మార్గదర్శికి రిజర్వ్ బ్యాంకు ఊహించని షాక్
x
Margadarsi

మార్గదర్శికి రిజర్వ్ బ్యాంకు ఊహించని షాక్

మార్గదర్శికి రిజర్వ్ బ్యాంకు చట్టంలోని సెక్షన్-45 వర్తిస్తుందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.


మార్గదర్శి చిట్ ఫండ్స్ కు రిజర్వ్ బ్యాంకు ఊహించని షాక్ ఇచ్చింది. మార్గదర్శికి రిజర్వ్ బ్యాంకు చట్టంలోని సెక్షన్-45 వర్తిస్తుందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. హిందు అన్ డివైడెడ్ ఫ్యామిలి (హెచ్ యూ ఎఫ్) కింద చిట్ ఫండ్ సంస్ధ నిర్వహిస్తున్న మార్గదర్శి చిట్ ఫండ్స్ ఖాతాదారుల నుండి డిపాజిట్లు సేకరించటమే నేరమని ఆర్బీఐ తన అఫిడవిట్లో తేల్చి చెప్పింది. ఇంతకీ విషయం ఏమిటంటే చాలా సంవత్సరాలుగా మార్గదర్శి వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. హెచ్ యూ ఎఫ్ పద్దతిలో ఖాతాదారుల నుండి డిపాజిట్లు సేకరిస్తున్నది. ఈ పద్దతిలో ఖాతాదారుల నుండి డిపాజిట్లు సేకరించటం తప్పని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టులో కేసు వేశారు. మార్గదర్శికి ఛైర్మన్ గా వ్యవహరించిన రామోజీరావే బాధ్యుడంటూ ఉండవల్లి చాలా వేదికలపై చెప్పిన విషయం తెలిసిందే.

అయితే ఆర్బీఐ చట్టాలు తమకు వర్తించవని ఒకసారి, రాష్ట్ర చిట్ ఫండ్ చట్టం ప్రకారం తాము వ్యాపారం చేయటం లేదని మరోసారి, తమ వ్యాపారాలు కేంద్రప్రభుత్వ చట్టాల పరిధిలోకి రావని ఇంకోసారి ఇలా రకరకాలుగా రామోజీ వాదించారు. అయితే చివరకు మార్గదర్శి చిట్ ఫండ్స్ రూపంలో ఖాతాదారుల నుండి డిపాజిట్లు సేకరించటం తప్పని హైకోర్టు చాలా కాలం క్రితమే తేల్చి చెప్పింది. దాంతో పదేళ్ళ క్రితమే వసూలు చేసిన డిపాజిట్లు సుమారు రు. 2500 కోట్లు ఖాతాదారులకు రామోజీ తిరిగి చెల్లించేశారు. అప్పట్లోనే ఇకనుండి ఖాతాదారుల నుండి డిపాజిట్లు సేకరించనని కోర్టుకు లిఖితపూర్వకంగా చెప్పారు. అయితే కోర్టుకు ఒకటి చెప్పి వాస్తవంగా మళ్ళీ డిపాజిట్లు సేకరిస్తున్నట్లు ఉండవల్లి ఆరోపించారు.

దాంతో మార్గదర్శిపై మరో కేసు నమోదైంది. ఇలా చాలా సంవత్సరాలుగా మార్గదర్శిపై కేసులు నడుస్తునే ఉన్నాయి. క్లౌమ్యాక్సుకు చేరుకున్న ఈ కేసులో తమకు ఆర్బీఐ చట్టాలు వర్తించవని రామోజీ వాదించారు. దాంతో కోర్టు ఆర్బీఐకి నోటీసులు జారీచేసింది. చిట్ ఫండ్స్ వ్యాపారానికి సంబంధించిన నియమ, నిబంధనలు ఏమిటో చెప్పాలని ఆదేశించింది. దానిపై ఆర్బీఐ కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. అందులో మార్గదర్శి చిట్ ఫండ్స్ కు డిపాజిట్లు సేకరించే అధికారం లేదని తేల్చిచెప్పింది. డిపాజిట్ల సేకరణలో మార్గదర్శి చట్ట ఉల్లంఘనలకు పాల్పడిందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. మార్గదర్శి వేసిన క్వాష్ పిటీషన్ను కొట్టేయాలని ఆర్బీఐ హైకోర్టును కోరింది.

మార్గదర్శి డిపాజిట్ల సేకరించిన కేసును కోర్టు విచారించాల్సిందే అని ఆర్బీఐ కోర్టుకు విజ్ఞప్తిచేసింది. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్-45 మార్గదర్శి చిట్ ఫండ్స్ కు కూడా వర్తిస్తుందని ఆర్బీఐ చెప్పింది. పై సెక్షన్ ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి యాజమాన్యం ఖాతాదారుల నుండి డిపాజిట్లు సేకరించిందని స్పష్టంగా చెప్పింది. తాజాగా ఆర్బీఐ అఫిడవిట్ నేపధ్యంలో కోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read More
Next Story