ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయ పనులు ముమ్మరం, నేడు మంత్రి సమీక్ష
x

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయ పనులు ముమ్మరం, నేడు మంత్రి సమీక్ష

ఎస్ఎల్‌బీసీలో మృతదేహాలున్న ప్రాంతాలను క్యాడవర్ డాగ్స్ గుర్తించిన నేపథ్యంలో సహాయ పనులు ముమ్మరం చేశారు.సహాయ కార్యక్రమాలను సమీక్షించేందుకు మంత్రి రానున్నారు.


ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లోపల సహాయ పనులు ముమ్మరమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం దోమలపెంట గ్రామంలోని టన్నెల్ వద్దకు రానున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం ఉదయం 8.45 గంటలకు హెలికాప్టరులో బయలుదేరి 9.30 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట ఎస్ఎల్ బీసీ స్థలానికి చేరుకుంటారు. శనివారం ఉదయం 945 గంటల నుంచి 11.30 గంటల వరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఎల్ బీసీ షహాయ పనులను సమీక్షించనున్నారు. శనివారం ఉదయం 11.45 గంటలకు మంత్రి దోమలపెంట నుంచి నల్గొండకు వెళ్లి అక్కడ కలెక్టరేట్ లో జరగనున్న సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.




టన్నెల్ లోపలకు ఎన్‌డీ‌ఆర్ఎఫ్ వైద్యబృందం
కేరళ నుంచి వచ్చిన క్యాడవర్ జాగిలాలు మట్టి, బురద లోపల కార్మికులు చిక్కుకున్న రెండు ప్రదేశాలను గుర్తించడంతో ఆయా పాయింట్ల వద్ద ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి, మిలటరీ, బీఆర్ఎఫ్, ఫైర్, తదితర పలు విభాగాలకు చెందిన నిపుణులు సహాయ పనులు చేపట్టారు. బురద కింద కూరుకుపోయిన కార్మికుల మృతదేహాలను వెలికితీయగానే స్టాండర్డు ప్రోసిజర్ నిర్ధారించడానికి ఎన్డీఆర్ఎఫ్ వైద్యబృందాన్ని టన్నెల్ లోపలకు పంపించారు.



పూడిక తొలగిస్తున్న సింగరేణి బృందం

మృతదేహాలున్నట్లు క్యాడవర్ జాగిలాలు గుర్తించిన ప్రాంతాల్లో సింగరేణి బృందం, ర్యాట్ హోల్ మైనింగ్ కార్మికులను మోహరించి పూడికను వేగంగా తొలగిస్తున్నారు. సింగరేణికి చెందిన జనరల్ మేనేజర్ శ్రీ బైద్య సహాయ పనుల్లో దిగిన తర్వాత సహాయ పనులు ముమ్మరం అయ్యాయి. మరో వైపు ముక్కలైన టన్నెల్ బోరింగ్ మెషీన్ ను పూర్తి స్థాయిలో తొలగిస్తున్నామని తెలంగాణ డిజాస్టర్ మేనేజ్ మెంట్ కమిషనర్ అర్వింద్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. టీబీఎం లోహపు ముక్కలను లోకోమోటివ్ లో బయటకు తరలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

టన్నెల్ లో రంగంలో దిగనున్న రోబోలు
టన్నెల్ లోపల సహాయ పనులు చేపట్టేందుకు రోబోలను రంగంలోకి దించాలని నిర్ణయించామని తెలంగాణ డిజాస్టర్ మేనేజ్ మెంట్ కమిషనర్ అర్వింద్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.టన్నెల్ లోపల బండరాళ్ల ఉనికిని నావిగేట్ చేయడానికి వీలుగా నిర్ధిష్ట రకం రోబోలను సహాయ పనుల్లో దించుతామని ఆయన పేర్కొన్నారు. మరో వైపు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ, ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ నిపుణులు సొరంగం ఉన్న ప్రదేశంలో భూమిపై పనిచేస్తున్నాయని అర్వింద్ కుమార్ వివరించారు.


Read More
Next Story