలి. టికెట్ కోసం ఇద్దరు పెద్దరెడ్లు పోటీపడితే చివరకు ఒక ఎస్టీ కుర్రాడికి టికెట్ దక్కింది.
1989 ఎన్నికల్లో తాను కోరుకున్న నూకలకు టికెట్ ఇప్పించుకోలేకపోయిన రామసహాయం తర్వాత డోర్నకల్ అసెంబ్లీ సీటుగురించి పెద్దగా పట్టించుకోలేదు. 1994 ఎన్నికల్లో డోర్నకల్ నుండి సిట్టింగ్ ఎంఎల్ఏ హోదాలో రెడ్యా మళ్ళీ పోటీచేస్తే టీడీపీ తరపున ఒంటికొమ్ము రామచంద్రారెడ్డి, ఇండిపెండెంటుగా నూకల నరేష్ రెడ్డి పోటీచేశారు. త్రికోణ పోటీలో రెండోసారి కూడా రెడ్యానే గెలిచారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా రెడ్యా పోటీచేయగా టీడీపీ తరపున నూకల నరేష్ రెడ్డి పోటీచేశారు. ఈ ఎన్నికల్లో రెడ్యా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ ఎంఎల్ఏ అనిపించుకున్నారు. 2004లో టీడీపీ అభ్యర్ధి బానోత్ జయంత్ నాథ్ మీద కాంగ్రెస్ అభ్యర్ధిగా రెడ్యా నాలుగోసారి గెలిచారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో డోర్నకల్ జనరల్ సీటు నుండి ఎస్టీ రిజర్వుడు సీటుగా మారిపోయింది. అయితే రెడ్యా విజయానికి 2009 ఎన్నికలు బ్రేకులు వేసింది. ఈ ఎన్నికలో రెడ్యామీద టీడీపీ అభ్యర్ధిగా పోటీచేసిన సత్యవతీ రాథోడ్ గెలిచారు.
మళ్ళీ 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన సత్యవతి మీద కాంగ్రెస్ అభ్యర్ధిగా రెడ్యానే గెలిచారు. రాష్ట్ర విభజన తరువాత పరిణామాల్లో రెడ్యా టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసి గెలిచారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) తరపున పోటీచేసిన రెడ్యా కాంగ్రెస్ అభ్యర్ధి జతోత్ రామచంద్రు నాయక్ చేతిలో ఓడిపోయారు. నాలుగుసార్లు వరుసగా, తర్వాత గ్యాప్ తో రెండుసార్లు మొత్తం 6 సార్లు గెలిచారు. జనరల్ నియోజకవర్గం నుండి పోటీచేసిన రిజర్వుడు కేటగిరి నేతగా రెడ్యానాయక్ పెద్ద చరిత్రే సృష్టించారు.
ఇదే విషయాన్ని రెడ్యానాయక్ తెలంగాణా ఫెడరల్ తో మాట్లాడుతు అప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారు. 1989లో డోర్నకల్ కోసం ఇద్దరు రెడ్డి నేతల మధ్య పెద్ద పోటీనే జరిగిందని చెప్పారు. టికెట్ విషయంలో అటు చెన్నారెడ్డి, ఇటు రామసహాయం ఎవరూ తమ పట్టువీడకపోవటంతోనే అధిష్టానం మధ్యేమార్గంగా కొత్తవారికి టికెట్ ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. ఆ విధంగా తనకు టికెట్ దక్కిందన్నారు. రామసహాయంకు మద్దతుదారుడిగాను, అప్పటికే ఇండిపెండెంటుగా నామినేషన్ వేసి ఉన్నాను కాబట్టే చెన్నారెడ్డి వ్యూహాత్మకంగా తనకే టికెట్ ఇప్పించినట్లు చెప్పారు. అంతేకాని చాలామంది అనుకుంటున్నట్లు రామసహాయం నామినేషన్ తిరస్కరణకు గురైతే డమ్మీ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన తాను పార్టీ అభ్యర్ధిగా పోటీచేయలేదన్నారు. అధిష్టానం తననే పార్టీ అభ్యర్ధిగా ఎంపికచేసి బీపారమ్ ఇచ్చినట్లు రెడ్యా చెప్పారు. జనరల్ సీటులో పోటీచేసిన రిజర్వుడు అభ్యర్ధిగా తాను చరిత్ర సృష్టించినట్లు రెడ్యానాయక్ చెప్పారు.