
వరద ప్రభావిత ప్రాంతాల ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం
సహాయక చర్యలు ఆపొద్దంటూ అధికారులకు కీలక ఆదేశాలిచ్చిన మంత్రి సీతక్క.
మూడు రోజులుగా తెలంగాణను కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. చెరువులు కట్టలు తెచ్చుకుంటున్నాయి. పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో వరద ఉధృతికి ప్రజలు కొట్టుకుపోయిన, చిక్కుకుపోయిన ఘటనలు కూడా సంభవించాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం రంగంలోకి దిగి.. ఆగమేఘాలపై సహాయక చర్యలు చేపడుతోంది. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించడానికి వీల్లేకుండా ఎక్కడిక్కడ సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు. ముంపు ప్రమాద ప్రాంతంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
ఏరియల్ సర్వేకు బయలుదేరిన సీఎం
రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్షించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క సమావేశమయ్యారు. వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయటంతో పాటు తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అనతరం ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు బయలుదేరారు. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. కామారెడ్డిలో వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అదే విధంగా మంత్రి సీతక్క కూడా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పర్యటించాలని, ప్రజల అవసరాలను తెలుసుకుని వాటిని తీర్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పునరావాస కేంద్రాలకు తరలించండి..: సీతక్క
కామారెడ్డి జిల్లాలో వరద ఉధృత రూపం దాల్చింది. అంచనాలకు కూడా అందని స్థాయిలో వర్షం కురిసింది. దీంతో వరద ప్రమాదం పొంచి ఉంది. దీంతో అక్కడి పరిస్థితులపై మంత్రి సీతక్క.. అధికారులతో టెలికాన్షరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో అధికారులు పర్యటించి.. ఇళ్లను పరిశీలించాలని చెప్పారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. విద్యుత్, వ్యవసాయ, తాగునీటి సరఫరా, పంచాయతీరాజ్ శాఖలు తక్షణమే నష్టాన్ని అంచనా వేసి నివేదికలు అందించాలని సూచించారు. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ, అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. వర్షం పూర్తిగా ఆగే వరకు సహాయక చర్యలు నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు.
పారిశుద్ధ్యాన్ని వేగవంతం చేయాలి
‘‘అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలి. తద్వారా వ్యాధుల వ్యప్తిని అరికట్టగలం. వాగులు, చెరువులు దగ్గరకు ప్రజలు వెళ్లకుండా చర్యలు తీసుకోండి. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయండి. ప్రజలను అప్రమత్తం చేయండి. ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా చూసుకోండి. అతి త్వరలోనే జిల్లాలో పర్యటించి పరిస్థితులపై సమీక్షిస్తా’’ అని చెప్పారు.