ఎమ్మెల్యే ఆన్ వీల్స్, డయల్ యువర్ ఎమ్మెల్యేతో ప్రజాసమస్యల పరిష్కారం
x
మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ‘ఎమ్మెల్యే ఆన్ వీల్స్’

ఎమ్మెల్యే ఆన్ వీల్స్, డయల్ యువర్ ఎమ్మెల్యేతో ప్రజాసమస్యల పరిష్కారం

డాక్టరుగా, ఐపీఎస్ అధికారిగా పనిచేసి ఎమ్మెల్యేలయ్యారు.తమకున్న అనుభవంతో సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ఆన్ వీల్స్, డయల్ యువర్ ఎమ్మెల్యే తో ముందడుగు వేశారు.


వృత్తిరీత్యా డాక్టరైన కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యేగా, ఐపీఎస్ విశ్రాంత అధికారి అయిన కేఆర్ నాగరాజు వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అపార అనుభవం ఉన్న వీరిద్దరూ వినూత్న కార్యక్రమాలతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే ఆన్ వీల్స్ (MLA on Wheels), వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాలతో (Dial Your MLA Program) ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల ప్రశంసలందుకుంటున్నారు.


ఎమ్మెల్యే ఆన్ వీల్స్

మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి (wardhannapeta MLA) ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (Dr Kavvampally Satyanarayana) ముందడుగు వేశారు. శుక్రవారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో‘ఎమ్మెల్యే ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులతో సహా వారంలో మూడు రోజులు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే సత్యనారాయణ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.‘‘మానకొండూర్ ప్రజలు సమస్య ఏదైనా కావచ్చు, నన్ను నేరుగా కలవవచ్చు, మీ సమస్యలను పరిష్కరించడంలోనే నాకు నిజమైన ఆనందం ఉంది, ఇపుడు ఎమ్మెల్య ఆన్ వీల్స్ యాప్ ద్వారా సులభంగా మీ సమస్యలను నాకు చెప్పండి నేను వాటిని పరిష్కరిస్తాను’’ అంటూ ఎమ్మెల్యే ప్రజలకు చెప్పారు. ‘‘అధైర్యపడకండి, ఇదీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం, పేద ప్రజలందరికీ తప్పకుండా సహాయం అందుతుంది’’అని మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.

ఎన్ఐటీ విద్యార్థికి ఎమ్మెల్యే ఆర్థికసాయం

మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి గొర్రె అంజన్ ఎన్ఐటీ కాలికట్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షలకు ఫీజు కట్టే ఆర్ధిక స్థోమత లేకపోవడంతో మానకొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణను సంప్రదించారు. అంతే ఎమ్మెల్యే వెంటనే 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి చదువు పూర్తి అయ్యే వరకు అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా ఇచ్చి బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.భూమి పాస్ బుక్ ఇప్పించాలని కవ్వంపల్లి సార్ దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే తనకు భూమి పాస్ బుక్ ఇప్పించి సహాయం చేశారని రేగులపల్లి గ్రామానికి చెందిన తోటపల్లి శారద చెప్పారు.

డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం
ఇండియన్ పోలీసు సర్వీస్ అధికారిగా కేఆర్ నాగరాజు (kr nagaraju) మూడు దశాబ్దాల పాటు పనిచేసి, పదవీ విరమణ చేశాక ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. రాజకీయాల్లో చేరి వర్ధన్నపేట ఎమ్మెల్యేగా (wardhannapeta MLA) ఘన విజయం సాధించిన నాగరాజు పోలీసు కమిషనరుగా తనకున్న పరిపాలనా అనుభవంతో ప్రజా సమస్యల పరిష్కారానికి వినూత్నకార్యక్రమాలు చేపట్టారు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కరించేందుకు వీలుగా ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయం కేంద్రంగా డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించారు.‘‘నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజల కోసం నిత్యం మీకు అందుబాటులో ఉండాలనే గొప్ప ఆలోచనతో డయల్ యువర్ ఎమ్మెల్యే 8096107107 కార్యక్రమాన్ని ప్రారంభించాను, మీరు ఏ సమస్య ఉన్నా కూడా నా ఫోన్ నంబరుకు కాల్ చేస్తే మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా’’అని కేఆర్ నాగరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ఎన్నెన్నో సమస్యలను పరిష్కరించా...
డయల్ యువర్ ప్రొగ్రాం కార్యక్రమంలో భాగంగా తనకు రోజుకు పది నుంచి 20 ఫోన్ కాల్స్ వస్తుంటాయని, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ‘‘నేను ఐపీఎస్ పోలీసు అధికారిగా మూడు దశాబ్దాలకు పైగా పనిచేశాను,బాధ్యత గల అధికారిగా నాకు సమాజం ఎంతో ఇచ్చింది, నేను సొసైటీకి తిరిగి నా వంతు సేవలు అందించాలనే ఉన్నతాశయంతోనే రాజకీయాల్లోకి వచ్చాను,నా శాయశక్తుల పేద ప్రజలకు సేవలందిస్తాను, ప్రజలతో ఉన్న ఈ అనుబంధం.. కలకాలం నిలిచిపోయే సంబంధం,ఇందులోనే నాకు ఆత్మసంతృప్తి ఉంది’’అని నాగరాజు చెప్పారు.



సమస్యల పరిష్కారానికి చర్యలు

డయల్ యువర్ ఎమ్మెల్యే ప్రోగ్రాంలో భాగంగా వర్ధన్నపేట మండల పరిధిలోని బండవుతాపురం గ్రామానికి చెందిన రైతులు వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులో నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని రైతులు డయల్ యువర్ ఎమ్మెల్యే కి ఫోన్ చేసి తెలియజేయడంతో వెనువెంటనే ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చర్యలు తీసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫోన్ తో నల్లబెల్లి చెరువు వద్ద బైపాస్ రోడ్డు నిర్మించారు.డ్రైనేజీ, రోడ్ల, పాఠశాల సమస్యలు, వీధిలైట్లు వెలగడం లేదని, ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయిందని, బ్యాటరీ వెహికిల్ కావాలని దివ్యాంగులు, భూమి సమస్యపై రైతులు డయల్ యువర్ ఎమ్మెల్యే ప్రోగ్రాంలో ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారని ఎమ్మెల్యే పర్సనల్ అసిస్టెంట్ రాజేష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అవి పరిష్కారమయ్యేలా చూస్తుంటామని ఆయన పేర్కొన్నారు. దీర్ఘకాలిక సమస్యలను ఎమ్మెల్యే తన డైరీలో రాసుకొని వాటికి నిధులను మంజూరు చేయిస్తుంటారని డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం ఇన్ చార్జి తవుటు చందన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ
ఎమ్మెల్యే జన్మదినం కావచ్చు, కొత్త సంవత్సరం కావచ్చు, పండుగలు, పబ్బాలు కావచ్చు తనను కలిసేందుకు వచ్చే అతిధులు బొకేలు, శాలువాలు తీసుకురావద్దని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కోరారు. వీటి స్థానంలో పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, కంపాక్స్ బాక్స్, ప్యాడ్స్ తీసుకురావాలని ఎమ్మెల్యే విజిటర్స్ కు సూచించారు. సందర్శకులు తీసుకువచ్చిన పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, కంపాక్స్ బాక్స్, ప్యాడ్స్ ను పాఠశాలల్లో పేద విద్యార్థులకు అందిస్తున్నారు.

కేఆర్ ఫౌండేషన్ నిధులతో సహాయ కార్యక్రమాలు

తన సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు కేఆర్ ఫౌండేషన్ ను ప్రారంభించానని ఎమ్మెల్యే నాగరాజు చెప్పారు. తన ఫౌండేషన్ నిధులతో సాగునీటి కాల్వలను మరమ్మతు చేయించి రైతుల పొలాలకు సాగునీరు వచ్చేలా చేశానని ఎమ్మెల్యే చెప్పారు. హాకి క్రీడాకారుడైన ఎమ్మెల్యే నాగరాజు క్రీడాకారులను ప్రోత్సహిస్తుంటారు. క్రీడాకారులకు క్రీడాపరికాలు ఇవ్వటం, బాగా చదువుకుంటున్న పేద విద్యార్థులకు తానున్నానంటూ ముందుకు వచ్చి ఫీజులు చెల్లిస్తున్నారు. తన తండ్రి మరణించడంతో తన లా చదువుకు అయ్యే ఖర్చును ఎమ్మెల్యే నాగరాజు సార్ ఇస్తున్నారని వరంగల్ నగరానికి చెందిన విద్యార్థిని కె హారిక ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ప్రజలకు తన సొంత నిధులతో పాటు సీఎంఆర్ఎఫ్ పథకం కింద రోగులను ఆదుకుంటున్నానని ఎమ్మెల్యే వివరించారు. ‘‘దాతృత్వం,త్యాగం తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశమని, దాన్ని అనుసరిస్తూ పేదల సంక్షేమానికి నా వంతు కార్యక్రమాలు చేస్తున్నాను’ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చెప్పారు.


Read More
Next Story