రేవంత్ అమెరికా టూర్లో వేల కోట్ల ఒప్పందాలు
x
Revamth with Monarch Tractors CEO

రేవంత్ అమెరికా టూర్లో వేల కోట్ల ఒప్పందాలు

అమెరికా పర్యటనలో అంతర్జాతీయస్ధాయి కంపెనీల యాజమాన్యాలతో రు. 31 వేల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నారు.


పెట్టుబడుల ఆకర్షణ కోసం రేవంత్ జరుపుతున్నవిదేశీ పర్యటన విజయవంతమైందా ? ఇప్పటికైతే అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే పదిరోజుల అమెరికా పర్యటన ముగించుకుని రెండు రోజుల దక్షిణకొరియాకు చేరుకున్నారు. అమెరికా పర్యటనలో అంతర్జాతీయస్ధాయి కంపెనీల యాజమాన్యాలతో రు. 31 వేల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాలన్నీ ఆచరణలోకి వస్తే సుమారు 31 వేల మంది ఉద్యోగ, ఉపాధి లభిస్తుంది.

పదిరోజుల పర్యటనలో కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసియం, కార్నింగ్, ఆమ్ జెన్, జొయ్ టిస్, హెచ్సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ లాంటి అనేక కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల వచ్చే లాభలు, తెలంగాణాకు ఏ విధంగా లాభమో వివరించి చెప్పారు. అంటే పారిశ్రామికవేత్తలతో సమావేశమైనపుడు ఇటు రాష్ట్రానికి అటు కంపెనీలకు విన్ విన్ సిట్యుయేషన్ అన్నట్లుగా రేవంత్ వివరించారు. దాంతో చాలా కంపెనీల యాజమాన్యాలు తెలంగాణాలో(హైదరాబాద్) పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించాయి. మొత్తం 50 కంపెనీల యాజమాన్యాలతో రేవంత్ భేటీ అయితే ఒప్పందాలు చేసుకున్నది 19 కంపెనీలు.

రేవంత్ దృష్టంతా హైదరరాబాద్ ను ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేయటంపైనే ఉంది. ఇప్పటికే ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కు ధీటుగా మరో బాద్ ను డెవలప్ చేయాలని పట్టుదలగా ఉన్నారు. అందుకనే మహేశ్వరం, ఇబ్రహింపట్నం నియోజకవర్గాల పరిధిలోని ముచ్చర్ల గ్రామం ఏరియాలో సుమారు 20 వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీల రీసెర్చి, డెవలప్మెంట్, గేమింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వివిధ స్టార్టప్ కంపెనీల ఏర్పాటుతో పై ప్రాంతాన్ని ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేస్తే తన పేరు చిరస్ధాయిగా నిలిచిపోతుందని రేవంత్ భావిస్తున్నారు. అందుకనే ఇంత పట్టుదలగా అమెరికా, దక్షిణకొరియాలోని అనేక కంపెనీల యాజమాన్యాలతో భేటీ అవుతున్నది.

తన అమెరికా పర్యటనలో పారిశ్రామికవేత్తలతో జరిగిన భేటీలు తెలంగాణా సరికొత్త భాగస్వామ్యానికి తెరలేపిందని రేవంత్ అంటున్నారు. తమ ఫ్యూచర్ సిటి ప్రణాళికలకు అమెరికాలోని చాలామంది పారిశ్రామికవేత్తల నుండి మద్దతు లభించినట్లు రేవంత్ అభిప్రాయపడుతున్నారు. తెలంగాణా లక్ష్యాలకు అనుగుణంగా, రాష్ట్రాభివృద్ధికి దోహదపడేలా తెలంగాణాలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావటం, ఒప్పందాలు చేసుకోవటం శుభసూచకమని రేవంత్ అన్నారు.

కాగ్నిజెంట్ రెండో సెంటర్ విస్తరణ, అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు లాంటి కీలకమైన ఒప్పందాలు కూడా రేవంత్ పర్యటనలో జరిగాయి. వీటితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ లాంటి వాటితో తెలంగాణాలో కొత్తగా హైపర్ స్కిల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయటం చాలా మంచిదని రేవంత్ చెప్పారు. దశలవారీగా తెలంగాణాకు రాబోతున్న కంపెనీల కారణంగా వేలాదిమంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటం ఖాయం. చేసుకున్న ఒప్పదాలన్నీ కార్యరూప దాల్చితే రేవంత్ విదేశీ పర్యటన సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.

ఈ విషయం ఇంత నొక్కి చెప్పటం ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి లేదా మంత్రులు విదేశీ పర్యటనలు చేసినా చాలా కంపెనీలు పెట్టుబడులు పెడతామంటు ఆసక్తి చూపటం సహజం. సాధారణంగా అవన్నీ ప్రచారానికి మాత్రమే పనికొస్తుంది. అయితే చేసుకున్నఒప్పందాలు కార్యాచరణలోకి రావాలంటే పర్యటన తర్వాత జరగాల్సిన తంతు చాలా ఉంటుంది. ప్రభుత్వం నిరంతరం కంపెనీల యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతు వాళ్ళతో టచ్ లో ఉంటే కాని చేసుకున్న ఒప్పందాలు సాకారం కావు. గతంలో చాలామంది ముఖ్యమంత్రులు, మంత్రులు పెట్టుబడుల కోసం విదేశాలకు లేదా దావోస్ లో పర్యటించారు. అప్పుడు చేసుకున్న ఒప్పందాల్లో ఎన్ని కంపెనీలు వాస్తవంగా పెట్టుబడులు పెట్టాయంటే చెప్పటం కష్టమే. కాబట్టి ఇపుడు రేవంత్ పర్యటన కూడా కేవలం ప్రచారం కోసమే అన్నట్లుగా కాకుండా వాస్తవరూపం దాల్చితేనే రాష్ట్రంలోని యువతకు మంచిది.

Read More
Next Story