రేవంత్ అన్నా ధన్యవాదాలు అన్నా,సింగర్ రాహుల్ సిప్లిగుంజ్ స్పందన
x

రేవంత్ అన్నా ధన్యవాదాలు అన్నా,సింగర్ రాహుల్ సిప్లిగుంజ్ స్పందన

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో చేసిన వ్యాఖ్యలపై సింగర్ రాహుల్ సిప్లిగుంజ్ స్పందించారు.


హైదరాబాద్ మన పిల్లోడు రాహుల్ సిప్లిగుంజ్ కు గద్దర్ అవార్డు ఇవ్వమని సీఎం ఎ రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు సూచించారు. ‘‘మన హైదరాబాద్ పిల్లోడు రాహుల్ సిప్లిగుంజ్ ఓల్డ్ సిటీ గల్లీ నుంచి అస్కార్ అవార్డు వరకు రాణించాడు, ఈయనకు కూడా ఏదైనా అవార్డు ఇవ్వండి’’అని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం కోరారు. ‘‘రాహుల్ ఫీల్ అవ్వకు నీకు న్యాయం చేస్తా’’అని సీఎం పేర్కొన్నారు. గతంలోనూ తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో పాటలతో రాహుల్ అదరగొట్టి సీఎం రేవంత్ నుంచి సత్కారం పొందారు.


సీఎం వ్యాఖ్యలపై రాహుల్ సిప్లిగుంజ్ స్పందన
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సింగర్ రాహుల్ సిప్లిగుంజ్ స్పందించారు. ‘‘ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో నేను మిస్ అవుతున్నట్లు అనిపించింది...కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు మరోసారి హైదరాబాద్ గల్లీల్లో పెరిగిన కళాకారుడిని గుర్తించి గౌరవించడం ద్వారా తన గొప్పతనాన్ని చాటుకున్నారు.రేవంత్ అన్నా, ఇంత ప్రతిష్ఠాత్మక వేదికపై మీరు నా గురించి మాట్లాడిన విధానం నన్ను నిజంగా భావోద్వేగానికి గురిచేసింది,చాలా ధన్యవాదాలు అన్నా. మరపురాని క్షణం ’’ అంటూ సింగర్ రాహుల్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.

కళాకారుల పట్ల చూపిస్తున్న ప్రేమ ప్రశంసనీయం
ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క సార్ నుంచి వచ్చిన హృదయపూర్వక స్పందన, ప్రోత్సాహం నాకు మరింత ఆనందాన్ని తెచ్చిపెట్టింది, నేను ఎల్లప్పుడూ విలువైన క్షణంగా భావిస్తాను.చాలా ధన్యవాదాలు సార్ అంటూ సింగర్ రాహుల్ వ్యాఖ్యానించారు. కళాకారుల పట్ల తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న ప్రేమ,మద్దతు నిజంగా ప్రశంసనీయం.
జై తెలంగాణ అంటూ రాహుల్ సిప్లిగుంజ్ పేర్కొన్నారు.


Read More
Next Story