‘నైతిక విలువలును వదిలేశారు’.. కేసీఆర్, రేవంత్‌లపై కిషణ్ విసుర్లు..
రేవంత్ రెడ్డి, కేసీఆర్ టార్గెట్‌గా కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
రేవంత్ రెడ్డి(Revanth Reddy), కేసీఆర్(KCR) టార్గెట్‌గా కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) విమర్శలు గుప్పించారు. వారిద్దరూ కూడా నైతిక విలువలకు నీళ్లు వదిలేశారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్‌గా మారాయంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కూడా ఒకే విధమైన పాలనను అందిస్తున్నాయమంటూ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదని, ప్రజలు అప్పుడు ఎంత ఇబ్బండి పడ్డారో.. ఇప్పుడు కూడా అంతే ఇబ్బంది పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా రాజకీయాల్లో నైతిక విలువలను మరిచారంటూ ధ్వజమెత్తారు.
కేసీఆర్ రూ.7లక్షల కోట్లు అప్పులు చేస్తే.. రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకేసి అప్పుల తీసుకురావడం కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌నే రెడీ చేశారంటూ విసుర్లు విసిరారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే పరమావధిగా వీరి పాలన ఉందంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు కేసీఆర్, రేవంత్ రెడ్డి చేపట్టి ఏ ఒక్క పనైనా రాష్ట్రానికి మేలు చేసేదిగా ఉందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. వీరిద్దరూ కూడా కేవలం తమ పార్టీల, సొంత మేలు కోసమే పాలించారు కానీ రాష్ట్రం కోసం కాదంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ అభివృద్ధి ముసుగులో వారు తమ సొంత అభివృద్ధికి పెద్ద పీట వేశారని, అందుకు రాష్ట్రంలో ఇప్పటికి కనిపిస్తున్న నిరుద్యోగ, వ్యసాయ, విద్యుత్ సహా ఇతర సమస్యలే ప్రధాన కారణమని కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజల కోసం ఏం చేశారు రేవంత్ సారూ..
‘‘రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం ఏం చేశారు. రైతు భరోసా, రుణమాఫీ లేదు. పింఛన్లు పెంచుతామని భరోసా ఇచ్చి ఆ హామీని కట్టుకథగా మార్చారు. ఎన్నో ఆశలతో ఓటు వేసి గెలిపించిన పింఛన్‌దార్లకు ఒక్క రూపాయి కూడా పెంచలేదీ ప్రభుత్వం. కొత్త పింఛన్లు కూడా మంజూరు చేయలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే సీఎం హోదాలో ఉన్నామని మారుస్తూ రేవంత్ రెడ్డి.. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ ఆయన గాలికి వదిలేయడం తప్పు కాదు కానీ.. ప్రశ్నించడం మాత్రం తప్పు అన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఉందంటూ విమర్శించారు. తెలంగాణలో చేస్తున్నది చాలదన్నట్లుగా ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తెలంగాణను సస్యశ్యామలం చేసినట్లు మాట్లాడుతున్నారు. ఇంతకన్నా పెద్ద అబద్ధాలు ఏమైనా ఉంటాయా?’’ అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.
అంతా కాంగ్రెస్ పార్టీనే చేసింది..
‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కూడా దొందు దొందులానే ప్రవర్తిస్తున్నాయి. చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవడమే పరమావధిగా ముందుకెళ్తున్నాయి. కేవలం బీజేపీ మాత్రమే నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ బూత్‌ల కమిటీల నియామాకాలను బీజేపీ చేపట్టనుంది. ఈ నెల 22న ఢిల్లీలో పార్టీ సంస్థాగత సమావేశాలు జరగనున్నాయి. వాటిలో మండల, జిల్లా ఎన్నికల తేదీలు వస్తాయి. తెలంగాణలో పనిచేయడానికి గుత్తేదారులు ముందుకు రావడం లేదు. దేశంలో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉండి.. ఆ మూడు రాష్ట్రాలను భ్రష్టు పట్టించింది’’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.