మాజీ డీజీపీ టి.ఎస్.పి.ఎస్.సి. చైర్మన్!  గవర్నర్ ఆమోదమే తరువాయి..
x
Mahender Reddy

మాజీ డీజీపీ టి.ఎస్.పి.ఎస్.సి. చైర్మన్! గవర్నర్ ఆమోదమే తరువాయి..

351 అప్లికేషన్లు.. అందులోనూ ఒక్క టి.ఎస్.పి.ఎస్.సి. చైర్మన్ పదవికే 51 మంది ఐపీఎస్ లు, ఐఎఎస్ లు పోటీ పడ్డారు. దశల వారీ వడపోత అనంతరం ఒకే ఒక వ్యక్తి మిగిలారు...


TSPSCపై నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. TSPSCని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి... కొత్త టీమ్‌ను దాదాపు ఖరారు చేసింది. TSPSC చైర్మన్‌ పదవి కోసం వచ్చిన 50కి పైగా దరఖాస్తుల్ని రాష్ట్రప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ వడపోసింది. మూడు పేర్లను ప్రభుత్వానికి పంపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమార్, న్యాయ శాఖ కార్యదర్శి తిరుమల, జీఏడీ కార్యదర్శి నిర్మలా దేవితో కూడిన సెర్చ్ కమిటీ ఈ మూడు పేర్లను ఖరారు చేసింది. వీరిలో ఒకర్ని ఎంపిక చేయనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ప్రక్షాళన ఎందుకు చేయాలంటే...

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఒక కారణం నిరుద్యోగులు. టీఎస్పీఎస్సీ బోర్డు నిరుద్యోగులను నట్టేట ముంచిందన్న ప్రచారం చేయడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తానని హామీ ఇచ్చింది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఆ దిశగా వేగం పెంచింది. TSPSC పాలకమండలి రాజీనామాలకు గవర్నర్‌ ఆమోదం తెలపడంతో ఇప్పుడు కొత్త బోర్డు ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. ఇక నుంచి TSPSCపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు, వారి తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించే విధంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా చైర్మన్‌ అండ్ బోర్డు సభ్యుల ఎంపికపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.

50మందికి పైగా దరఖాస్తు...

TSPSC ప్రక్షాళన రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకం. గత ప్రభుత్వ హయాంలో TSPSC నిర్వహించిన పరీక్షల లీకేజీలు.. ఎన్నికలు సమీపివేస్తున్న వేళ హడావుడిగా నోటిఫికేషన్లు వేసి కోర్టు మెట్లు ఎక్కడం లాంటివాటితో బోర్డు అప్రతిష్టపాలైంది. దీంతో ఎన్నికల ప్రచారంలో బోర్డు ప్రక్షాళనలపై రేవంత్‌రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు కొత్త టీమ్ ఎంపికతోనే ప్రజలకు భరోసా ఇవ్వాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే TSPSC ఛైర్మన్, సభ్యుల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. దీంతో ప్రభుత్వానికి భారీగా దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణలోని JNTU, HCU, OU, కాకతీయ యూనివర్సిటీలతో పాటు.. ప్రైవేట్ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్స్ స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 371 దరఖాస్తులు రాగా వాటిలో అచ్చంగా ఒక్క ఛైర్మన్ పదవి కోసం 50 దరఖాస్తులు వచ్చాయి. ప్రాధమిక పరిశీలన అనంతరం 50 దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేశారు. ఇప్పుడు వాటిని కూడా మరింత వడబోసి ముగ్గురి పేర్లతో జాబితాను ఖరారు చేశారు. వీటిలో ఒకరి పేరును టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా ఎంపిక చేస్తారు.

టి.ఎస్.పి.ఎస్.సి. చైర్మన్ తో పాటు పది మంది సభ్యులు...

TSPSC చైర్మన్‌తో పాటు, 10 మంది సభ్యులతో పాలకమండలి ఉంటుంది. వీరిలో సగం మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసి ఉండాలన్నది నిబంధన. దీంతో ఇప్పుడు బోర్డు ఎంపికలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఛైర్మన్‌గా ICS, రిటైర్డ్‌ IPS, పలువురు ప్రొఫెసర్స్ పేరును పరిశీలించింది. చైర్మన్‌గా మంచి ట్రాక్‌ రికార్డ్ ఉన్న IPS అధికారిని ఎంపిక చేస్తే నిరుద్యోగుల్లో నమ్మకం వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనగా ఉంది. దీంతో మొన్నటిదాకా డీజీపీగా పని రిటైర్ అయిన IPS అధికారి ఎం.మహేందర్ రెడ్డి పేరును సీఎం రేవంత్ ఖరారు చేసినట్టు సమాచారం. మాజీ IAS ఆకునూరి మురళీ, ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్, నాగేశ్వర్‌ పేర్లను పరిశీలించినప్పటికీ... TSPSC నిబంధనల మేరకు వయస్సు పరిమితి సరిపోవడం లేదు. దీంతో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు ఒక్క దాన్నే ఖరారు చేసి గవర్నర్ అనుమతి కోసం పంపినట్టు సమాచారం. గవర్నర్ ఆమోదం తర్వాత ఛైర్మన్ తో పాటు పది మంది సభ్యుల్ని నియమిస్తారు.

ఎవరీ మహేందర్ రెడ్డి, ఏమా కథ...

మహేందర్ రెడ్డికి పోలీసు ఆఫీసర్ గా మంచి పేరుంది. 1962 డిసెంబర్ 3న ఖమ్మం జిల్లాలో జన్మించిన ముదిరెడ్డి మహేందర్ రెడ్డి 1986 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్. హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా పని చేశారు. 2018 ఏప్రిల్ నుంచి డీజీపీగా ఉంటూ ఇటీవల రాజీనామా చేశారు. ఆయన ప్రస్తుత వయసు 61. వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ చేసిన మహేందర్ రెడ్డి ఢిల్లీలోని ఐఐటీలో ఎంటెక్ చేశారు. నిత్య చదువరి అయిన మహేందర్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ పరసనల్ మేనేజ్మెంట్ లో పట్టా తీసుకున్నారు. 2020లో హైదరాబాద్ లోని జేఎన్టీయూ నుంచి పి.హెచ్.డీ. పట్టాను పొందారు. గుంటూరు, గోదావరి ఖనిలో ఏఎస్పీగా పని చేసిన మహేందర్ రెడ్డి అమెరికా, ఇంగ్లాండ్ లో కూడా అధ్యయనం చేసి వచ్చారు.

Read More
Next Story